జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీఎం తదితరులు
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా కత్తెర పురుగును కంట్రోల్ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మొక్కజొన్న, జొన్న పంటలను ఆశిస్తున్న కత్తెర పురుగు పెరగకూడదని శాస్త్రవేత్తలను ఆదేశించామని అన్నారు. దీని నివారణకు పురుగు మందులు లేవని తెలిపారు. రసాయనాల ద్వారా సాధ్యం కాని కత్తెర పురుగు నివారణ ప్రకృతి వ్యవసాయం ద్వారా సాధ్యమైందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో అచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో శనివారం ప్రారంభమైన సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇచ్చి, ప్రోత్సహిస్తున్న పాలేకర్‌ను చంద్రబాబు అభినందించారు.
ఉద్యమంలా ప్రకృతి వ్యవసాయం
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 3,015 గ్రామాల్లో 5.23 లక్షల మంది రైతులు 5.04 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. 2013–14లో వ్యవసాయ రంగానికి సంబంధించి రూ.1.28 లక్షల కోట్ల ఆదాయం ఉండగా, 2017–18కి ఈ ఆదాయం రూ.2.53 లక్షల కోట్లకు చేరిందని చంద్రబాబు తెలిపారు.
ఎకరాలో రూ.6 లక్షల దాకా ఆదాయం
ప్రపంచమంతటా ఆహార భద్రతకు సంబంధించి సంక్షోభం నెలకొందని ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ అన్నారు. భూతాపం పెరుగుతోందని, వ్యవసాయ భూమి తగ్గుతోందని వివరించారు. ఒక ఎకరా భూమిలో పంటల సాగు ద్వారా రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల ఆదాయం వచ్చేలా రైతులు శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment