అరకొర రుణమాఫీకీ వాయిదా బేరం | Preparations for post dated checks distribution | Sakshi
Sakshi News home page

అరకొర రుణమాఫీకీ వాయిదా బేరం

Published Mon, Feb 11 2019 4:27 AM | Last Updated on Mon, Feb 11 2019 10:01 AM

Preparations for post dated checks distribution - Sakshi

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రైతుల వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తాం... తొలి సంతకం కూడా దానిపైనే..’ అని గత ఎన్నికల ముందు ప్రకటించి అధికారంలోకి వచ్చాక ఆ హామీని నెరవేర్చకుండా అన్నదాతలను అప్పుల ఊబిలోకి గెంటేసి వంచించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల ముంగిట మరోసారి ప్రలోభాల వల విసిరేందుకు పోస్ట్‌ డేటెడ్‌ చెక్కుల పంపిణీకి తెర తీస్తున్నారు. చంద్రబాబు అధికారం చేపట్టాక రుణమాఫీపై కోటయ్య కమిటీ ఏర్పాటుతోపాటు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ తదితర వడపోతలతో  రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను వడ్డీలకు కూడా సరిపోని విధంగా రూ.24 వేల కోట్లకు కుదించి చివరకు వాటిని కూడా పూర్తిగా చెల్లించకపోవడంతో రైతులు నిండా అప్పుల్లో మునిగారు. బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలను రుణమాఫీ నుంచి తొలగించడంతోపాటు కుటుంబానికి కేవలం రూ.1.5 లక్షలు మాత్రమే మాఫీ చేస్తామంటూ పలు ఆంక్షలు విధించారు. దీంతో మాఫీ చాలామందికి వర్తించలేదు.

మార్చిలో చెల్లుబాటు అయ్యేలా చెక్కులు
రాష్ట్ర ప్రభుత్వం నాల్గో విడత, ఐదో విడత రుణమాఫీ కింద రైతులకు చెల్లించాల్సిన రూ.8,832 కోట్లను ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికల ముందు 4, 5వ విడత మాఫీ డబ్బులకు పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే నెలలో ఇవి చెల్లుబాటు అయ్యేలా చెక్కుల తయారీ కోసం ఈనెల 15వ తేదీలోగా  వివరాలను అందజేయాలని సహకార, వాణిజ్య బ్యాంకులకు  రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేసింది. నాలుగు, ఐదో విడత రుణమాఫీ సొమ్మును లబ్ధిదారుల సేవింగ్‌ ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులన్నీ అర్హత కలిగిన వారి వివరాలను పంపాలని ప్రభుత్వం కోరింది. ఖాతాదారుడి పూర్తి పేరు, సేవింగ్స్‌ ఖాతా నెంబర్, సహకార సంఘం, బ్రాంచీలో సీకేసీసీ ఖాతా నెంబరు, బ్యాంకు బ్రాంచి పేరు, ఐయఫ్‌యస్‌సి కోడ్‌ వివరాలతో పాటు నాలుగు, ఐదవ విడత మొత్తం వివరాలను పంపాలని ప్రభుత్వం పేర్కొంది. 

మాఫీపై గవర్నర్‌తో సభలో అవాస్తవాలు..
రాష్ట్రంలో రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశామంటూ సాక్షాత్తూ అసెంబ్లీలో రాజ్యాంగ అధిపతి అయిన గవర్నర్‌ చేత ప్రభుత్వం అవాస్తవాలను చెప్పించింది. సమాచారశాఖ జారీ చేసిన ప్రకటనల్లో కూడా రైతులకు రూ.24 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు అసత్యాలను ప్రచారం చేస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో రైతుల వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్ల దాకా ఉన్నాయి. ఈ రుణాలన్నింటినీ మాఫీ చేయాల్సి ఉండగా చంద్రబాబు మాట తప్పడంతో రైతులపై వడ్డీల మీద వడ్డీల భారం పడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రుణ మాఫీ చేయకపోవడంతో  రైతులు డిఫాల్టర్లుగా మారారు.

మరోవైపు వారికి బ్యాంకుల నుంచి అప్పులు పుట్టకుండా చేశారు. దీంతో పొలం పనుల కోసం ప్రైవేట్‌ వ్యాపారస్తుల నుంచి ఎక్కువ వడ్డీలకు రుణాలు తీసుకుంటూ అప్పుల ఊబిలోకి వెళ్లిపోతున్నారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలంతా బంగారం కుదువ పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలని, బాబు రాగానే బంగారాన్ని విడిపించి ఇస్తారంటూ ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బంగారంపై తీసుకున్న రుణాలను మాఫీ చేయబోనని ప్రకటించారు. దీంతో బ్యాంకులు రైతుల బంగారాన్ని వేలం వేశాయి. దీన్ని తట్టుకోలేక పరువుపోయిందనే బాధతో పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో రైతుల అప్పులు పెరిగినట్లు జనవరి 25వ తేదీన జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం అజెండా కూడా స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement