ఆ జాబితాను బ్యాంకులు తనిఖీ చేయాలి.. గ్రామసభలో చర్చించాలి
బంగారంపై ఉన్న పంట రుణాలూ మాఫీ... కుటుంబంలో ఒక్కరికే వర్తింపు
రుణమాఫీపై రాష్ట్ర వ్యవసాయశాఖ కసరత్తు.. మార్గదర్శకాల ఖరారులో నిమగ్నం
రెండు మూడు బ్యాంకు ఖాతాలున్నా రెండు లక్షలే మాఫీ
త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్న వ్యవసాయశాఖ
పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం అర్హతల అమలుపై అస్పష్టత
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీకి సంబంధించి అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆయా రైతుల జాబితాను బ్యాంకులతో కలిసి అధికారులు తయారు చేయాలని యోచిస్తోంది. అనంతరం గ్రామసభలో చర్చించి తుది జాబితా సిద్ధం చేస్తారని అధికారులు అంటున్నారు. పంట రుణమాఫీ మార్గదర్శకాలపై వ్యవసాయశాఖ కసరత్తు ముమ్మరం చేసింది.
త్వరలో మార్గదర్శకాలు ఖరారు చేయనున్న నేపథ్యంలో అందులో ఉండాల్సిన అంశాలపై వ్యవసాయశాఖ అధికారులు తలమునకలయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీనాటికి పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు రూ. 31 వేల కోట్లు ఖర్చు అవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించిన సంగతి విదితమే.
రుణమాఫీ మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయని కూడా సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అందులో ఎలాంటి అంశాలు చేర్చాలన్న దానిపై అధికారులు చర్చి స్తున్నారు. గతంలో రుణమాఫీ అమలు సందర్భంగా విడు దల చేసిన మార్గదర్శకాలను కూడా అధ్యయనం చేస్తు న్నారు. దాదాపు అవే మార్గదర్శ కాలు ఉంటాయని వ్యవసాయ శాఖవర్గాలు అంటున్నాయి. పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంటున్నారు.
పాస్‌పుస్తకం జత చేసి బంగారు రుణాలు తీసుకున్న వాటికి మాత్రమే....
అసలు, వడ్డీ కలిపి ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రైతు కుటుంబం అంటే..భార్య, భర్త, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటే... వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు.
గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్ పుస్తకంతో కలిపి బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ పథకం వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. పట్టణ ప్రాంతాల్లో తీసుకున్న బంగారు రుణాలకు ఇది వర్తించదని తెలిపారు. గతంలో ఈ తరహా నిబంధనలనే అమలు చేశారు. ఇప్పు డు కూడా వాటినే అమలు చేయనున్నారు.
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, కోఆపరేటివ్ క్రెడిట్ సంస్థలు (అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌లతో సహా), గ్రామీణ బ్యాంకులు రైతులకు పంపిణీ చేసిన రుణా లు, బంగారంపై తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తారు. అయితే పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం అందులో ఉన్న అర్హతలను రుణమాఫీకి అమలు చేస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కొన్ని నిబంధనలను మాత్రం తీసుకుంటారని, పూర్తిగా దాన్నే రుణమాఫీ పథకానికి వర్తింపజేయరని అంటున్నారు.
మార్గదర్శకాల్లో చేర్చాల్సిన అంశాల్లో ముఖ్యాంశాలు..
» రైతులకు రుణమాఫీ అందజేయడానికి అర్హులైన లబ్ధి దారుల డేటా సేకరణ, ప్రాసెసింగ్‌కు పోర్టల్‌ను అభివృద్ధి చేయాలి.
» పంట రుణ బకాయిలున్న రైతుల జాబితాను సిద్ధం చేసి వాటిని బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వాటిని చెక్ చేయాలి. రెండు లక్షల వరకు పరిమితమైన రైతుల తుది జాబితాను బ్యాంక్ బ్రాంచీలో సిద్ధం చేయాలి. అందుకు సంబంధించిన ఒక కాపీని జిల్లా కలెక్టర్‌కు పంపాలి.
» అర్బన్, మెట్రోపాలిటన్ బ్యాంకులు, బ్యాంకు శాఖల పంట రుణాలు పొందిన బంగారు రుణాలు మాఫీ చేయరు. అయితే ఆయా బ్యాంకులు గ్రామీణ బ్రాంచీలు ఉంటే అక్కడ తీసుకున్న బంగారు రుణాలు మాఫీ చేస్తారు.
» కొంతమంది రైతులు ఒకే బ్యాంకుకు చెందిన ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు శాఖల నుంచి పంట రుణాలు తీసుకొని ఉండవచ్చు. అందువల్ల నకిలీ లేదా మల్టీపుల్ ఫైనాన్సింగ్‌ను తొలగిస్తారు. అందుకు జాయింట్ మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ ద్వారా మండల స్థాయిలో బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేస్తారు. రుణమాఫీకి అర్హులైన వారందరికీ వ్యవసాయ భూములున్నాయో లేదో ధ్రువీకరిస్తారు.
» ఒక రైతు కుటుంబానికి వివిధ బ్యాంకు ఖాతాలు ఉన్నా, పంటరుణం మొత్తం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అర్హత ఉన్న మాఫీ మొత్తం కుటుంబ సభ్యుల మధ్య దామాషా ప్రకారం విభజిస్తారు.
» తహసీల్దార్, ఎంఏఓ, ఎంపీడీఓలతో కూడిన మండల స్థాయి అధికారుల బృందం సంబంధిత గ్రామానికి చెందిన ఏఈఓ, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు రైతు వివ రాలు సేకరిస్తారు. ఆయా రైతుల సమగ్ర సమాచారాన్ని ధ్రువీకరిస్తారు. సామాజిక తనిఖీ చేస్తారు. గ్రామసభ నిర్వహించడం ద్వారా బ్రాంచి మేనేజర్ అన్ని అభ్యంతరా లను తీసుకుంటారు. అనంతరం బ్యాంకుల రైతుల తుది జాబితా ప్రకటిస్తారు. ఆ జాబితాను కలెక్టర్‌కు పంపిస్తారు.
» జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి బ్యాంకుల వారీగా, రైతుల వారీగా రుణమాఫీకి సంబంధించిన జిల్లా వివరాలు నమోదు చేస్తారు. దాన్ని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)కి పంపిస్తారు. దాన్ని ఐటీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. బ్యాంకుల వారీగా, శాఖల వారీగా, గ్రామాల వారీగా రుణమాఫీకి అర్హులైన రైతుల వివరాలను వ్యవసాయశాఖ డైరెక్టర్‌కు పంపిస్తారు.
» రుణాలు ఇచ్చిన బ్యాంకులే రుణమాఫీకి అర్హులైన లబ్ధిదారుల అర్హత కచ్చితత్వానికి బాధ్యత వహించాలి.
» పంట రుణాన్ని మోసపూరితంగా తీసుకున్నట్టు లేదా రుణమాఫీకి అర్హులు కాదని తేలితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని రైతు నుంచి ఒక హామీని వ్యవసాయశాఖ తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment