List of farmers
-
గ్రామాల వారీగా రుణమాఫీ రైతుల జాబితా
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీకి సంబంధించి అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆయా రైతుల జాబితాను బ్యాంకులతో కలిసి అధికారులు తయారు చేయాలని యోచిస్తోంది. అనంతరం గ్రామసభలో చర్చించి తుది జాబితా సిద్ధం చేస్తారని అధికారులు అంటున్నారు. పంట రుణమాఫీ మార్గదర్శకాలపై వ్యవసాయశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. త్వరలో మార్గదర్శకాలు ఖరారు చేయనున్న నేపథ్యంలో అందులో ఉండాల్సిన అంశాలపై వ్యవసాయశాఖ అధికారులు తలమునకలయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీనాటికి పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు రూ. 31 వేల కోట్లు ఖర్చు అవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించిన సంగతి విదితమే. రుణమాఫీ మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయని కూడా సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అందులో ఎలాంటి అంశాలు చేర్చాలన్న దానిపై అధికారులు చర్చి స్తున్నారు. గతంలో రుణమాఫీ అమలు సందర్భంగా విడు దల చేసిన మార్గదర్శకాలను కూడా అధ్యయనం చేస్తు న్నారు. దాదాపు అవే మార్గదర్శ కాలు ఉంటాయని వ్యవసాయ శాఖవర్గాలు అంటున్నాయి. పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంటున్నారు. పాస్‌పుస్తకం జత చేసి బంగారు రుణాలు తీసుకున్న వాటికి మాత్రమే....అసలు, వడ్డీ కలిపి ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రైతు కుటుంబం అంటే..భార్య, భర్త, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటే... వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్ పుస్తకంతో కలిపి బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ పథకం వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. పట్టణ ప్రాంతాల్లో తీసుకున్న బంగారు రుణాలకు ఇది వర్తించదని తెలిపారు. గతంలో ఈ తరహా నిబంధనలనే అమలు చేశారు. ఇప్పు డు కూడా వాటినే అమలు చేయనున్నారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, కోఆపరేటివ్ క్రెడిట్ సంస్థలు (అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌లతో సహా), గ్రామీణ బ్యాంకులు రైతులకు పంపిణీ చేసిన రుణా లు, బంగారంపై తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తారు. అయితే పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం అందులో ఉన్న అర్హతలను రుణమాఫీకి అమలు చేస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కొన్ని నిబంధనలను మాత్రం తీసుకుంటారని, పూర్తిగా దాన్నే రుణమాఫీ పథకానికి వర్తింపజేయరని అంటున్నారు. మార్గదర్శకాల్లో చేర్చాల్సిన అంశాల్లో ముఖ్యాంశాలు.. » రైతులకు రుణమాఫీ అందజేయడానికి అర్హులైన లబ్ధి దారుల డేటా సేకరణ, ప్రాసెసింగ్‌కు పోర్టల్‌ను అభివృద్ధి చేయాలి.» పంట రుణ బకాయిలున్న రైతుల జాబితాను సిద్ధం చేసి వాటిని బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వాటిని చెక్ చేయాలి. రెండు లక్షల వరకు పరిమితమైన రైతుల తుది జాబితాను బ్యాంక్ బ్రాంచీలో సిద్ధం చేయాలి. అందుకు సంబంధించిన ఒక కాపీని జిల్లా కలెక్టర్‌కు పంపాలి.» అర్బన్, మెట్రోపాలిటన్ బ్యాంకులు, బ్యాంకు శాఖల పంట రుణాలు పొందిన బంగారు రుణాలు మాఫీ చేయరు. అయితే ఆయా బ్యాంకులు గ్రామీణ బ్రాంచీలు ఉంటే అక్కడ తీసుకున్న బంగారు రుణాలు మాఫీ చేస్తారు. » కొంతమంది రైతులు ఒకే బ్యాంకుకు చెందిన ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు శాఖల నుంచి పంట రుణాలు తీసుకొని ఉండవచ్చు. అందువల్ల నకిలీ లేదా మల్టీపుల్ ఫైనాన్సింగ్‌ను తొలగిస్తారు. అందుకు జాయింట్ మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ ద్వారా మండల స్థాయిలో బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేస్తారు. రుణమాఫీకి అర్హులైన వారందరికీ వ్యవసాయ భూములున్నాయో లేదో ధ్రువీకరిస్తారు. » ఒక రైతు కుటుంబానికి వివిధ బ్యాంకు ఖాతాలు ఉన్నా, పంటరుణం మొత్తం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అర్హత ఉన్న మాఫీ మొత్తం కుటుంబ సభ్యుల మధ్య దామాషా ప్రకారం విభజిస్తారు. » తహసీల్దార్, ఎంఏఓ, ఎంపీడీఓలతో కూడిన మండల స్థాయి అధికారుల బృందం సంబంధిత గ్రామానికి చెందిన ఏఈఓ, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు రైతు వివ రాలు సేకరిస్తారు. ఆయా రైతుల సమగ్ర సమాచారాన్ని ధ్రువీకరిస్తారు. సామాజిక తనిఖీ చేస్తారు. గ్రామసభ నిర్వహించడం ద్వారా బ్రాంచి మేనేజర్ అన్ని అభ్యంతరా లను తీసుకుంటారు. అనంతరం బ్యాంకుల రైతుల తుది జాబితా ప్రకటిస్తారు. ఆ జాబితాను కలెక్టర్‌కు పంపిస్తారు. » జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి బ్యాంకుల వారీగా, రైతుల వారీగా రుణమాఫీకి సంబంధించిన జిల్లా వివరాలు నమోదు చేస్తారు. దాన్ని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ)కి పంపిస్తారు. దాన్ని ఐటీ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. బ్యాంకుల వారీగా, శాఖల వారీగా, గ్రామాల వారీగా రుణమాఫీకి అర్హులైన రైతుల వివరాలను వ్యవసాయశాఖ డైరెక్టర్‌కు పంపిస్తారు. » రుణాలు ఇచ్చిన బ్యాంకులే రుణమాఫీకి అర్హులైన లబ్ధిదారుల అర్హత కచ్చితత్వానికి బాధ్యత వహించాలి. » పంట రుణాన్ని మోసపూరితంగా తీసుకున్నట్టు లేదా రుణమాఫీకి అర్హులు కాదని తేలితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని రైతు నుంచి ఒక హామీని వ్యవసాయశాఖ తీసుకోవాలి. -
పీఎం కిసాన్.. అర్హులెవరు.. అనర్హులెవరు?
సాక్షి, హైదరాబాద్: పీఎం–కిసాన్ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం వేగం పెంచింది. పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను బుధవారం విడుదల చేసింది. పీఎం–కిసాన్ పథకం కింద గుర్తించిన లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా ప్రదర్శిస్తామని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఒకవేళ అర్హులై ఉండి జాబితాలో పేరు లేకుంటే అధికారులకు విన్నవించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నెల 25వ తేదీ నాటికి రాష్ట్రంలో ఉన్న అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేసి పీఎం–కిసాన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. మొదటి విడత సొమ్మును పొందడానికి ఏడాదిపాటు అవకాశం కల్పించారు. అంటే, ఈ నెల 25వ తేదీ నాటికి అర్హులైన రైతుల జాబితాను ఒకవేళ అప్లోడ్ చేయకపోయినా, ఆ తర్వాత పంపించినా రైతులకు ఏడాదికాలంలో ఎప్పుడైనా సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రారంభించి, కోడ్ ఉన్నప్పటికీ తర్వాత కొనసాగించాలన్నదే కేంద్ర సర్కారు వ్యూహంగా ఉంది. ఐదెకరాలలోపు ఉన్న ఒక కుటుంబం మాత్రమే రూ.6 వేలు పొందడానికి అర్హత ఉంటుందని నిర్ధారించారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది మార్చి 31 నాటికి సాంకేతికంగా గుర్తింపు పొందిన అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకం వర్తిస్తుంది. కేంద్రం ప్రకటించిన తాజా మార్గదర్శకాల్లోని మరికొన్ని ముఖ్యాంశాలు... రాష్ట్రస్థాయిలో నోడల్ వ్యవస్థ... ►పథకం పర్యవేక్షణకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో కమిటీలు వేస్తారు. జాతీయ స్థాయిలో సమీక్ష కమిటీకి కేబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో సమీక్ష కమిటీలు ఏర్పడతాయి. ►జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలి. ఏదైనా ఫిర్యాదు వస్తే రెండు వారాల్లోగా పరిష్కరించాలి. ►కేంద్రస్థాయిలో ప్రాజెక్టు మానిటర్ యూనిట్(పీఎంయూ)ను ఏర్పాటు చేస్తారు. దానికి ఒక సీఈవో ఉంటారు. ఇది పథకంపై ప్రచారం చేస్తుంది. అవగాహన కల్పిస్తుంది. ►ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో కేంద్రంతో పర్యవేక్షణకు ఒక నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఏదో ఒక ప్రభుత్వశాఖకు ఈ బాధ్యత అప్పగించాలి. ►పథకాన్ని అమలు చేసే వారికి ప్రోత్సాహకాలు ఇస్తారు. ► జిల్లా స్థాయిలో పీఎం–కిసాన్ పోర్టల్‌కు సంబంధించిన లాగిన్ అవకాశం కల్పిస్తారు. రైతులందరి వివరాలు అందులో ఉంటాయి. ► ఏ బ్యాంకు ద్వారా డబ్బును అందజేయాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారణ చేయాలి. పోస్టాఫీసు, సహకార బ్యాంకు, లేదా ఇతర వాణిజ్య బ్యాంకుల్లో ఏవైనా వాటిని గుర్తించాలి. ►లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు చేరుతుంది. ► లబ్ధిదారులకు సొమ్ము చేరిన వెంటనే వారి మొబైల్ ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. వీరంతా అనర్హులే... ►ఉన్నతాదాయ వర్గాలంతా అనర్హులు ►వివిధ సంస్థల కింద ఐదెకరాలలోపు భూమి ఉన్నవారు ► రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉంటే వారికి వర్తించదు ► తాజా, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ తాజా,మాజీ చైర్మన్లు ► కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రస్తుత, రిటైరైన ఉద్యోగులు, అధికారులు అనర్హులు ► స్వయంప్రతిపత్తి, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు కూడా అనర్హులే. (నాలుగో తరగతి ఉద్యోగులు మాత్రం అర్హులు) ►రూ.10 వేలకు మించి పింఛన్ తీసుకునే ఉద్యోగులంతా... ►గతేడాది ఆదాయపు పన్ను చెల్లించిన వారంతా... ►డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సీఏలు, ఆర్కిటెక్ట్‌లు తదితర వృత్తి నిపుణులు కూడా... సొంత ధ్రువీకరణే కీలకం ►లబ్ధిదారులే సొంతంగా తమ అర్హత ధ్రువీకరణపత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. తప్పుడు ధ్రువీకరణపత్రమిస్తే, సొమ్ము వెనక్కి తీసు కుంటారు. చట్టపరమైన చర్యలు చేపడతారు. ► కొన్నిచోట్ల ఎవరైనా నిర్ణీత ఐదెకరాల లోపు భూమిని పలుచోట్ల కలిగి ఉన్నా, ఇద్దరు ముగ్గురు కలసి సాగు చేసుకుంటున్నా వారికీ అందజేస్తారు. ► ఈ నెల ఒకటో తేదీని లబ్ధిదారుల అర్హతకు గడువుగా నిర్ధారించారు. ఏడాది వరకు ఇదే తేదీని ఆధారం చేసుకొని అర్హుల జాబితాను గుర్తిస్తారు. అంటే లబ్ధిదారుల భూమికి సంబంధించి ఎటువంటి మార్పులైనా గతేడాది డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు జరిగి ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటారు. లేకుంటే లేదు. ► లబ్ధిదారుల డేటాబేస్‌ను సమగ్రంగా పంపాలి. గ్రామం, పేరు, వయస్సు, సామాజిక వర్గం, బ్యాంకుఖాతా, ఆధార్, ఫోన్ నంబర్ వంటి వివరాలు పంపాలి. -
ఎట్టకేలకు ఆన్లైన్లో మాఫీ జాబితా
ఆధార్ లేదా ఖాతా నంబర్‌తో వివరాలు వెల్లడి హైదరాబాద్/విజయవాడ బ్యూరో : రుణ మాఫీకి అర్హులైన రైతుల జాబి తాను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆదివారం మధ్యాహ్నం ఆన్లైన్(http://apcbsportal.ap.gov.in/loanstatus)లో పెట్టింది. రూ.50 వేల లోపు రుణాలున్న రైతుల జాబితాను ఇందులో ఉంచినట్లు పేర్కొంది. ఎవరి ఖాతాకు చెందిన వివరాలు వారు చూసుకునే విధంగా జాబితాను ఉంచింది. అయితే, రుణ మాఫీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వం ఇక్కడా మరో పరీక్ష పెట్టింది. రుణం మాఫీ అయిందో లేదో తెలుసుకోవడానికి రేషన్ కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లను లింకు పెట్టింది. వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి ఈ మూడింటిలో ఏదో ఒక దాని ఆధారంగా రుణ మాఫీ వివరాలు తెలుసుకోవచ్చని ప్రకటించింది. దీంతో ఆదివారం సాయంత్రం వివిధ జిల్లాల్లో రైతులు ఆ వెబ్సైట్లో వారి వివరాలు చూసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, సగం మంది రైతులకు వెబ్సైట్ ఓపెన్ కాలేదు. రేషన్ కార్డు, ఆధార్ కార్డుల నంబర్లను పూర్తిగా తీసుకోవడంలేదని గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల రైతులు కొందరు తెలిపారు. కొన్ని జిల్లాల్లోని డీసీసీబీ బ్రాంచిల వివరాలే ఇందులో కనిపించలేదని మరికొందరు చెప్పారు. మరోపక్క వెబ్సైట్లో ఉంచిన జాబితా అంతా గందరగోళంగా ఉంది. ఆధార్ లేదా బ్యాంకు ఖాతా నంబర్ ఎంటర్ చేస్తే కొంత మంది రైతుల వివరాలు ఉంటున్నాయి. మరి కొంత మందివి లేవు. ఒక వ్యక్తి ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే తొలుత ఒక ఖాతాలో రూ.36 వేలు, మరో ఖాతాలో రూ. 13 వేల రుణం ఉన్నట్లు వచ్చింది. పక్కనే కుటుంబ వివరాలు లేవని రాశారు. గంట తరువాత మళ్లీ చూస్తే తొలి జాబితాలో మీ పేరు లేదంటూ ఆన్లైన్లో సమాధానం వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆందోళన నెలకొంది. -
జాబితాల్లో పేర్లు మాఫీ
ఒంగోలు: ఓట్లకోసం రుణమాఫీ అన్నారు. అధికారం దక్కాక కోతలు పెడుతూ రైతులకు వాతలేస్తున్నారు. అరకొర రుణమాఫీ అయినా ఎప్పుడు అమలవుతుందా...తిరిగి తమకు ఎప్పుడు రుణాలు అందుతాయా అంటూ గంపెడాశతో ఎదురుచూస్తున్న రైతాంగానికి షాక్ తగిలింది. ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, రేషన్ కార్డులన్నీ సమర్పించినా జాబితాలో పేర్లు లేవు. అంతే కాదు...ఇద్దరి పేర్లకు ఒకే ఆధార్ నంబర్‌తో రెండు రుణాలు మాఫీకి అర్హత పొందాయని ప్రకటించడం చూస్తుంటే ఆధార్ పారదర్శకతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ప్రతి బ్యాంకులోను రుణగ్రహీతల జాబితాలో ఇదేవిధంగా కోత పడడంతో గందరగోళం నెలకొంది. మంగళవారం ఒంగోలు గాంధీరోడ్డులోని కార్పొరేషన్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ వద్ద రుణమాఫీకి సంబంధించిన రైతుల జాబితాను గోడలకు అంటించారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది రైతులు బ్యాంకు వద్దకు పరిగెత్తారు. ఆ జాబితాల్లో పేర్లు లేకపోవడంతో మెజార్టీ రైతులు తీవ్ర నిరాశ చెందారు. ఒంగోలు యూనియన్ బ్యాంకులో మొత్తం 940 వరకు పేర్లను ప్రకటించారు. వాటిలో కేవలం ఆధార్ అంశాన్ని మాత్రమే ప్రకటించారు తప్ప రేషన్ కార్డు ప్రస్తావనే లేదు. వాటిలో 832 పేర్లను అర్హులుగా ప్రకటిస్తున్నట్లుగా ఉంది. 108 పేర్లను మాత్రం ‘ఆధార్ ఇన్ వాలీడ్’ అంటూ ప్రకటించారు. అయితే తాము కార్డులిచ్చినా పేర్లు రాకపోవమేమిటని బ్యాంకు అధికారులను రైతులు నిలదీసినా ఫలితం లేకుండా పోయింది. తాను రుణమాఫీకి అన్ని విధాలా అర్హుడినని, అన్ని ప్రతులు అందించినా తన పేరు లేకపోవడం ఏమిటంటూ పలువురు రైతులు కళ్లనీళ్లపర్యంతమయ్యారు. తాము అన్ని ఖాతాలను ఎస్‌ఆర్‌డీహెచ్‌కు పంపామని, కానీ ఎందుకు మిగిలిన పేర్లు రాలేదో తెలియదంటూ బ్యాంకు మేనేజర్ సైతం చెబుతుండడం గమనార్హం. మరోమారు తమకు ప్రతులు అందజేస్తే స్టేట్ రెసిడెంట్ హబ్‌లో ఫీడ్ చేస్తామని చెప్పి తప్పించుకున్నారు. కొంతమంది రైతులు ఆ క్షణంలోనే సంబంధిత ప్రతులను అందించినా ఎస్ఆర్డీహెచ్ వెబ్సైట్ మాత్రం తాజా వివరాలను స్వీకరించడంలేదని సమాచారం. పర్చూరులోని ఒక బ్యాంకులో అయితే దాదాపు 4500 రుణ ఖాతాలను ఫీడ్ చేస్తే అందులో కేవలం 1200 మాత్రమే రుణమాఫీకి అర్హత సాధించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆధార్‌పైనా అనుమానాలే... ఆధార్ నెంబర్ ద్వారా అన్నింటినీ ఫ్రక్షాళన చేస్తాం. రుణమాఫీకి అర్హత పొందిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా రుణాన్ని రద్దుచేస్తాం అంటూ ప్రకటించిన ప్రభుత్వం స్థానిక యూనియన్ బ్యాంకు అధికారులు ప్రకటించిన జాబితాను చూస్తే ఆధార్‌పైనా సందేహాలు తలెత్తుతున్నాయి. జాగర్లమూడి సామ్రాజ్యలక్ష్మి అనే మహిళ రుణఖాతా నంబర్ 330705030000815 అని, ఆమె ఆధార్ నంబర్ 865941715450 అంటూ ఆధార్ వాలిడ్ అంటూ ప్రకటించారు. అయితే ఇదే ఆధార్ నంబర్‌తో ఆరు రుణ ఖాతాలను కలిగిన జాగర్లమూడి శంకరయ్య పేరుమీద కూడా ఉండడం గమనార్హం. అతని ఖాతాలు 330705030000556, 330706040027962, 3307065 40021207 (వీటికి ఫిమేల్ అని పడింది), 330706540021643, 330706540021720, 3307065 40022104 (మేల్) అంటూ ఇవన్నీ కూడా వాలీడ్ అని ప్రకటించారు. ఒకే ఆధార్ నెంబర్ రెండు పేర్లకు ఎలా వాలిడ్ అయిందని బ్యాంకర్లను ప్రశ్నిస్తే సమాధానం లేదు. అన్నీ ఇచ్చా ...ఎందుకు తన పేరులేదో తెలియడంలేదు: మంగమూరు వాసి నల్లూరి శీతారామయ్య రుణమాఫీ కోసం అన్ని పత్రాలు ఇచ్చా. నా పేరు లేదు. బ్యాంకు మేనేజర్‌ను అడిగితే ఎందుకు రాలేదో తెలియదంటున్నారు. నాకు రెండు ఖాతాలకు సంబంధించి రూ1.77లక్షలు తీసుకున్నాను. అధికారులే నాకు న్యాయం చేయాలి. ఏ విధంగా చూసినా అర్హుడ్నే: చుండూరి భాస్కర్, వెంకట్రాజుపాలెం రెండున్నర ఎకరాల పొలం ఉంది. బంగారం కుదువపెట్టి రూ.1.25 లక్షలు రుణం తీసుకున్నా. రుణమాఫీ జాబితాలో నా పేరు లేదు. జన్మభూమి కమిటీకి వచ్చిన జాబితాలో కూడా నా పేరులేదు. మేనేజర్‌ను అడిగితే మళ్లీ ప్రతులు ఇమ్మంటున్నారు. నాకు జరిగిన అన్యాయానికి ఎవర్ని కలవాలో కూడా అర్థం కావడంలేదు. మాకు అన్యాయమే జరిగింది: దాచర్ల లక్ష్మీనారాయణ మాకు ఏడున్నర ఎకరాల పొలం ఉంది. నా భార్య దాచర్ల విజయనిర్మల పేరుతో రూ.2.50 లక్షలు కామేపల్లి బ్యాంకులో తీసుకున్నాం. ఇప్పుడు రుణమాఫీ జాబితాలో మా పేరులేదని వచ్చింది. ఇదేమిటని అడిగితే బ్యాంకర్లు సమాధానం చెప్పలేకపోతున్నారు. పరిశీలన నిమిత్తమే జాబితాలు వచ్చాయి: లీడ్ బ్యాంక్ మేనేజర్ నరశింహారావు ప్రస్తుతం బ్యాంకులకు వచ్చిన జాబితాలు కేవలం పరిశీలన నిమిత్తమే వచ్చాయి తప్ప అవి పబ్లిక్‌గా ప్రకటించేందుకు కాదు. బ్యాంకులు ఎందుకు ప్రకటించారో అర్థం కావడంలేదు. కొన్ని బ్యాంకులు ప్రకటించినట్లు తన దృష్టికి వచ్చింది. అయితే పెద్ద మొత్తంలో పేర్లు లేవని చెబుతున్నచోట వారు అసలు ఆ పేర్లు ఫీడ్ చేశారో లేదో కూడా ఒకసారి పరిశీలించుకోవడమే ఉత్తమం. రుణ మాఫీకి ఎన్ని ఖాతాలు అర్హత పొందాయనేది కూడా ఇప్పడే ఖరారు చేయలేం. త్వరలోనే అధికారికంగా చెబుతాం. -
రుణ మాఫీ జాబితా... తప్పుల తడక !
నరసన్నపేట రూరల్ : నరసన్నపేట మండలంలో రుణమాఫీ రైతుల జాబితా అస్తవ్యస్తంగా ఉంది. గ్రామాలకు వచ్చిన రైతుల జాబితా చూసి రెవెన్యూ కార్యదర్శులే ఆశ్చర్యపోతున్నారు. గ్రామాల్లో ఉన్న రైతుల పేర్లు జాబితాల్లో లేవు. ఇతర గ్రామాల్లో ఉన్న రైతుల పేర్లు జాబితాల్లో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పేర్లు ఉన్న రైతులకు సంబంధించిన వివరాలు వీఆర్వోలు నమోదు చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే తమ పేర్లు లేక పోవడంతో రుణాలు వాడుకున్న రైతులు గాబరా పడుతున్నారు. తమకు రుణ మాఫీ వర్తిస్తుందనుకున్నామని.. జాబితాలో పేర్లు లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితి ఒక్క నరసన్నపేట మండలమే కాదు..జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ప్రతీ గ్రామంలోను పదుల సంఖ్యలో జాబితాలో సబంధం లేని రైతుల పేర్లు ఉన్నాయి. జమ్ము పంచాయతీకి ఇచ్చిన రుణమాఫీ జాబితాలో 213 పేర్లు ఉండగా వీటిలో 83 పేర్లు గ్రామానికి సంబంధం లేనివారివే. మబగాం గ్రామానికి చెందిన జుత్తు రామారావు పేరు జమ్ము పంచాయతీకి వచ్చిన జాబితాలో దర్శనమివ్వగా.. పోలాకి మండలం మెట్టపేటకు చెందిన మెట్ట గణపతిరావు పేరు జమ్ము గ్రామ జాబితాలో నమోదైంది. అలాగే జమ్ముకు చెందిన సాధు అప్పన్న రూ. 80 వేలు, కల్యాణి శ్రీరాములు 30 వేల రూపాయల రుణం వాడుకున్నారు. అయితే వీరి పేర్లు రుణమాఫీ జాబితాలో లేవు. దీంతో తమకు రుణమాఫీ వర్తించదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రోజుల తరబడి రుణమాఫీ కోసం ఎదురు చూశామని తీరా మాఫీ జాబితా వచ్చే సరికి తమ పేర్లు లేవని ఆందోళన చెందుతున్నారు. కోమర్తి పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దశుమంతిపురంలో 30 మంది రైతుల పేర్లు ఉండగా..వీరిలో 12 మంది పేర్లు గ్రామంతో సంబంధం లేని వారివే ఉన్నాయి. దీంతో గ్రామానికి చెందిన రుణ గ్రహీతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పేర్లు పరిశీలనకే జాబితా.. తహశీల్దార్ సుధాసాగర్ రుణమాఫీ అర్హుల జాబితా బ్యాంకులో ఉంది. ప్రస్తుతం పంచాయతీల్లో గ్రామ కార్యదర్శులకు ఇచ్చిన జాబితా కేవలం పేర్లు పరిశీలనకే పరిమితం. జాబితాలో పేర్లు లేవని రైతులు ఆందోళన చెందవద్దు. మరో జాబితా బ్యాంకులో ఉంది. దాంట్లో రుణం వాడుకున్న వారి పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం జాబితాలో ఉన్న పేర్లు వివరాలు సేకరిస్తున్నాం. నా సంగతి ఏంటి? జమ్ము గ్రామంలో నివసిస్తున్నాను. రెండు ఎకరాల పొలం ఉంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ. 80 వేలు అప్పు నరసన్నపేట ఆంధ్రాబ్యాంకులో వాడుకున్నాను. రుణ మాఫీకి అర్హుడనే అనుకున్నాను. తీరా గ్రామానికి వచ్చిన జాబితాలో నాపేరు లేదు. నాసంగతి ఏంటి? ఇదేమి తీరు. - సాధు అప్పన్న, జమ్ము -
గందరగోళం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పంటనష్ట పరిహారాన్ని నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోంది. పంపిణీ బాధ్యతల్ని ఓ ప్రైవేటు బ్యాంకుకు అప్పగించింది. వ్యవసాయశాఖ రైతుల జాబితా, నిధులకు సంబంధించిన బిల్లులు తయారు చేసి ఖజానా శాఖ ఆమోదం పొందిన అనంతరం సదరు బ్యాంకు యంత్రాంగం రైతుల ఖాతాకు ఆన్లైన్ పద్ధతిన నగదును బదిలీ చేస్తుంది. 2013 ఖరీఫ్ సీజన్‌తో పాటు ఇంతకు ముందు బకాయిలన్నీ కలుపుకొని జిల్లాకు రూ.31.03 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పరిహారాన్ని 1,21,327 మంది రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే లబ్ధిదారులకు సంబంధించి వ్యవసాయ శాఖ బిల్లులు రూపొం దించి ఖజానా విభాగం ఆమోదంతో సర్వీస్ ప్రొవైడర్‌కు వివరాలు అందించగా.. పంపిణీ ప్రక్రియలో ఇబ్బం దులు తలెత్తాయి. రైతులిచ్చిన బ్యాంకు ఖాతాలు పనిచేయడం లేదని, కొందరు రైతుల బ్యాంకు ఖాతా అంకెల్లో తేడాలున్నట్లు సర్వీస్ ప్రొవైడర్ తేల్చింది. ఇప్పటివరకు 1,01,706 మంది రైతులకు రూ.26.87 కోట్లు పంపిణీ చేశారు. ఇంకా 19,621 మంది రైతులకు రూ.4.16 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. సర్వీస్ ప్రొవైడర్ చేతులెత్తేసింది. దీంతో మళ్లీ వివ రాలు సేకరించాలని వ్యవసాయశాఖ నిర్ణయించి.. క్షేత్రస్థాయిలో చర్యలు మొదలుపెట్టింది. గతంలోనూ ఇదే సీను.. 2012 సంవత్సరంలో జిల్లాకు మంజూరైన పంటనష్ట పరిహారంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టమైంది. రైతులు సరైన వివరాలు ఇవ్వలేదని మొదట వాదించిన వ్యవసాయ శాఖ అధికారులు.. వారంతా బోగస్ రైతులని తేల్చుతూ రూ.8 కోట్లు ప్రభుత్వానికి వెనక్కు ఇచ్చారు. తాజాగా ఇదే తరహాలో రైతులు తప్పుడు ఖాతా నంబర్లు సమర్పించారంటూ వ్యవసాయ శాఖ పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి జిల్లాలో మెజారిటీ రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఈ క్రమంలో రైతులందరికీ బ్యాంకు ఖాతాలున్నాయి. ఇటీవల పంటరుణ మాఫీ ప్రక్రియలోనూ ఈ ఖాతాలను సేకరించారు. తాజాగా ఆ జాబితా ప్రకా రం రైతుల వివరాలు పరిగణలోకి తీసుకుంటే అసలు సమస్యే ఉండదని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మొత్తంగా అధికారుల తప్పిదాలతో రైతులు నష్టపోతున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘డబుల్’ ట్రబుల్.. మరోవైపు ఇప్పటికే పంపిణీ చేసిన పంటనష్ట పరిహారంపై కొత్త చిక్కు వచ్చిపడింది. కొన్నిచోట్ల ఒకే రైతుకు రెండుసార్లు పరిహారం జమ అయినట్లు అధికారవర్గాలు గుర్తించాయి. దాదాపు రూ.2కోట్ల వరకు ఇలా రెండేసిసార్లు రైతులకు ఇచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ఈమేరకు లెక్కలు తీసేపనిలో నిమగ్నమయ్యా రు. రెండుసార్లు పరిహారం విడుదలైన ఖాతాలను వెంటనే సీజ్‌చేసి సరిదిద్దే ప్రయత్నాలు మొదలయ్యాయి. -
మాఫీ ఎంతో!
రుణమాఫీ కోసం రెండు నెలలుగా రైతులు ఎదురుచూస్తున్నా అధికారుల కసరత్తు ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వ ఉత్తర్వులకు రిజర్వు బ్యాంకు నిబంధనలు విరుద్ధంగా ఉండటంతో బ్యాంకర్లు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎ,బి,సి,డి,ఇ దశలుగా సాగుతున్న కసరత్తులో ఎంత మందికి, ఏ మేరకు రుణాలు మాఫీ అవుతాయో సస్పెన్స్‌గా మారింది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రుణమాఫీ కోసం అర్హులైన రైతుల జాబితాను రూపొందించడంలో అధికారులు చేస్తున్న కసరత్తు ఎడతెగక పోవడంతో రూ.1863.65 కోట్ల పంటరుణా ల మాఫీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2013-14లో పంటరుణాలు పొందిన సుమారు 4.33 లక్షల మంది రైతులు మాఫీ కోసం రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 1 నాటికే అర్హుల జాబితా పూర్తి కావాల్సి ఉండగా, ఇప్పటికి ఏడు మండలాల రైతులకు సంబంధించి రుణమాఫీపై అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కాగా రుణమాఫీపై ఎ, బి, సి, డి, ఇ దశలుగా సాగుతున్న కసరత్తు కొలిక్కిరాకపోవడంతో ఎంతమందికి ఈ పథకం వర్తిస్తుంది? ఎన్ని కోట్ల రూపాయలు మాఫీ అవుతాయి? అన్న అంశాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే శనివారం రుణమాఫీపై అధికారులు కీలక సమావేశం నిర్వహించనుండటం చర్చనీయాంశంగా మారింది. రుణమాఫీ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు, రిజర్వుబ్యాంకు మార్గదర్శకాలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో అధికారులు, బ్యాంకర్లు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. రుణమాఫీ కోసం అర్హుల జాబితాను గుర్తించడంలోనూ నిబంధనలు వారికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. దీంతో రుణమాఫీ కోసం రెండు నెలలుగా ఎదురుచూస్తున్న రైతులు నిరాశలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఒక కుటుంబానికి రూ. లక్ష వరకు రుణమాఫీ వర్తింప చేయాల్సి ఉండగా, ఇందుకోసం రైతు కుటుంబంలోని సభ్యులు, వారి పేర్లతో ఉన్న ఖాతాలు, బంగారంపై తీసుకున్న రుణాల మొత్తాన్ని లెక్కగట్టాల్సి వస్తోంది. ఇలా చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుండగా తుది జాబితా ఖరారుకు ఎ, బి, సి, డి, ఇ దశలు దాటాల్సి వస్తోంది. రైతు తీసుకున్న పంట రుణం ‘ఎ’ కాగా, బంగారంపై తీసుకున్న రుణం ‘బి’ కేటగిరి, అలాగే ‘సి’ అంటే పంటరుణం, బంగారంపై తీసుకున్న రుణాలు రెండు కాగా, ‘డి’ అంటే రైతులకు అదే జిల్లాలో ఇంకెక్కడైనా ఖాతాలుంటే వాటిని తొలగించడం , సి నుంచి ‘డి’ తీసేస్తే అది ‘ఇ’ కిందకు వస్తుంది. ఇలా రుణమాఫీ కోసం వివిధ దశలు, ప్రక్రియలు చేపట్టాల్సి వస్తుండగా అధికారులు, బ్యాంకర్ల కసరత్తు వేగవంతగా సాగడం లేదు. అంతేగాకుండా మండలస్థాయిలో అర్హులైన రైతులను గుర్తించి తుదిజాబితా ఖరారు చేసేందుకు బ్యాంకు మేనేజర్, స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. వారు బ్యాంకుల వారీగా జాబితాలు తెప్పించుకుని పరిశీలించాలి. ఆ తర్వాత ఎంపీడీవో, తహసీల్దారు, మండల ప్రత్యేకాధికారులు ఆమోదించాల్సి ఉంది. ఇందుకోసం చాలా సమయం వెచ్చించాల్సి వస్తుండటంతో రుణమాఫీపై కసరత్తు ఓ కొలిక్కి రావడం లేదు. పంటరుణాల మాఫీ ప్రకటన వెలువడటంతో జిల్లాలో రూ.1863.65 కోట్ల మేరకు మాఫీ అయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా ప్రకటించారు. ప్రభుత్వం నిబంధనలు, ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు కొంత అటు ఇటుగా ఉండచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. 2013-14లో రూ.1921.00 కోట్లు రుణం అందించడం లక్ష్యం కాగా రూ.1810.01 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.1152.6 కోట్లకు రూ.1075.24 కోట్లు ఇచ్చారు. రబీలో రూ.768.4 కోట్లకు గాను రూ.734.77 కోట్లు పంపిణీ చేశారు. అదే విధంగా జిల్లాలోని 142 సహకార సంఘాలతో పాటు వివిధ బ్యాంకుల్లో రైతులు బంగారం తాకట్టు పెట్టి రూ.53.64 కోట్లు పంటరుణాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రైతులు తీసుకున్న మొత్తం రుణాలు రూ. 1863.65 కోట్లు రుణమాఫీ కిందకు వస్తాయని అధికారులు మొదట అభిప్రాయపడ్డారు. అయితే తాజా మార్గదర్శకాల ప్రకారం అధికారులు రుణమాఫీ కోసం అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేస్తుండటంతో ఏ మేరకు, ఎంతమందికి రుణాలు మాఫీ అవుతాయనే చర్చ మొదలైంది. ప్రభుత్వ ప్రకటన వెలువడిన సుమారు రెండు మాసాల నుంచి ఎదురుచూస్తున్న రైతులు ఎప్పుడు తీపి కబురు అందుతుందా? అన్న అత్రుతలో ఉన్నారు. -
రుణమాఫీలో.. నకిలీ బాగోతం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 69 ప్రకారం రుణమాఫీకి అర్హత కలిగిన రైతుల జాబితాను రూపొందించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు రుణమాఫీ కోరుతున్న రైతులు ఆధార్ కార్డు జిరాక్సు కాపీలను అందజేయాల్సిందిగా రైతులను ఆదేశించారు. గ్రామాల వారీగా రుణమాఫీ కోరుతున్న రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో సామాజిక తనిఖీ పేరిట బ్యాంకర్లు, రెవెన్యూ సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో గ్రామాల వారీగా పరిశీలన పూర్తి చేయాలని నిర్ణయించారు. రుణమాఫీకి అర్హత కలిగిన ఏ ఒక్క రైతూ నష్టపోకుండా వివరాలు నమోదు చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని 349 వివిధ బ్యాంకుల శాఖల ద్వారా రూ.749 కోట్లు రైతులు రుణంగా పొందినట్లు గురించారు. తొలిరోజు పరిశీలనలో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. బ్యాంకర్ల సహకారంతోనే.. బ్యాంకర్ల సహకారంతో రైతుల ముసుగులో నకిలీ రైతులు చెలరేగిపోయినట్లు గుర్తించారు. భూమి లేకున్నా పాసు పుస్తకాలు సృష్టించి కోట్లాది రూపాయలను పంట రుణం రూపం లో నొక్కేశారు. సామాన్యుడు రుణం కోసం బ్యాంకు మెట్లెక్కితే సవాలక్ష నిబంధనలతో బెదరగొట్టే బ్యాం కర్లు నకిలీలకు రుణ మంజూరులో మాత్రం ఉదారంగా వ్యవహరించారు. పాసు పుస్తకాల్లో ఆర్డీఓలు, తహశీల్దార్లు, గ్రా మ రెవెన్యూ అధికారుల సంతకాలను నకిలీ రాయుళ్లు యధేచ్ఛగా ఫోర్జరీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ఆంధ్రప్రదేశ్ గ్రామీ ణ వికాస బ్యాంకు శాఖల్లో ఈ రకమైన ‘నకిలీలలు’ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫీల్డ్ ఆఫీసర్ల సహకారం లేనిదే ఈ రకమైన రుణ మంజూరు సాధ్యం కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయటపడుతున్న బాగోతం తొలిరోజు పరిశీలనలో నారాయణపేటలో 1321, మక్తల్‌లో 814, నాగర్‌కర్నూలులో 1894,కొల్లాపూర్‌లో 2276, మహబూబ్‌నగర్‌లో 714 మంది నకిలీ పాసుపుస్తకాలు తనఖా పెట్టి రుణాలు పొందినట్లు గుర్తించారు. గద్వాల, వనపర్తి డివిజన్ పరిధిలో బ్యాంకర్లు రుణమాఫీ కోరుతున్న రైతుల జాబితాను ఇంకా అందజేయాల్సి ఉంది. మరో మూడు రోజుల పాటు తహశీల్దార్, ఎంపీడీఓ, వీఆర్ఓ, బ్యాంకుల ప్రతి నిధులతో కూడిన కమిటీ ఈ పరిశీలన మరింత ముమ్మరం చేయనుంది. పరిశీలన పూర్తయితే వందల కోట్ల రూపాయలు నకిలీలు కాజేసిన వైనం వెలుగు చూసే అవకాశముంది. తమ బాగో తం బయటపడుతుందనే భయంతో కొన్ని చోట్ల బ్యాంకర్లు రుణమాఫీ రైతుల జాబితా ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ‘అర్హులకు అన్యా యం జరగకూడదనే ఉద్దేశంతో చేపట్టిన పరిశీలనలో నకిలీల వ్యవహారం వెలుగు చూడడం ఆశ్చర్యకరం. ఈ నెల 30వ తేదీలోగా అన్ని గ్రామాల్లో పాసుపుస్తకాల పరిశీలన పూర్తి చేయా లి. బ్యాంకర్లు గురువారంలోగా తప్పనిసరిగా రైతుల జాబితా ఇవ్వాలని’ కలెక్టర్ జీడీ ప్రియదర్శిని బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంత రం బ్యాంకర్లను ఆదేశించారు. జిల్లాలో రుణమాఫీ అర్హత కలిగిన రైతుల వడపోతపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ప్రియదర్శిని, రెవెన్యూ అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
30 లోగా రుణ మాఫీ జాబితా
కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి టౌన్ : జిల్లా వ్యాప్తంగా రుణ మాఫీ పొందిన రైతుల తుది జాబితాను గ్రామ సభల ద్వారా అమోదింపచేసి ఈ నెల 30లోగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపానున్నట్లు కలెక్టర్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ ప్రత్యేక సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో 2.76,678 మంది రైతులు రూ.లక్ష లోపు రుణాలు (మొత్తం రూ.1.763 కోట్లు) పొందారని, ఆదేవిధంగా 29,347 మంది రైతులు బంగారం తాకట్టుపై (లక్షలోపు) రూ.185 కోట్లు పొందారని, మొత్తంగా 3,06,025 మంది రైతులు రూ.1,948 కోట్ల మేర లబ్ధిపొందనున్నారని తాత్కాలిక అంచనా వేసినట్లు కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. ఆగస్టు 15న రుణాలకు సంబంధించిన చెక్కులను లాంఛనంగా అందజేశామని, గతంలోనే ప్రభుత్వం విధాన ప్రకటన చేసినందున, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి కిందకు రాదని కలెక్టర్ స్పష్టం చేశారు. రుణ మాఫీ పొందే రైతుల తుది జాబితా ఈ నెల 30లోగా సిద్ధం చేస్తారని ఈ నెల 21 నుంచి 23 మధ్య పంట రుణాలు బంగారంపై పొందిన రుణాల తుది జాబితా బ్యాంకుల వారీగా రూపొం దించి 24, 25 తేదీల్లో మండలాల వారీగా అధికారులతో బ్యాంకర్ల సమావేశం నిర్వహించి చర్చించాలన్నారు. ఇందుకు గాను ప్రతి మండలంలో సమన్యయ అధికారిగా సీనియర్ అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. రుణం పొందిన రైతుల జాబితాను పరిశీలించడంతో పాటు తహాశీల్దార్లు, టైటిల్ డీడ్లను పరిశీలిస్తారన్నారు. 26న రైతుల జాబితాను తయారుచేసి 27న జాబితాపై బ్యాంకర్లు, వ్యవసాయాధికారులు, ప్రత్యేకాధికారులు సమావేశం నిర్వహించి చర్చించుకోవాల్సి ఉంటుందన్నారు. 28, 29 తేదీల్లో గ్రామ పంచాయతీల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించి, సోషల్ ఆడిట్ నిర్వహించి గ్రామసభ తీర్మానంతో జాబితాను జిల్లా కేంద్రానికి పంపాలన్నారు. 30న జిల్లా స్థాయిలో తుది జాబితాను రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మార్చి 31న పంట రుణాలను చెల్లించినా, తిరిగి చెల్లిస్తామన్నారు. సమావేశంలో ఏజేసీ మూర్తి, వివిధ బ్యాంకుల అధికారులు, వ్యవసాయ శాఖ జేడీ హుక్యా నాయక్ పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిని పాటించాలి మెదక్ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలులో ఉన్నందున నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఖచ్చితంగా అమలు చేయాలని, నియమాళిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. 28న నామినేషన్ల పరిశీలన, 30న ఉపసంహరణ, సెప్టెంబర్ 13న ఎన్నిక, 16న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఇప్పటికే అనుమతి పొంది పారంభించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించవచ్చని, కొత్తగా ఏవిధమైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించవద్దని కలెక్టర్ సూచించారు. అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులచే ఏ విధమైన శంకు స్థాపనలు చేయించవద్దని ఆర్ధిక పరమైన మంజూరీలు చేయవద్దని సూచించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి పొందాలని తెలియజేశారు. సహాయ రిటర్నింగ్ అధికారిగా సంగారెడ్డి నియోజక వర్గానికి ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, మెదక్ నియోజకవ ర్గానికి ఆర్డీఓ వనజాదేవి, సిద్దిపేట నియోజక వర్గానికి ఆర్డీఓ ముత్యరెడ్ది, పటాన్చెరు నియోజక వర్గానికి డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గానికి డ్వామా పీడీ రవీందర్, గజ్వేల్ నియోజక వర్గానికి ప్రత్యేకాధికారి హనుమంతరావు, దుబ్బాక నియోజక వర్గానికి హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరావును నియమించామన్నారు. మెదక్ ఉప ఎన్నిక విషయమై ఈ నెల 21న ఎన్నికల ప్రవర్తనా నియమావళి, తదితర అంశాలను వివిధ పార్టీల నాయకులతో చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు.