మాఫీ ఎంతో! | farmers are waiting for debt waiver | Sakshi
Sakshi News home page

మాఫీ ఎంతో!

Published Sat, Sep 6 2014 1:08 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

మాఫీ ఎంతో! - Sakshi

మాఫీ ఎంతో!

రుణమాఫీ కోసం రెండు నెలలుగా రైతులు ఎదురుచూస్తున్నా అధికారుల కసరత్తు ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వ ఉత్తర్వులకు రిజర్వు బ్యాంకు నిబంధనలు విరుద్ధంగా ఉండటంతో బ్యాంకర్లు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎ,బి,సి,డి,ఇ దశలుగా సాగుతున్న కసరత్తులో ఎంత మందికి, ఏ మేరకు రుణాలు మాఫీ అవుతాయో సస్పెన్స్‌గా మారింది.
 
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రుణమాఫీ కోసం అర్హులైన రైతుల జాబితాను రూపొందించడంలో అధికారులు చేస్తున్న కసరత్తు ఎడతెగక పోవడంతో రూ.1863.65 కోట్ల పంటరుణా ల మాఫీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2013-14లో పంటరుణాలు పొందిన సుమారు 4.33 లక్షల మంది రైతులు మాఫీ కోసం రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 1 నాటికే అర్హుల జాబితా పూర్తి కావాల్సి ఉండగా, ఇప్పటికి ఏడు మండలాల రైతులకు సంబంధించి రుణమాఫీపై అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కాగా రుణమాఫీపై ఎ, బి, సి, డి, ఇ దశలుగా సాగుతున్న కసరత్తు కొలిక్కిరాకపోవడంతో ఎంతమందికి ఈ పథకం వర్తిస్తుంది? ఎన్ని కోట్ల రూపాయలు మాఫీ అవుతాయి? అన్న అంశాలపై సస్పెన్స్ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలోనే శనివారం రుణమాఫీపై అధికారులు కీలక సమావేశం నిర్వహించనుండటం చర్చనీయాంశంగా మారింది. రుణమాఫీ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు, రిజర్వుబ్యాంకు మార్గదర్శకాలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో అధికారులు, బ్యాంకర్లు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. రుణమాఫీ కోసం అర్హుల జాబితాను గుర్తించడంలోనూ నిబంధనలు వారికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. దీంతో రుణమాఫీ కోసం రెండు నెలలుగా ఎదురుచూస్తున్న రైతులు నిరాశలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఒక కుటుంబానికి రూ. లక్ష వరకు రుణమాఫీ వర్తింప చేయాల్సి ఉండగా, ఇందుకోసం రైతు కుటుంబంలోని సభ్యులు, వారి పేర్లతో ఉన్న ఖాతాలు, బంగారంపై తీసుకున్న రుణాల మొత్తాన్ని లెక్కగట్టాల్సి వస్తోంది. ఇలా చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుండగా తుది జాబితా ఖరారుకు ఎ, బి, సి, డి, ఇ  దశలు దాటాల్సి వస్తోంది.
 
రైతు తీసుకున్న పంట రుణం ‘ఎ’ కాగా, బంగారంపై తీసుకున్న రుణం ‘బి’ కేటగిరి, అలాగే ‘సి’ అంటే పంటరుణం, బంగారంపై తీసుకున్న రుణాలు రెండు కాగా, ‘డి’ అంటే రైతులకు అదే జిల్లాలో ఇంకెక్కడైనా ఖాతాలుంటే వాటిని తొలగించడం , సి నుంచి ‘డి’ తీసేస్తే అది ‘ఇ’ కిందకు వస్తుంది. ఇలా రుణమాఫీ కోసం వివిధ దశలు, ప్రక్రియలు చేపట్టాల్సి వస్తుండగా అధికారులు, బ్యాంకర్ల కసరత్తు వేగవంతగా సాగడం లేదు.  అంతేగాకుండా మండలస్థాయిలో అర్హులైన రైతులను గుర్తించి తుదిజాబితా ఖరారు చేసేందుకు బ్యాంకు మేనేజర్, స్పెషల్ ఆఫీసర్‌లను నియమించారు.

వారు బ్యాంకుల వారీగా జాబితాలు తెప్పించుకుని పరిశీలించాలి. ఆ తర్వాత ఎంపీడీవో, తహసీల్‌దారు, మండల ప్రత్యేకాధికారులు ఆమోదించాల్సి ఉంది. ఇందుకోసం చాలా సమయం వెచ్చించాల్సి వస్తుండటంతో రుణమాఫీపై కసరత్తు ఓ కొలిక్కి రావడం లేదు.  పంటరుణాల మాఫీ ప్రకటన వెలువడటంతో జిల్లాలో రూ.1863.65 కోట్ల మేరకు మాఫీ అయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా ప్రకటించారు.
 
ప్రభుత్వం నిబంధనలు, ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు కొంత అటు ఇటుగా ఉండచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. 2013-14లో రూ.1921.00 కోట్లు రుణం అందించడం లక్ష్యం కాగా రూ.1810.01 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.1152.6 కోట్లకు రూ.1075.24 కోట్లు ఇచ్చారు. రబీలో రూ.768.4 కోట్లకు గాను రూ.734.77 కోట్లు పంపిణీ చేశారు. అదే విధంగా జిల్లాలోని 142 సహకార సంఘాలతో పాటు వివిధ బ్యాంకుల్లో రైతులు బంగారం తాకట్టు పెట్టి రూ.53.64 కోట్లు పంటరుణాలు తీసుకున్నారు.
 
ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రైతులు తీసుకున్న మొత్తం రుణాలు రూ. 1863.65 కోట్లు రుణమాఫీ కిందకు వస్తాయని అధికారులు మొదట అభిప్రాయపడ్డారు. అయితే తాజా మార్గదర్శకాల ప్రకారం అధికారులు రుణమాఫీ కోసం అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేస్తుండటంతో ఏ మేరకు, ఎంతమందికి రుణాలు మాఫీ అవుతాయనే చర్చ మొదలైంది. ప్రభుత్వ ప్రకటన వెలువడిన సుమారు రెండు మాసాల నుంచి ఎదురుచూస్తున్న రైతులు ఎప్పుడు తీపి కబురు అందుతుందా? అన్న అత్రుతలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement