కడప అగ్రికల్చర్/వేంపల్లె : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ కిరికిరిగా మారుతోంది. ఈ పథకం దాదాపు అందరికీ వర్తిస్తుందని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈనెల 14వ తేదీన జీవో నంబరు 164 పేరుతో ఫైనాన్స్ శాఖ 26 అంశాలను రూపొందించి విడుదల చేసింది. దీని ప్రకారం రుణమాఫీలోకి వచ్చే రైతులందరూ బ్యాంకులకు పత్రాలను సమర్పించాలని పేర్కొన్నారు. రుణమాఫీ నెల రోజుల్లో చేస్తామని చెప్పిన ప్రభుత్వం అనేక షరతులు విధిస్తుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
కొన్ని బ్యాంకుల్లో రుణాలు రెన్యూవల్ చేసుకుని మళ్లీ రుణాలు పొందాలని రైతులు ముందుకు వచ్చారు. రుణాలు రెన్యూవల్ చేస్తే ఆర్‌బీఐ ప్రకటించే రీ షెడ్యూల్ ఆ వర్తించకపోవచ్చని, దానికి రుణమాఫీ కూడా వర్తించదనే విషయాన్ని కొందరు బ్యాంకర్లు చెబుతుండటంతో రైతులు ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. జిల్లాలో 2011వ సంవత్సరంలో వర్షాభావం కారణంగా రబీలో పంటలుదెబ్బతిన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలైంది. ఈ మొత్తాలను తీసుకోవడానికి రైతన్నలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మొత్తాలను బకాలయిలకు జమ చేసుకునే ప్రయత్నాల్లో బ్యాంకులు ఉన్నాయి.
అలాగే 2013కు ఇన్‌పుట్ సబ్సీడీ, పంటల బీమా మంజూరు అయినా జీఓ ప్రకారం రుణమాఫీకి అర్హత ఉన్న రైతులు ఆ మొత్తాలను వెనక్కి ఇవ్వాలనే నిబంధన ఉండటంతో ఏటూ పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో 2013 ఖరీఫ్‌లో పంట రుణాలను 5,59,493 మంది రైతులు రూ. 4427.09 కోట్లు తీసుకున్నారు. అలాగే బంగారం తాకట్టు పెట్టి 1,20,325 మంది రూ. 2124.43 కోట్ల రుణం పొందారు.137 రూరల్ బ్రాంచ్‌లు, 78 అర్బన్ బ్రాంచ్‌లు, 88 సెమీ అర్బన్ బ్రాంచ్‌లలో రైతులు ఈ రుణాలను పొందారు.
బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ అనుబంధ రంగాలకు తీసుకున్న రుణాలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణమాఫీ వర్తించదని జీఓలో పేర్కొన్నారు. అదేవిధంగా బ్యాంకులకు అప్పు కోసం చేసుకున్న దరఖాస్తులో వ్యవసాయ అవసరాల కోసం రుణం తీసుకుంటున్నట్లు ఒక కాలమ్‌ను నింపి బ్యాంకులకు ఇచ్చారేగానీ, అందులో ఫలానా పంట, ఇన్ని ఎకరాలలో సాగు చేస్తున్నట్లు రాయకపోవడంతో అటువంటి రైతులందరికీ ఈ మాఫీ వర్తించదని మౌఖికంగా ఆదేశాలు ఉన్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. పంట రుణమాఫీకి అర్హత పొందిన రైతులు అదే సందర్భంలో పంటల బీమా, వరద నష్టపరిహారం వంటివి పొంది ఉంటే వాటిని తిరిగి చెల్లించాలని జీఓలో పేర్కొన్నారు.
* వ్యవసాయ పంటల సాగుకు తీసుకున్న రుణం, పక్కాగా ఫలానా పంటకు తీసుకున్న బంగారు తాకట్టు రుణం మాత్రమే మాఫీ అవుతాయి.
* 2013 మార్చి 1 నుంచి 2013 డిసెంబరు 31 వరకు ఖరీఫ్, రబీ పంట రుణాలలో వడ్డీ సహా లక్ష లోపు ఉంటే మాఫీ వర్తిస్తుంది.
* ఉద్యాన, చేపల పెంపకం, కోళ్లు, పాడి పరిశ్రమలపై తీసుకున్న రుణాలకు వర్తింపు లేదు.
* కిసాన్ క్రెడిట్‌కార్డు ద్వారా మంజూరైన రుణాలకు మాఫీ వర్తిస్తుంది.
* ఒకేసర్వే నంబరులో పట్టాదారు, కౌలుదారు రుణం తీసుకుంటే కౌలుదారునికి మాత్రమే మాఫీ వర్తిస్తుంది.
* కుటుంబంలో ఎంతమంది పంటకోసం రుణం తీసుకున్నా ఒక్కరికి మాత్రమే రూ.1.50లక్షలు మాఫీ అవుతుంది.
* రుణమాఫీకి అర్హత పొందిన రైతు ఒక ఫార్మాట్‌లో ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాల జిరాక్స్, బ్యాంకు పాసుబుక్కు ఖాతా నంబర్ ఉన్న జిరాక్స్‌ను బ్యాంకులో అప్పగించాలి.
* ప్రాథమిక సహకార పరపతి సంఘాలలో ఇంతవరకు ఖాతాలు లేకుండా బంగారంపై రుణాలు తీసుకున్న వారు విధిగా సేవింగ్స్ ఖాతాలు తెరవాలి.
* మొదటి ప్రాధాన్యతగా పంటరుణంగా తీసుకుని ఆపై మార్జినల్ టర్మ్ లోన్‌గా మార్చుకున్న రుణాలకు, వ్యవసాయ పంటల సాగుకోసం పొందిన బంగారు రుణాలకు ప్రాధాన్యత ఇస్తారు.
* ఒక కుటుంబంలో పలురకాల పంట రుణాలు ఉన్నప్పుడు ఒరిజినల్‌గా పట్టాదారు పాసుపుస్తకం ఎవరి పేరున ఉందో వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది.
* లక్షన్నర రూపాయలు వడ్డీతో సహా మించకుండా ఉంటే మాఫీలోకి వర్తిస్తుంది. మిగిలిన మొత్తాన్ని రైతు తిరిగి బ్యాంక్‌కు చెల్లించాలి.
* ఆధార్‌కార్డు లేనివారికి, భూమి అగ్రిమెంట్లపై బ్యాంకులలో రుణం తీసుకున్న వారికి మాఫీ వర్తించదు.
* ఈనెల 28లోపల రుణమాఫీకి అర్హత ఉన్న వారందరూ జీఓలో పేర్కొన్న ప్రకారం పత్రాలను సమర్పిస్తేనే అర్హత పొందుతారు.
* రుణం తీసుకున్న వ్యక్తి మృతిచెందితే వారి తాలూకు కుటుంబీకులు మాఫీపోనూ మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి. అలా చెల్లించకపోతే రుణం తీసుకున్న వ్యక్తికి పూచీగా సంతకాలు చేసిన వారు చెల్లించాల్సి ఉంటుంది.
* ఇలా 26 అంశాలతో కూడిన జీఓను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రైతులు ఎక్కడ మాఫీకి మళ్లీ ఎసరు పెడతారోనని ఆందోళన చెందుతున్నారు.
ఆందోళనలో అన్నదాతలు
వేంపల్లె : రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తిరకాసు పెడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓను చూసి ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఎస్‌బీఐ వద్ద పెద్ద స్థాయిలో రైతులు గుమిగూడారు. ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా ధర్నా చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రోజుకో మాట.. పూటకో నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆరోపిస్తున్నారు.
సవా లక్షన్నర షరతులు
Published Tue, Aug 26 2014 2:33 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement