సాక్షి, హైదరాబాద్: పీఎం–కిసాన్ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం వేగం పెంచింది. పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను బుధవారం విడుదల చేసింది. పీఎం–కిసాన్ పథకం కింద గుర్తించిన లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా ప్రదర్శిస్తామని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఒకవేళ అర్హులై ఉండి జాబితాలో పేరు లేకుంటే అధికారులకు విన్నవించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నెల 25వ తేదీ నాటికి రాష్ట్రంలో ఉన్న అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేసి పీఎం–కిసాన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. మొదటి విడత సొమ్మును పొందడానికి ఏడాదిపాటు అవకాశం కల్పించారు. అంటే, ఈ నెల 25వ తేదీ నాటికి అర్హులైన రైతుల జాబితాను ఒకవేళ అప్‌లోడ్ చేయకపోయినా, ఆ తర్వాత పంపించినా రైతులకు ఏడాదికాలంలో ఎప్పుడైనా సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రారంభించి, కోడ్ ఉన్నప్పటికీ తర్వాత కొనసాగించాలన్నదే కేంద్ర సర్కారు వ్యూహంగా ఉంది. ఐదెకరాలలోపు ఉన్న ఒక కుటుంబం మాత్రమే రూ.6 వేలు పొందడానికి అర్హత ఉంటుందని నిర్ధారించారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది మార్చి 31 నాటికి సాంకేతికంగా గుర్తింపు పొందిన అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకం వర్తిస్తుంది. కేంద్రం ప్రకటించిన తాజా మార్గదర్శకాల్లోని మరికొన్ని ముఖ్యాంశాలు...
రాష్ట్రస్థాయిలో నోడల్ వ్యవస్థ...
►పథకం పర్యవేక్షణకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో కమిటీలు వేస్తారు. జాతీయ స్థాయిలో సమీక్ష కమిటీకి కేబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో సమీక్ష కమిటీలు ఏర్పడతాయి.
►జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలి. ఏదైనా ఫిర్యాదు వస్తే రెండు వారాల్లోగా పరిష్కరించాలి.
►కేంద్రస్థాయిలో ప్రాజెక్టు మానిటర్ యూనిట్(పీఎంయూ)ను ఏర్పాటు చేస్తారు. దానికి ఒక సీఈవో ఉంటారు. ఇది పథకంపై ప్రచారం చేస్తుంది. అవగాహన కల్పిస్తుంది.
►ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో కేంద్రంతో పర్యవేక్షణకు ఒక నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఏదో ఒక ప్రభుత్వశాఖకు ఈ బాధ్యత అప్పగించాలి.
►పథకాన్ని అమలు చేసే వారికి ప్రోత్సాహకాలు ఇస్తారు.
► జిల్లా స్థాయిలో పీఎం–కిసాన్ పోర్టల్‌కు సంబంధించిన లాగిన్ అవకాశం కల్పిస్తారు. రైతులందరి వివరాలు అందులో ఉంటాయి.
► ఏ బ్యాంకు ద్వారా డబ్బును అందజేయాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారణ చేయాలి. పోస్టాఫీసు, సహకార బ్యాంకు, లేదా ఇతర వాణిజ్య బ్యాంకుల్లో ఏవైనా వాటిని గుర్తించాలి.
►లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు చేరుతుంది.
► లబ్ధిదారులకు సొమ్ము చేరిన వెంటనే వారి మొబైల్ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది.
వీరంతా అనర్హులే...
►ఉన్నతాదాయ వర్గాలంతా అనర్హులు
►వివిధ సంస్థల కింద ఐదెకరాలలోపు భూమి ఉన్నవారు
► రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉంటే వారికి వర్తించదు
► తాజా, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ తాజా,మాజీ చైర్మన్లు
► కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రస్తుత, రిటైరైన ఉద్యోగులు, అధికారులు అనర్హులు
► స్వయంప్రతిపత్తి, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు కూడా అనర్హులే. (నాలుగో తరగతి ఉద్యోగులు మాత్రం అర్హులు)
►రూ.10 వేలకు మించి పింఛన్ తీసుకునే ఉద్యోగులంతా...
►గతేడాది ఆదాయపు పన్ను చెల్లించిన వారంతా...
►డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సీఏలు, ఆర్కిటెక్ట్‌లు తదితర వృత్తి నిపుణులు కూడా...
సొంత ధ్రువీకరణే కీలకం
►లబ్ధిదారులే సొంతంగా తమ అర్హత ధ్రువీకరణపత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. తప్పుడు ధ్రువీకరణపత్రమిస్తే, సొమ్ము వెనక్కి తీసు కుంటారు. చట్టపరమైన చర్యలు చేపడతారు.
► కొన్నిచోట్ల ఎవరైనా నిర్ణీత ఐదెకరాల లోపు భూమిని పలుచోట్ల కలిగి ఉన్నా, ఇద్దరు ముగ్గురు కలసి సాగు చేసుకుంటున్నా వారికీ అందజేస్తారు.
► ఈ నెల ఒకటో తేదీని లబ్ధిదారుల అర్హతకు గడువుగా నిర్ధారించారు. ఏడాది వరకు ఇదే తేదీని ఆధారం చేసుకొని అర్హుల జాబితాను గుర్తిస్తారు. అంటే లబ్ధిదారుల భూమికి సంబంధించి ఎటువంటి మార్పులైనా గతేడాది డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు జరిగి ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటారు. లేకుంటే లేదు.
► లబ్ధిదారుల డేటాబేస్‌ను సమగ్రంగా పంపాలి. గ్రామం, పేరు, వయస్సు, సామాజిక వర్గం, బ్యాంకుఖాతా, ఆధార్, ఫోన్ నంబర్ వంటి వివరాలు పంపాలి.
Comments
Please login to add a commentAdd a comment