రుణ మాఫీ జాబితా... తప్పుల తడక ! | Farm loans waived, but no relief for farmers | Sakshi
Sakshi News home page

రుణ మాఫీ జాబితా... తప్పుల తడక !

Published Fri, Nov 14 2014 4:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM

రుణ మాఫీ జాబితా... తప్పుల తడక !

రుణ మాఫీ జాబితా... తప్పుల తడక !

నరసన్నపేట రూరల్ : నరసన్నపేట మండలంలో రుణమాఫీ రైతుల జాబితా అస్తవ్యస్తంగా ఉంది. గ్రామాలకు వచ్చిన రైతుల జాబితా చూసి రెవెన్యూ కార్యదర్శులే ఆశ్చర్యపోతున్నారు. గ్రామాల్లో ఉన్న రైతుల పేర్లు జాబితాల్లో లేవు. ఇతర గ్రామాల్లో ఉన్న రైతుల పేర్లు జాబితాల్లో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పేర్లు ఉన్న రైతులకు సంబంధించిన వివరాలు వీఆర్వోలు నమోదు చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే తమ పేర్లు లేక పోవడంతో రుణాలు వాడుకున్న రైతులు గాబరా పడుతున్నారు. తమకు రుణ మాఫీ వర్తిస్తుందనుకున్నామని.. జాబితాలో పేర్లు లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఈ పరిస్థితి ఒక్క నరసన్నపేట మండలమే కాదు..జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ప్రతీ గ్రామంలోను పదుల సంఖ్యలో జాబితాలో సబంధం లేని రైతుల పేర్లు ఉన్నాయి. జమ్ము పంచాయతీకి ఇచ్చిన రుణమాఫీ జాబితాలో 213 పేర్లు ఉండగా వీటిలో 83 పేర్లు గ్రామానికి సంబంధం లేనివారివే. మబగాం గ్రామానికి చెందిన జుత్తు రామారావు పేరు జమ్ము పంచాయతీకి వచ్చిన జాబితాలో దర్శనమివ్వగా.. పోలాకి మండలం మెట్టపేటకు చెందిన మెట్ట గణపతిరావు పేరు జమ్ము గ్రామ జాబితాలో నమోదైంది. అలాగే జమ్ముకు చెందిన సాధు అప్పన్న రూ. 80 వేలు, కల్యాణి శ్రీరాములు 30 వేల రూపాయల రుణం వాడుకున్నారు. అయితే వీరి పేర్లు రుణమాఫీ జాబితాలో లేవు. దీంతో తమకు రుణమాఫీ వర్తించదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే రోజుల తరబడి రుణమాఫీ కోసం ఎదురు చూశామని తీరా మాఫీ జాబితా వచ్చే సరికి తమ పేర్లు లేవని ఆందోళన చెందుతున్నారు. కోమర్తి పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దశుమంతిపురంలో 30 మంది రైతుల పేర్లు ఉండగా..వీరిలో 12 మంది పేర్లు గ్రామంతో సంబంధం లేని వారివే ఉన్నాయి. దీంతో గ్రామానికి చెందిన రుణ గ్రహీతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
 పేర్లు పరిశీలనకే జాబితా..
 
తహశీల్దార్ సుధాసాగర్
రుణమాఫీ అర్హుల జాబితా బ్యాంకులో ఉంది. ప్రస్తుతం పంచాయతీల్లో  గ్రామ కార్యదర్శులకు ఇచ్చిన జాబితా కేవలం పేర్లు పరిశీలనకే పరిమితం. జాబితాలో పేర్లు లేవని రైతులు ఆందోళన చెందవద్దు. మరో జాబితా బ్యాంకులో ఉంది. దాంట్లో రుణం వాడుకున్న వారి పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం జాబితాలో ఉన్న పేర్లు వివరాలు సేకరిస్తున్నాం.  
 
నా సంగతి ఏంటి?
జమ్ము గ్రామంలో నివసిస్తున్నాను. రెండు ఎకరాల పొలం ఉంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ. 80 వేలు అప్పు నరసన్నపేట ఆంధ్రాబ్యాంకులో వాడుకున్నాను. రుణ మాఫీకి అర్హుడనే అనుకున్నాను. తీరా గ్రామానికి వచ్చిన జాబితాలో నాపేరు లేదు. నాసంగతి ఏంటి? ఇదేమి తీరు.
 - సాధు అప్పన్న, జమ్ము

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement