Revenue secretaries
-
రుణ మాఫీ జాబితా... తప్పుల తడక !
నరసన్నపేట రూరల్ : నరసన్నపేట మండలంలో రుణమాఫీ రైతుల జాబితా అస్తవ్యస్తంగా ఉంది. గ్రామాలకు వచ్చిన రైతుల జాబితా చూసి రెవెన్యూ కార్యదర్శులే ఆశ్చర్యపోతున్నారు. గ్రామాల్లో ఉన్న రైతుల పేర్లు జాబితాల్లో లేవు. ఇతర గ్రామాల్లో ఉన్న రైతుల పేర్లు జాబితాల్లో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పేర్లు ఉన్న రైతులకు సంబంధించిన వివరాలు వీఆర్వోలు నమోదు చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే తమ పేర్లు లేక పోవడంతో రుణాలు వాడుకున్న రైతులు గాబరా పడుతున్నారు. తమకు రుణ మాఫీ వర్తిస్తుందనుకున్నామని.. జాబితాలో పేర్లు లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితి ఒక్క నరసన్నపేట మండలమే కాదు..జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ప్రతీ గ్రామంలోను పదుల సంఖ్యలో జాబితాలో సబంధం లేని రైతుల పేర్లు ఉన్నాయి. జమ్ము పంచాయతీకి ఇచ్చిన రుణమాఫీ జాబితాలో 213 పేర్లు ఉండగా వీటిలో 83 పేర్లు గ్రామానికి సంబంధం లేనివారివే. మబగాం గ్రామానికి చెందిన జుత్తు రామారావు పేరు జమ్ము పంచాయతీకి వచ్చిన జాబితాలో దర్శనమివ్వగా.. పోలాకి మండలం మెట్టపేటకు చెందిన మెట్ట గణపతిరావు పేరు జమ్ము గ్రామ జాబితాలో నమోదైంది. అలాగే జమ్ముకు చెందిన సాధు అప్పన్న రూ. 80 వేలు, కల్యాణి శ్రీరాములు 30 వేల రూపాయల రుణం వాడుకున్నారు. అయితే వీరి పేర్లు రుణమాఫీ జాబితాలో లేవు. దీంతో తమకు రుణమాఫీ వర్తించదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రోజుల తరబడి రుణమాఫీ కోసం ఎదురు చూశామని తీరా మాఫీ జాబితా వచ్చే సరికి తమ పేర్లు లేవని ఆందోళన చెందుతున్నారు. కోమర్తి పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దశుమంతిపురంలో 30 మంది రైతుల పేర్లు ఉండగా..వీరిలో 12 మంది పేర్లు గ్రామంతో సంబంధం లేని వారివే ఉన్నాయి. దీంతో గ్రామానికి చెందిన రుణ గ్రహీతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పేర్లు పరిశీలనకే జాబితా.. తహశీల్దార్ సుధాసాగర్ రుణమాఫీ అర్హుల జాబితా బ్యాంకులో ఉంది. ప్రస్తుతం పంచాయతీల్లో గ్రామ కార్యదర్శులకు ఇచ్చిన జాబితా కేవలం పేర్లు పరిశీలనకే పరిమితం. జాబితాలో పేర్లు లేవని రైతులు ఆందోళన చెందవద్దు. మరో జాబితా బ్యాంకులో ఉంది. దాంట్లో రుణం వాడుకున్న వారి పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం జాబితాలో ఉన్న పేర్లు వివరాలు సేకరిస్తున్నాం. నా సంగతి ఏంటి? జమ్ము గ్రామంలో నివసిస్తున్నాను. రెండు ఎకరాల పొలం ఉంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ. 80 వేలు అప్పు నరసన్నపేట ఆంధ్రాబ్యాంకులో వాడుకున్నాను. రుణ మాఫీకి అర్హుడనే అనుకున్నాను. తీరా గ్రామానికి వచ్చిన జాబితాలో నాపేరు లేదు. నాసంగతి ఏంటి? ఇదేమి తీరు. - సాధు అప్పన్న, జమ్ము -
జవాబుదారీ రెవె‘న్యూ’
యాచారం: ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు స్థానిక తహసీల్దార్ వసంతకుమారి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రెవెన్యూ కార్యదర్శులు వారంలో మూడురోజుల పాటు గ్రామాల్లోనే ఉండేం దుకు, జనాల సమస్యలను పరిష్కరించేందుకు ప్ర ణాళికను రూపొందించారు. చిన్న చిన్న పనుల కోసం వారాలతరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పని లేకుండా ప్రజల వద్దకే రెవెన్యూ పాలన తీసుకెళ్లేందుకు ఆమె వినూత్నంగా ఓ కార్యక్రమాన్ని రూపొందించారు. గత ఏడాది ప్రభుత్వం రెవెన్యూ క్లస్టర్లలో గ్రామ రెవెన్యూ కార్యాలయాలు ఏర్పాటు చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది. గ్రామ రెవెన్యూ కార్యాలయాలు ఎప్పుడూ చూసినా మూతపడే ఉండేవి. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రజలు మళ్లీ తహసీల్దార్ కార్యాలయాన్నే ఆశ్రయించేవారు. అయినా సమస్యలు పరిష్కారానికి నోచుకునేవి కావు. దీంతో తహసీల్దార్ వసంతకుమారి గ్రామ రెవెన్యూ పాలనకు శ్రీకారం చుట్టారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాల రెవెన్యూ కార్యదర్శులతో ఆమె సమావేశమయ్యారు. శుక్రవారం నుంచి రెవెన్యూ పాలన గ్రామం నుంచే సాగించాలని కార్యదర్శులకు సూచించారు. వారంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు గ్రామంలోనే కార్యదర్శులు ఉండేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. వారు గ్రామాల్లోఉండడమే కాకుండా.. రెవెన్యూ రికార్డులు స్థానికంగానే చూసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రజల్లో హర్షం కార్యదర్శులు గ్రామాల్లో ఉండే రోజుల్లో ఉదయం నుంచి 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు గ్రామాల్లో ఉండాలి. కార్యదర్శి పేరు, ఫోను నంబరు క్లస్టర్ కార్యాలయం వద్ద అతికించాలి. అత్యవసర సమయాల్లో గ్రామాలకు రాని పక్షంలో తహసీల్దార్ లేదా సర్పంచ్‌కు సమాచారం అందించాలని వసంతకుమారి ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ పాలన ఇక గ్రామాల నుంచి సాగడానికి తహసీల్దార్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ పహాణీ, పాసు పుస్తకాలు, పట్టాల మార్పిడి తదితర చిన్న చిన్న పనుల కోసం నెలల కొద్దీ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగేవాళ్లమని, ప్రస్తుతం స్థానికంగానే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్ కృషి చేయడం ఎంతో సంతోషించదగిన విషయమని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. గ్రామాల్లోనే కార్యదర్శులు ఉండేలా.. సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి నిత్యం కార్యాలయానికి రాకుండా చూడడమే లక్ష్యమని తహసీల్దార్ వసంతకుమారి స్పష్టంచేశారు.