
సాక్షి, హైదరాబాద్: వర్షాభావ పరిస్థితుల్లోనూ రబీలో ఆహార ధాన్యాల సాగు ఆశాజనకంగా ఉంది. అందులో వరి నాట్లు కూడా లక్ష్యాన్ని చేరుకున్నాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 29.67 లక్షల (89%) ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ బుధవారం సర్కారుకు పంపిన నివేదికలో వెల్లడించింది. అందులో ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 26.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 24.65 లక్షల (94%) ఎకరాల్లో సాగైనట్లు తెలిపింది.
ఆహారధాన్యాల సాగులో కీలకమైన వరి సాధారణ సాగు విస్తీర్ణం రబీలో 17.65 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 17.50 లక్షల (99%) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అలాగే మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.15 లక్షల ఎకరాలు కాగా, 3.22 లక్షల (78%) సాగైంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు అత్యధికంగా 3.25 లక్షల (104%) ఎకరాల్లో సాగయ్యాయి. అందులో శనగ సాగు 117 శాతం సాగైంది. నూనె గింజల సాధారణ సాగు విస్తీర్ణం 4.47 లక్షల ఎకరాలు కాగా, 3.27 లక్షల (73%) ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది.
తీవ్ర వర్షాభావం...
జనవరిలో విస్తృతంగా వర్షాలు కురిసినా.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం 16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటడంతో అనేక చోట్ల పంటలు ఎండుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నిర్మల్, జనగాం, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో మొక్కజొన్న కోత దశలో ఉన్నప్పటికీ కత్తెర పురుగు సోకి దిగుబడి పడిపోయే పరిస్థితి నెలకొందని నివేదిక వెల్లడించింది. పలు చోట్ల శనగ, పెసర, మినుములు, వేరుశనగ పంటలు కోత దశలో ఉన్నాయి. మిర్చి నాలుగో తీత దశలో ఉంది.