ఎండిన వరిలో పశువులను మేపుతున్న రైతు
చెన్నారావుపేట: దేవుడు వరమించిన పూజారి కరుణించలేదనే సమేత రైతుల పట్ల నిజమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంట్ రైతుల కోసం ఇవ్వడంతో కష్టాలు పోయాయి అనుకున్నారు. కానీ బావులల్లో భూగర్భ జలాలు లేకపోవడంతో రైతుల ఆశలు ఎండకు ఆవిరై పోయినట్టు తయారైంది. చెరువులు, కుంటలలో నీళ్లు ఎండిపోతుండటంతో బావులల్లో నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు వస్తే పంటలను బతికించుకోవచ్చని కలలు కన్న రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. బోర్లు వేసుకొని పంటలు రక్షించుకుందామంటే అందనంత దూరంలోకి జలాలు అడుగంటిపోయి.. నీళ్ల చుక్క రాని పరిస్థితి నెలకొంది.
ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ఎస్సారెస్పీ ద్వారా నీటి విడుదలకు కృషి చేస్తే పంటలు చేతికొస్తాయని రైతులు కోరుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ శివారులోని బూరుగుకుంట తండాకు చెందిన బానోతు మురళికి గ్రామ శివారులో 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 2 ఎకరాలు భూమిలో వరి పంట వేశాడు. ఎకరంలో పసుపు పంట వేశాడు. బావిలో నీళ్లున్నాయనే ఆశతో పంట వేశాడు. బావిలో నీళ్లు ఎండిపోతుండటంతో పంటను కాపాడుకోవడానికి రెండు బోర్లు వేసినా పడకపోవడంతో చేసేది ఏమి లేక చేతులెత్తేశాడు. ఎస్సారెస్పీ జలాలు వచ్చిన తన పంట పండుతుందని ఆశ పడ్డాడు. నీళ్లు రాకపోవడంతో చేసేది ఏమి లేక తన పశువులను, గేదెలను మేపుతున్నాడు. ఈ దృశ్యాలు ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి...
ఏడుద్దామన్నా కన్నీళ్లు రావడం లేదు..
రెండు ఎకరాలలో వరి నాటు వేశాను పంట మంచిగా పెరిగింది. బావిలో నీళ్లు ఎండిపోతుండటంతో రెండు బోర్లు రూ.1 లక్ష పెట్టి వేయింనా పడలేదు. వరి పంటలకు రూ.23 వేల వరకు పెట్టుబడులు పెట్టాను. మంచిగా ఉన్న నీళ్లులేక ఎండిపోతుండంతో గుండె బరువెక్కింది. ఎడుద్దామనుకున్న ఏడుపు రావడం లేదు. ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీళ్లు వచ్చిన కొంత మేర పంటను బతికించుకోవచ్చన్న ఆశ ఉంది.
– బానోతు మురళి, యువ రైతు
Comments
Please login to add a commentAdd a comment