సాగు రూపు మారాలి : కేసీఆర్‌ | Appearance of Cultivation Should Change CM KCR Calls | Sakshi
Sakshi News home page

సాగు రూపు మారాలి

Published Sat, May 23 2020 2:45 AM | Last Updated on Sat, May 23 2020 4:49 AM

Appearance of Cultivation Should Change CM KCR Calls - Sakshi

వ్యవసాయాభివృద్ధికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికిప్పుడు అనుసరించాల్సిన వ్యూహంలో భాగంగా రైతులకు కావాల్సినవి సమకూర్చుతున్నాం. దీనివల్ల పంటలు బాగా పండుతున్నాయి. వాటికి కనీస మద్దతు ధర వచ్చేలా చేస్తున్నాం. ఇది సరిపోదు. ఇంకా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణలో వ్యవసాయానికి అనుకూలతలున్నాయి. ఎక్కువ మంది జనం ఈ రంగంపైనే ఆధారపడ్డారు. అందువల్ల ఎక్కువ దృష్టి వ్యవసాయం మీదనే పెట్టాలి. దీర్ఘకాలిక వ్యూహంతో రైతులకు మార్గదర్శకం చేయాల్సి ఉంది. – సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘జనాభాలో ఎక్కువ శాతం మంది వ్యవసాయంలోనే ఉండడం ప్రగతికి సంకేతం కాదు. అందువల్ల పారిశ్రామికీకరణ జరగాలి. తెలంగాణ వ్యవసాయాధారిత పారిశ్రామికీకరణకు ఎంతో అనుకూలం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరి శ్రమలు పెద్ద సంఖ్యలో వచ్చేట్లు కృషి జరగాలి. దీనివల్ల అటు పారిశ్రామిక రంగం, ఇటు సేవారంగాలు కూడా విస్తరిస్తాయి’అని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలంగాణ వ్యవసాయం పరిణతి సాధించడానికి ప్రభుత్వం స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేస్తుందని ప్రకటించారు. నిరంతరం మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు వచ్చేలా, వ్యవసాయాధారిత పరిశ్రమలకు నిరంతరం ముడిసరుకు అందించే విధంగా, వేసిన పంటంతా సంపూర్ణంగా అమ్ముడుపోయేలా, ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణలో పంటల సాగు జరగాలని ఆయన ఆకాంక్షిం చారు. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యవ సాయం రూపురేఖలు మారాలని సూచించారు. ప్రజల అవసరాలు, మార్కెట్‌ డిమాండ్లకు అనుగుణంగా తెలంగాణలో జరగాల్సిన పంటల సాగు–అగ్రి బిజినెస్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆగ్రో ఇండస్ట్రీ అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో నిపుణులతో సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్, వ్యవసాయ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రవీణ్‌రావు, అగ్రి బిజినెస్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ సీమా, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా    మిగతా
డైరెక్టర్‌ శ్రీనివాసాచారి, ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ మేనేజ్మెంట్‌ సలహాదారు గోపీనాథ్‌ కోనేటి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు తదితరులతో చర్చించారు. 

ఎలాంటి మార్పులు చేయాలి..
పంటల సాగులో ఏ రకమైన మార్పులు తీసుకురావాలి? ఉత్పాదకత ఎలా పెంచాలి? రైతులు పండించిన పంటను యథావిధిగా మార్కెట్‌కు పంపకుండా దానికి అదనపు విలువ జత చేయడానికి ఇప్పుడున్న పద్ధతులేంటి? కొత్తగా ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ప్రపంచం నుంచి పోటీ తట్టుకుని నిలబడేలా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు రావడానికి ఏం చేయాలి? ఎరువులు–రసాయనాల వాడకంలో రావాల్సిన మార్పులు ఏంటి? పంటల మిగులు ఉండకుండా ఏం చేయాలి? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా నిపుణులు పలు సూచనలు చేశారు. రానున్న రోజుల్లో మరింత విస్తృత స్థాయిలో ఇలాంటి చర్చలు చాలా జరిపి, తెలంగాణ వ్యవసాయానికి ఒక దశ, దిశను నిర్దేశించాలని నిర్ణయించారు. ‘తెలంగాణ ఏర్పడినప్పుడు వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉండేది. ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల కాస్త ఊరట లభించింది. ఇప్పుడిప్పుడే రైతాంగంలో నమ్మకం ఏర్పడుతోంది. వ్యవసాయంలో సంస్కరణల శకం ఈ ఏడాది వర్షాకాలం పంటతో ప్రారంభమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా రైతుల శ్రేయస్సు కోసమేననే విశ్వాసం వారిలో ఉంది. సాగునీరు ఉంది. పెట్టుబడి ఉంది. ప్రభుత్వంపై నమ్మకం ఉంది. నైపుణ్యం కలిగిన రైతాంగం ఉంది. ఏ పంటైనా పండించే నేలలున్నాయి. ఇన్ని సానుకూలతలున్న తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయం, అగ్రి బిజినెస్, అగ్రి ఇండస్ట్రీ అభివృద్ధి జరగాలి’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు.

నాణ్యమైన సరుకులతో తెలంగాణ బ్రాండ్‌..
‘రైతులు పండించిన పంటను యథావిధిగా ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్నాం. కానీ ఆ పంటకు అదనపు విలువ జత చేయడం వల్లే ఎక్కువ ధర వస్తుంది. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లు ఏర్పాటు చేస్తుంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు కావాల్సిన ముడి సరుకును నిత్యం అందించగలిగేలా సంఘటిత వ్యవసాయం కావాలి. నాణ్యమైన సరుకులు తయారు చేయడం వల్ల తెలంగాణ బ్రాండ్‌కు ఓ ఇమేజ్‌ ఏర్పడుతుంది. అది అంతర్జాతీయంగా మార్కెటింగుకు ఉపయోగపడుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది పరిస్థితులు మారుతుంటాయి. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పంటలు మార్చుకుని వేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల రాష్ట్రంలో పంటల మార్పిడి విధానం రైతులకు అలవాటు కావాలి. దీనివల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది. భూసారం పెరుగుతుంది. పీడచీడలు తక్కువగా ఉంటాయి. ఇవన్నీ రైతులకు విడమరిచి చెప్పాలి. ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకంలో కూడా మార్పు రావాలి. ప్రస్తుతం రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల వ్యాపారుల మాట నమ్మి వాటిని వాడుతున్నారు. తగిన మోతాదులో ఎరువులు, పెస్టిసైడ్స్‌ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు చెప్పాలి. ఎరువులు ఎక్కువ వాడిన పంటకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ ఉండదనే విషయం కూడా వారికి అర్థమయ్యేట్లు వివరించాలి. క్రాప్‌ కాలనీలు ఉన్నచోటనే ఆ పంటకు సంబంధించిన ఆగ్రో ఇండస్ట్రీ/ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ రావాలి’అని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్‌ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వర్‌రావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement