దుర్భిక్షం.. దండయాత్ర
జిల్లాలో కరువు రక్కసి కరాళ నృత్యం చేస్తోంది.. ఏ రైతును కదిపినా కన్నీళ్లే. ఇలాంటి కరువు ఎప్పుడూ చూడలేదంటూ నిట్టూర్పులే. పది మందికి పట్టెడన్నం పెట్టే అన్నదాతలు, కూలీలుగా మారుతున్నారు. కనీసం ఉపాధి పనులు కూడా దొరక్క పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారు.
- వరుస కరువులతో అన్నదాత కుదేలు
- ఎండుతున్న వేరుశనగ
- తీవ్ర మవుతున్న పశుగ్రాసం కొరత
- కబేళాలకు తరలుతున్న పశువులు
- ప్రభుత్వ చేయూత కరువు
- పడమటి మండలాల్లో సాగు దారుణం
- కుప్పం నియోజక వర్గంలో
- భారీ సంఖ్యలో వలసలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఈ ఏడాది వర్షాలు రైతన్నను ఊరించి ఉసూరుమనిపించాయి. అప్పులు చేసి.. అష్ట కష్టాలు పడి వేరుశనగ పంటసాగు చేసిన రైతుకు చివరకు అప్పుల మూటే మిగిలింది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో దిగుబడులు నామమాత్రంగానే వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చివరకు అన్నదాతకు గుండె కోతను మిగుల్చుతున్నాయి. సీఎం సొంత ఇలాకా కుప్పంలోనే భారీ సంఖ్యలో వలసలు ఉండటం గమనార్హం. ఇంకా జిల్లాలో వలసలు పడమటి మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి.
మూగ జీవాలకు సైతం పశుగ్రాసం లేక కబేళాలకు తరలుతున్నాయి. ప్రభుత్వం తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది. కొంతమంది ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్లి గడ్డి తెచ్చుకుని పశువులను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితిని తలుచుకుని పాడి రైతు తల్లడిల్లిపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా కన్నబిడ్డల్లా పెంచుకున్న మామిడి చెట్లు సైతం నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటికే 10 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఎండిపోయాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకేమి పట్టదన్నట్లు వ్యవహారిస్తోంది.
ప్రత్యామ్నాయమే శరణ్యం...
- ఆగస్టు నెలలో 117.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవా ల్సి ఉండగా 109.7మిల్లిమీటర్ల వర్షపాతం కురిసింది.
- జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో ఎన్నడూ లేని రీతిలో 1500 అడుగుల మేరకు భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న 80 శాతం మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
- సకాలంలో వర్షాలు కురవకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు వేరుశనగ పంటను వేయలేకపోయారు.
- దీంతో ప్రత్యామ్నాయంగా ఉలువలు, పెసలు, ఉద్దులు జొన్నలు రాగి పంటలను సాగు చేస్తున్నారు.
- తూర్పు ప్రాంతాల్లో... ఎన్నడూ లేని విధంగా తూర్పు మండలాల్లో సైతం తాగు నీటి ఎద్దడి నెలకొంది. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసే పరిస్థితులు నెలకొన్నాయి.
- తొట్టంబేడు, బీఎన్ కండ్రిగ, వరదయ్య పాళ్యం సత్యవేడు మండలాల్లో వరి సాగు గణనీయంగా తగ్గింది. జిల్లాలో తూర్పు మండలాల్లో ఖరీప్‌లో వరి పంటను 15,365 హెక్టార్లల్లో సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 6132 హెక్టారుల్లో మాత్రమే సాగు చేశారు.
- సరైన సమయం వర్షలు కురవకపోవడంతో వరి నారు పోసేందుకు రైతులు మొగ్గుచూపడం లేదు. ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఎండుతున్న పంటలు...
- వేరుసెనగ పంట 1,38,375 హెక్టార్లకు గానూ 1,05,869 హెక్టార్లలో సాగు చేశారు. ఇటీవల కురిసిన అరకొర వర్షానికి పైరు పచ్చగా మారిన కాయలు మాత్రం శూన్యం.
- 2.2 లక్షల హెక్టార్లలో మామిడి, 1 హెక్టారు దానిమ్మ, 1 హెక్టారు చీనీ, 1 హెక్టారు జామ, 1 హెక్టారు అరటి, 1 హెక్టారు బొప్పాయి పంటలు జిల్లాలో సాగులో ఉన్నాయి. బోరుబావుల్లో నీరు అడుగంటడంతో రైతులు చెట్లను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.