అన్నదాతకు విత్తన కష్టం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : పెద్ద నోట్ల రద్దు అన్నదాతలకు మరిన్ని ఇక్కట్ల పాల్జేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను అధికారులు ఖాతరు చేయపోవడంతో రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయలేకపోతున్నారు. రూ.500, రూ.1,000 నోట్లను విత్తన దుకాణాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాల వారు స్వీకరించడం లేదు. ఈ నెల 24వ తేదీ వరకు పాత నోట్లను తీసుకోవాలని వ్యవసాయశాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అధికారులు ఆ ఉత్తర్వులను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడంతో రైతులు, విత్తనాలు ఎరువులు కొనే పరిస్థితి లేకుండాపోయింది. మరోవైపు బ్యాంకులు, ఏటీఎంలలో చిల్లర అందుబాటులో లేక రైతులకు కొత్త నోట్లు దొరికే పరిస్థితి లేదు.
ప్రస్తుతం జిల్లాలో శనగ విత్తనాల పంపిణీ జరుగుతోంది. ఇటీవలే విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 63 వేల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా 30 నుంచి 40 శాతం మంది రైతులు విత్తనాలను కొనుగోలు చేయలేదు. విత్తనాలు కొనుగోలు చేద్దామనుకున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. దీంతో రైతుల వద్ద డబ్బులు అందుబాటులో లేకపోవడంతో విత్తనాలు కొనుగోలు చేయలేకపోయారు. 10 రోజులు దాటుతున్న పరిస్థితి యధాతథంగానే ఉంది. బ్యాంకులు, ఏటీఎంలలో సైతం కొత్త నోట్లు దొరికే పరిస్థితి లేదు. చాలా బ్యాంకులు వాటి ఏటీఎంలు మూతబడ్డాయి. తగినంత డబ్బులు ఎప్పటికి అందుబాటులోకి వస్తోందో కూడా తెలియని పరిస్థితి. దీంతో చాలా మంది రైతులు విత్తనాలు కొనలేక అలాగే ఉండిపోయారు.
ప్రభుత్వ ఉత్తర్వులు ఖాతరు చేయని అధికారులు
విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు సంబంధించి రైతుల వద్ద పాత నోట్లను తీసుకోవాలని ఇప్పటికే వ్యవసాయశాఖ కమిషనరేట్ ఈ నెల 15న ఉత్తర్వులిచ్చింది. నవంబర్ 24 వరకు పాత నోట్లను తీసుకోవాలంటూ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయినా విత్తనాలు పంపిణీ చేస్తున్న అధికారులు, పాత నోట్లను తీసుకోవడం లేదు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ పాత నోట్లు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే పొలాలు బీళ్లుగా ఉంచక తప్పదని రైతులు వాపోతున్నారు.