కొనసాగుతున్న ఆత్మహత్యలు
మండ్య జిల్లాలో ఇద్దరు, బాగలకోటె జిల్లాలో ఓ రైతు బలవన్మరణం
మండ్య : మండ్య జిల్లాలో రైతుల ఆత్మహత్యల పర్వం కొనసాగుతూనే ఉంది. చేసిన అప్పులు తీర్చలేమన్న ఆవేదనతో మరో ఇద్దరు అన్నదాతలు శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... కృష్ణరాజపేట తాలూకా పరిధిలోని కెంపికొప్పలికి చెందిన చిన్నస్వామి(40) తన పొలంలోనే విషం తాగి మరణించాడు. ఐపనహళ్లి గ్రామానికి చెందిన మరో రైతు రామకృష్ణప్ప(35) తన ఇం టిలో ఉరి వేసుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య ఐదుకు చేరింది.
మండ్య తాలూకా పరిధిలోని హిరికళలెకు చెందిన శంకరగౌడ, మూడనహళ్లికి చెందిన లోకేష్, దొడ్డతారహళ్లికి చెందిన ప్రదీప ఆత్మహత్యలు చేసుకున్న వైనం విదితమే. రైతు చిన్నస్వామి తనకున్న రెండు ఎకరాల స్థలంలో చెరుకు పంట సాగుకు రూ. రెండు లక్షలు అప్పు చేశాడు. పంట చేతికి వస్తుండగా పురుగు పట్టి మొత్తం ఎండిపోయింది. ఈ నేపథ్యంలోనే పం ట పెట్టుబడుల కోసం అప్పులు ఇచ్చిన వారు తమ డబ్బు చెల్లించాలంటూ ఒత్తిడి పెంచారు. దీంతో అప్పులు తీర్చే మార్గం కానరాక శని వారం తెల్లవారుజామున తన పొలం వద్దకు చేరుకున్న చిన్నస్వామి అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అతని భార్య లతామణి(35) తన ఇంటిలో ఉన్న నిద్రమాత్రలను మింగారు.
విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ఆమెను కేఆర్ పేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలాగే ఐపనహళ్లికి చెందిన యువరైతు రామకృష్ణ(35) తనకున్న నాలుగు ఎకరాల పొలంలో చెరుకు పం ట ను సాగు చేశాడు. ఇందుకోసం పీఎల్‌డీ బ్యాంక్ నుంచి రూ. 2.50 లక్షలు రుణం తీసుకుని పొలంలో బోరు వేయించాడు. బోరు బావిలో నీరు లభ్యం కాలేదు. అంతేకాక చెరుకు పంటకు నీరు అందక ఎండిపోయింది. దీంతో అప్పు ఎలా తీర్చాలంటూ మదనపడే అతను శనివా రం ఉదయం తన ఇంటిలో ఉరి వేసుకున్నాడు.
బాగల్‌కోటె జిల్లాలోని మదూల్ తాలూకా శిరోళి గ్రామానికి చెందిన యువ రైతు హనుమంతు తిమ్మన్న దాసర (28) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పంట పెట్టుబడుల కోసం ఇతరుల వద్ద అతను అప్పు చేశారు. అయితే అకాల వర్షాలతో పంట పూర్తిగా నష్టపోయింది. ఈ నేపథ్యంలోనే అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి పెరగడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతూ వచ్చాడు. ఆఖరుకు అప్పులు తీర్చే మార్గం కానరాక శనివారం అతను ఆత్మహత్య చేసుకున్నాడు.