తరుముకొస్తున్న బీమా
- 31లోపు ప్రీమియం చెల్లించాలి
- గడువు పొడిగించాలనిరైతు నేతల విజ్ఞప్తి
- తమకు ఉత్తర్వులు అందలేదంటున్న అధికారులు
- అయోమయంలో అన్నదాతలు
గుడివాడ : అన్నదాతను వరుస సమస్యలు గుక్కతిప్పుకోనివ్వడంలేదు. ఇప్పటికే రుణ‘మాయ’లో చిక్కుకున్న రైతన్న ఖరీఫ్ సాగుకు కొత్త అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ధీమాను పెంచే పంటల బీమా పథకం ప్రీమియం చెల్లిం పునకు గడువు ముంచుకొస్తోంది. ఈ నెల 31వ తేదీతో పంటల బీమా పథకం ప్రీమియం చెల్లించాలని వ్యవసాయాధికారులు కోరినా ఎవరూ చెల్లించే పరిస్థితిలో లేరు. జిల్లావ్యాప్తంగా 6.30 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేయాల్సి ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు పంటరుణాల మాఫీపై స్పష్టత ఇవ్వకపోవటం వల్లే రైతులు ఈ పథకాన్ని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. వెంటనే రుణాలు మాఫీ అవుతుందా.. లేదా.. ఎంత రుణం మాఫీ అవుతుంది.. తదితర విషయాలు తెలియక రైతులు తికమకపడుతున్నారు. ఈ తరుణంలో ఖరీఫ్ సమయం కాస్తా పూర్తి అవుతున్నా ఇంతవరకు బ్యాంకుల నుంచి రైతులు పైసా రుణం పొందలేదు. ఇప్పటి వరకు జిల్లా వాసులంతా బ్యాంకుల నుంచి పొందే వ్యవసాయ రుణం నుంచే పంటల బీమాకు ప్రీమియం చెల్లించటం ఆనవాయితీ. దీనికితోడు వర్షాభావ పరిస్థితులు రైతుల్ని పట్టి పీడిస్తున్నాయి. ఏటా ఖరీప్‌కు ఏప్రిల్ నుంచి జూలై ఆఖరు వరకు వ్యవసాయ రుణాలు పొందుతుంటారు.
ప్రీమియం చెల్లింపు ఇలా..
గ్రామాన్ని యూనిట్‌గా చేసుకుని కొత్త పంటల బీమా పథకం అమలు చేస్తున్నారు.
ఈ పథకం ద్వారా ప్రతి పంట ఆయా స్టేజీల వారీగా జరిగిన నష్టాన్ని అంచనా బీమా కంపెనీల నిబంధనలకు లోబడి రైతులకు పరిహారం చెల్లిస్తారు.
ఇందుకోసం ప్రతి రైతు తీసుకున్న రుణంలో 12.5 శాతం బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తంలో రైతులు 5 శాతం చెల్లించాలి. ప్రభుత్వం 7.5 శాతం చెల్లిస్తుంది.
వరి రైతుకు బ్యాంకుల నుంచి ఎకరాకు రూ.18,260 వ్యవసాయ రుణం పొందవచ్చు. దీని ప్రకారం ఎకరానికి పంటల బీమాకు ప్రీమియంగా రూ.2,283 బీమా కంపెనీకి చెల్లించాలి. రైతు వాటా(5 శాతం) రూ.913 చెల్లించాలి. ప్రభుత్వం 7.5శాతం చొప్పున రూ.1,370 చెల్లిస్తుంది. ప్రతి రైతు బ్యాంకు నుంచి రుణం పొందినప్పుడు గానీ, లేదా నేరుగా అయినా ప్రీమియంను చెల్లించి పంటల బీమా సదుపాయం పొందవచ్చు. కౌలు రైతులు కూడా ప్రీమియం చెల్లించి ఈ పంటల బీమాను పొందవచ్చు.
గడువు పొడిగిస్తే మేలు
నిత్యం ప్రకృతి వైపరీత్యాలతో పోరాడే రైతన్నకు బీమా ధీమా లేకపోతే తీరని నష్టమని పలువురు అభిప్రాయపడుతున్నారు. రుణమాఫీపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబించడం వల్ల రైతులు కొత్తగా రుణాలు పొందలేక పోయారు. పాత బకాయిలు చెల్లించని కారణంగా కొత్త రుణాలు ఇవ్వటం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పంటల బీమా పథకానికి మరో రెండు నెలలు గడువు పొడిగించాలని రైతు సంఘాల నేతలు డిమాండ్‌చేస్తున్నారు.
గడువు పెంపుపై ఎలాంటి ఉత్తర్వులు లేవు
ఈ నెల 31వ తేదీతో పంట బీమా పథకం ప్రీమియం చెల్లింపునకు గడువు ముగుస్తుంది. ఆసక్తి గల రైతులు నేరుగా అయినా చెల్లించుకోవచ్చు. గడువు పొడిగిస్తూ మాకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదు. వెంటనే ప్రీమియం చెల్లించి బీమా సదుపాయం పొందాలని రైతులకు సూచిస్తున్నాం.
- నర్సింహులు, వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్