తీరనున్న రైతు కష్టాలు
►మోడల్ మార్కెట్ నిర్మాణానికి నిధుల మంజూరు
►త్వరలోనే ప్రారంభం కానున్న పనులు
►హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
సిద్దిపేట అర్బన్: రాష్ట్రంలోనే మొట్టమొదటి మోడల్ వ్యవసాయ మార్కెట్ నిర్మాణం సిద్దిపేటలో జరగనుంది. ఈ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం బుధవారం రూ. 12 కోట్ల నిధులను (ప్రొ.నం.ఎస్2/01/2014) మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. సిద్దిపేట మార్కెట్ మెదక్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల సరిహద్దుల్లో ఉండడంతో సుమారు వంద గ్రామాల నుంచి ఇక్కడికి రైతులు వరి ధాన్యం, మొక్కజొన్నలు, పత్తి, కందులు, పెసర్లు, పొద్దుతిరుగుడు తదితర పంటలను భారీగా ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. అయితే తెచ్చిన పంటలన్నింటినీ మార్కెటింగ్ చేసే సదుపాయాలు ఇక్కడ లేకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు.
ఈ విషయాన్ని పసిగట్టిన రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్దిపేటలో భారీ మార్కెట్ నిర్మాణానికి ప్రణాళిక ను సిద్ధం చేశారు. సమైక్య రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోడల్ మార్కెట్ నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, హరీష్‌రావుకు మార్కెటింగ్ శాఖమంత్రిగా బాధ్యతలు అప్పజెప్పడంతో ఆయన కలల ప్రాజెక్ట్‌కు మార్గం సుగమమైంది. తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేటలో మోడల్ మార్కెట్ నిర్మాణానికి సంబంధించి మంత్రి చేసిన ఆదేశాలతో అధికారగణం శరవేగంగా కదిలింది. జిల్లా స్థాయి అధికారులతోపాటు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు మోడల్ మార్కెట్ నిర్మాణంపై వేగంగా ప్రతిపాదనలు అందజేశారు. డెరైక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, మార్కెటింగ్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సిద్దిపేటలో మోడల్ మార్కెట్ నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు. దీంతో ప్రభుత్వం మోడల్ మార్కెట్ నిర్మాణానికి రూ.12 కోట్లు విడుదల చేసింది.
భారీ షెడ్లు.. సీసీ రోడ్లు..
సిద్దిపేటలో నిర్మించనున్న మోడల్ మార్కెట్‌తో రైతులతోపాటు వ్యాపారులకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కరీంనగర్ రోడ్‌లోని పత్తి మార్కెట్ పక్కన ఆదర్శ వ్యవసాయ మార్కెట్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందులో నాలుగు భారీ షెడ్లు, గోదాములతో కూడిన వ్యాపార దుకాణాలను నిర్మిస్తారు. వీటికి సీసీ రోడ్లు, గేట్లను ఏర్పాటు చేస్తారు. ధాన్యం భారీగా వచ్చి షెడ్లు సరిపోకపోతే పంటల నిల్వకు, కుప్పలు పోయడానికి ప్రత్యేక ఫ్లాట్ ఫామ్‌లు నిర్మిస్తారు.
రైతులకు విశ్రాంత గృహాలు, సెక్యూరిటీ గదులు, వాహనాల పార్కింగ్ స్థలాలు, మూత్రశాలలు, క్యాంటిన్ మొదలగు సౌకర్యాలు కల్పిస్తారు. వీటితో పాటు నంగునూరు సబ్ మార్కెట్ యార్డులో కాంపౌండ్ వాల్ పూర్తికి, షెడ్లు, ఫ్లాట్ ఫామ్‌లు, రోడ్లు నిర్మాణానికి రూ. 1.40 కోట్లను కేటాయించారు. ఈ మార్కెట్ నిర్మాణం పూర్తైతే రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా తమ పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. దీనిపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.