Funds Granted
-
ఆర్అండ్బీ రోడ్లకు మహర్దశ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఆర్అండ్బీ రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఆర్అండ్బీ రోడ్ల విస్తరణ, రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ)ల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. ఇందులోభాగంగా మొత్తం రూ.722 కోట్లను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఇటీవల పరిపాలనా పరమైన అనుమతులు జారీ చేసింది. ఈ అనుమతుల మేరకు రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లో జిల్లాలో 48 బ్రిడ్జిలు, 24 డబుల్ లేన్ రోడ్లు (అంతర్‌మండల), మరో 14 డబుల్ లే న్ రోడ్ల (మండలకేంద్రాలను కలపడంతో పాటు కొన్ని మండల కేంద్రాలను జిల్లా కేంద్రానికి అనుసంధానం చేసేందుకు గాను) నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. వంతెనల నిర్మాణంపై దృష్టి రోడ్డు సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోనికి తెచ్చేందుకు గాను అవసరమైన చోట్ల వంతెనలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా కృష్ణా, గోదావరి నదులపై 389 బ్రిడ్జిలను నిర్మించాలని నిర్ణయించగా, అందులో జిల్లాకు చెందినవి 48 ఉన్నాయి. వీటి నిర్మాణానికి గాను మొత్తం 167.4 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. కృష్ణా, మూసీ నదులపై ఈ బ్రిడ్జిలు ఏర్పాటు చేయనున్నారు. మూసీనదిపై రూ. 26.5 కోట్ల వ్యయంతో రెండు బ్రిడ్జిలు నిర్మించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీబీనగర్ - పోచంపల్లి వద్ద, మనాయికుంట - గురజాల మధ్య ఈ వంతెనలు ఏర్పాటు కానున్నాయి. డిండిపై కూడా రెండు బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 1.5 కోట్లు కేటాయించారు. దేవరకొండ - కంబాలపల్లి, దేవరకొండ - బాపనకుంటల మధ్య వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వీటితో పాటు మరికొన్ని చిన్న చిన్న వంతెనలను కూడా ఏర్పాటు చేయనున్నారు. సింగిల్ టు డబుల్ అదే విధంగా జిల్లాలోని 24 సింగిల్ లేన్ రోడ్లను డబుల్లేన్లుగా మార్చనున్నారు. ఇందుకోసం 300.5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సూర్యాపేట - బీమారం - శెట్టిపాలెంల మధ్య 29 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.35 కోట్లు తొర్రూరు - వలిగొండకు 20 కోట్లు (23 కిలోమీటర్లు) బీబీనగర్ - పోచంపల్లికి రూ. 21 కోట్లు చివ్వెంల - ముకుందాపురానికి రూ. 25 కోట్లు కనగల్ - మాల్, నార్కట్‌పల్లి - మునుగోడులకు ఒక్కో దానికి రూ.15 కోట్ల చొప్పున కేటాయించారు. వీటితో పాటు మరికొన్ని రోడ్లు నిర్మాణం చేసేందుకు కూడా నిధులు మంజూరయ్యాయి. 17 మండలాలు.. 14 పనులు.. రూ. 255 కోట్లు ఇప్పటివరకు సింగిల్ లేన్‌గా ఉన్న రోడ్లను డబుల్ లేన్లుగా మారుస్తూనే వాటిని మండల కేంద్రాలకు, కొన్ని మండల కేంద్రాల రోడ్లను జిల్లా కేంద్రాలకు కలపనున్నారు. మునుగోడు, సంస్థాన్‌నారాయణపూర్ మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి కలిపేందుకు గాను డబుల్ లేన్ రోడ్డు నిర్మాణం కోసం రూ. 42 కోట్లు కేటాయించారు. కొండమడుగు మెట్టు నుంచి బొమ్మల రామారం వరకు రూ. 18 కోట్లు శాలిగౌరారం మండల కేంద్రాన్ని కలుపుతూ నకిరేకల్ నుంచి గురజాల వరకు డబుల్ రోడ్డు కోసం రూ. 16.5 కోట్లుమర్రిగూడ నుంచి గుర్రంపోడు వరకు నాంపల్లి మండల కేంద్రాన్ని కలిపేందుకు రూ. 23.5 కోట్లు కనగల్ నుంచి వ ూల్ (మర్రిగూడ, చండూరు మండల కేంద్రాలను కలిపేందుకు ) రూ. 29 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఆర్అండ్బీ రోడ్ల మంజూరులో ప్రభుత్వం కొంత పక్షపాత ధోరణితో వ్యవహరించిందనేది ఉత్తర్వులను పరిశీలిస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలున్న చోట ఆర్అండ్బీ బ్రిడ్జిలు, రోడ్ల విస్తరణకు పెద్ద పీట వేశారు. సూర్యాపేట, నకిరేకల్, ఆలేరు, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాలకు ఇందులో ఎక్కువ రోడ్లు మంజూరు చేయగా, మిగిలిన నియోజకవర్గాలకు అరకొర మంజూరయ్యాయి. దేవరకొండ నియోజకవర్గానికి కూడా రోడ్లు బాగానే మంజూరయ్యాయి. -
తీరనున్న రైతు కష్టాలు
►మోడల్ మార్కెట్ నిర్మాణానికి నిధుల మంజూరు ►త్వరలోనే ప్రారంభం కానున్న పనులు ►హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు సిద్దిపేట అర్బన్: రాష్ట్రంలోనే మొట్టమొదటి మోడల్ వ్యవసాయ మార్కెట్ నిర్మాణం సిద్దిపేటలో జరగనుంది. ఈ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం బుధవారం రూ. 12 కోట్ల నిధులను (ప్రొ.నం.ఎస్2/01/2014) మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. సిద్దిపేట మార్కెట్ మెదక్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల సరిహద్దుల్లో ఉండడంతో సుమారు వంద గ్రామాల నుంచి ఇక్కడికి రైతులు వరి ధాన్యం, మొక్కజొన్నలు, పత్తి, కందులు, పెసర్లు, పొద్దుతిరుగుడు తదితర పంటలను భారీగా ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. అయితే తెచ్చిన పంటలన్నింటినీ మార్కెటింగ్ చేసే సదుపాయాలు ఇక్కడ లేకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్దిపేటలో భారీ మార్కెట్ నిర్మాణానికి ప్రణాళిక ను సిద్ధం చేశారు. సమైక్య రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోడల్ మార్కెట్ నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, హరీష్‌రావుకు మార్కెటింగ్ శాఖమంత్రిగా బాధ్యతలు అప్పజెప్పడంతో ఆయన కలల ప్రాజెక్ట్‌కు మార్గం సుగమమైంది. తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేటలో మోడల్ మార్కెట్ నిర్మాణానికి సంబంధించి మంత్రి చేసిన ఆదేశాలతో అధికారగణం శరవేగంగా కదిలింది. జిల్లా స్థాయి అధికారులతోపాటు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు మోడల్ మార్కెట్ నిర్మాణంపై వేగంగా ప్రతిపాదనలు అందజేశారు. డెరైక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, మార్కెటింగ్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సిద్దిపేటలో మోడల్ మార్కెట్ నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు. దీంతో ప్రభుత్వం మోడల్ మార్కెట్ నిర్మాణానికి రూ.12 కోట్లు విడుదల చేసింది. భారీ షెడ్లు.. సీసీ రోడ్లు.. సిద్దిపేటలో నిర్మించనున్న మోడల్ మార్కెట్‌తో రైతులతోపాటు వ్యాపారులకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కరీంనగర్ రోడ్‌లోని పత్తి మార్కెట్ పక్కన ఆదర్శ వ్యవసాయ మార్కెట్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందులో నాలుగు భారీ షెడ్లు, గోదాములతో కూడిన వ్యాపార దుకాణాలను నిర్మిస్తారు. వీటికి సీసీ రోడ్లు, గేట్లను ఏర్పాటు చేస్తారు. ధాన్యం భారీగా వచ్చి షెడ్లు సరిపోకపోతే పంటల నిల్వకు, కుప్పలు పోయడానికి ప్రత్యేక ఫ్లాట్ ఫామ్‌లు నిర్మిస్తారు. రైతులకు విశ్రాంత గృహాలు, సెక్యూరిటీ గదులు, వాహనాల పార్కింగ్ స్థలాలు, మూత్రశాలలు, క్యాంటిన్ మొదలగు సౌకర్యాలు కల్పిస్తారు. వీటితో పాటు నంగునూరు సబ్ మార్కెట్ యార్డులో కాంపౌండ్ వాల్ పూర్తికి, షెడ్లు, ఫ్లాట్ ఫామ్‌లు, రోడ్లు నిర్మాణానికి రూ. 1.40 కోట్లను కేటాయించారు. ఈ మార్కెట్ నిర్మాణం పూర్తైతే రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా తమ పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. దీనిపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
విరామమే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర విభజన ప్రక్రియ జిల్లా యంత్రాంగం విధులకు కళ్లెం వేస్తోంది. శనివారం సాయంత్రంతో ఖజానా విభాగం ద్వారా చేపట్టే చెల్లింపుల ప్రక్రియను నిలిపివేశారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు పూర్తయ్యేవరకు ఖజానా విభాగం నుంచి ఎలాంటి చెల్లింపులు చేపట్టొద్దని సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు మే 24లోగా అన్నిరకాల చెల్లింపులు పూర్తిచేయాల్సిందిగా గతంలోనే పేర్కొంది. దీంతో శనివారం సాయంత్రానికల్లా ఉద్యోగుల వేతనాలు, కార్యాలయాల నిర్వహణతో పాటు పెండింగ్ బిల్లులన్నీ పరిష్కరించారు. అయితే తెలంగాణ అపాయింటెడ్ డే.. జూన్ రెండో తేదీకి ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఈలోగానే ఖజానా చెల్లింపులకు స్వస్తి పలకడంతో ఈ ప్రభావం ఇతర శాఖలపైనా పడింది. పలు ప్రభుత్వ విభాగాల నుంచి వివిధ రకాల ఫైళ్ల పరిష్కారానికి సైతం బ్రేక్ పడింది. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ వారం రోజులపాటు స్తంభించే అవకాశం ఉంది. ఎలాంటి అధికారిక నిర్ణయాలకు, నిధుల మంజూరుకూ ఆస్కారం లేకుండాపోయింది. ఇక అధికారులూ ఖాళీగా కూర్చోవాల్సిందే తప్పితే.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. విన్నపాలు ఆలకించడమే.. కొత్త రాష్ట్ర ఏర్పాటులో భాగంగా స్థానికేతర ఉద్యోగులను సొంత రాష్ట్రాలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ప్రధాన కార్యాలయాల్లోని ఉద్యోగుల విభజన పూర్తి చేసిన ప్రభుత్వం.. జిల్లా స్థాయి ఉద్యోగుల బదిలీకి సైతం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా స్థాయి ఉద్యోగుల స్థానికత వివరాల పరిశీలనకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. స్థానిక, స్థానికేతర అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేస్తే కొత్త రాష్ట్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. ఒకవైపు ఖజానా విభాగం పనులు తాత్కాలికంగా నిలుపుదల కావడం .. ఇటు అధికారులు స్థానిక, స్థానికేతర వివరాల సేకరణలో బిజీగా మారడంతో రోజువారీ పాలనకు ఆటంకం కలుగ నుంది. చెల్లింపుల ప్రక్రియ నిలిచిన నేపథ్యంలో కేవలం ప్రణాళికలు, బిల్లులు తయారు చేసే వరకే అధికారుల చర్యలు పరిమితం కానున్నాయి. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి కేవలం ఆర్జీలు తీసుకోవడం తప్ప వాటి పరిష్కారానికి మాత్రం జూన్ 2వరకు ఆగాల్సిందేనని అధికారులు చుబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను ఆలకించడం తప్ప వారం రోజులవరకు చేసేదేం లేదని ఓ అధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
గ్రంథాలయం ఏర్పాటుకు నిధులిస్తాం
రణస్థలం రూరల్, న్యూస్‌లైన్: పైడిభీమవరం పంచాయతీలో గ్రంథాలయం ఏర్పాటుకు శ్యాంక్రగ్ పిస్టన్స్ ఉద్యోగుల సం ఘం ముందుకొచ్చింది. గ్రామంలో గురువారం సాక్షి జనసభ జరిగింది. ఇందులో బావిశెట్టి మధుసూదనరావుతో పాటు మరి కొంతమంది యువకులు గ్రామంలో గ్రంథాల యం లేకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను వివరించారు. పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయూరు. దీనిపై స్థానిక శ్యాంక్రగ్ పిస్టన్స్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు స్పందించారు. పంచాయతీ తరఫున స్థలం మంజూరు చేస్తే గ్రంథాలయం ఏర్పాటుకు నిధులు సమకూరుస్తామని సంఘ ప్రతినిధి కె.కోటేశ్వరరావు హామీ ఇచ్చారు. ఈ మేరకు లేఖను సర్పంచ్ లంకలపల్లి ప్రసాద్‌కు అందించారు. గ్రంథాలయంతోపాటు నిరుద్యోగ యువకులకు శిక్షణకేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పిప్పళ్ల వెంకటరమణతో పాటు ఉద్యోగుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.