సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర విభజన ప్రక్రియ జిల్లా యంత్రాంగం విధులకు కళ్లెం వేస్తోంది. శనివారం సాయంత్రంతో ఖజానా విభాగం ద్వారా చేపట్టే చెల్లింపుల ప్రక్రియను నిలిపివేశారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు పూర్తయ్యేవరకు ఖజానా విభాగం నుంచి ఎలాంటి చెల్లింపులు చేపట్టొద్దని సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు మే 24లోగా అన్నిరకాల చెల్లింపులు పూర్తిచేయాల్సిందిగా గతంలోనే పేర్కొంది. దీంతో శనివారం సాయంత్రానికల్లా ఉద్యోగుల వేతనాలు, కార్యాలయాల నిర్వహణతో పాటు పెండింగ్ బిల్లులన్నీ పరిష్కరించారు. అయితే తెలంగాణ అపాయింటెడ్ డే.. జూన్ రెండో తేదీకి ఇంకా వారం రోజుల సమయం ఉంది.
ఈలోగానే ఖజానా చెల్లింపులకు స్వస్తి పలకడంతో ఈ ప్రభావం ఇతర శాఖలపైనా పడింది. పలు ప్రభుత్వ విభాగాల నుంచి వివిధ రకాల ఫైళ్ల పరిష్కారానికి సైతం బ్రేక్ పడింది. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ వారం రోజులపాటు స్తంభించే అవకాశం ఉంది. ఎలాంటి అధికారిక నిర్ణయాలకు, నిధుల మంజూరుకూ ఆస్కారం లేకుండాపోయింది. ఇక అధికారులూ ఖాళీగా కూర్చోవాల్సిందే తప్పితే.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది.
విన్నపాలు ఆలకించడమే..
కొత్త రాష్ట్ర ఏర్పాటులో భాగంగా స్థానికేతర ఉద్యోగులను సొంత రాష్ట్రాలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ప్రధాన కార్యాలయాల్లోని ఉద్యోగుల విభజన పూర్తి చేసిన ప్రభుత్వం.. జిల్లా స్థాయి ఉద్యోగుల బదిలీకి సైతం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా స్థాయి ఉద్యోగుల స్థానికత వివరాల పరిశీలనకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. స్థానిక, స్థానికేతర అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేస్తే కొత్త రాష్ట్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.
ఒకవైపు ఖజానా విభాగం పనులు తాత్కాలికంగా నిలుపుదల కావడం .. ఇటు అధికారులు స్థానిక, స్థానికేతర వివరాల సేకరణలో బిజీగా మారడంతో రోజువారీ పాలనకు ఆటంకం కలుగ నుంది. చెల్లింపుల ప్రక్రియ నిలిచిన నేపథ్యంలో కేవలం ప్రణాళికలు, బిల్లులు తయారు చేసే వరకే అధికారుల చర్యలు పరిమితం కానున్నాయి. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి కేవలం ఆర్జీలు తీసుకోవడం తప్ప వాటి పరిష్కారానికి మాత్రం జూన్ 2వరకు ఆగాల్సిందేనని అధికారులు చుబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను ఆలకించడం తప్ప వారం రోజులవరకు చేసేదేం లేదని ఓ అధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
విరామమే!
Published Sun, May 25 2014 11:49 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement