సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పొత్తులు తేలకపోవడం ఆశావహుల్లో ఆందోళన పెరుగుతోంది. టీఆర్‌ఎస్ -కాంగ్రెస్, బీజేపీ -టీడీపీల మధ్య సీట్ల సర్దుబాటు ఉంటుందనే విషయంపై స్పష్టత లేకపోవడం వారిని డోలాయమానంలో పడేసింది. సార్వత్రిక సమరానికి గడువు దరిచేరుతున్నా కొద్దీ ఆయా పార్టీల్లో గందరగోళం రెట్టింపవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. అయితే, విలీనంలేదని, ఒంటరిగా బరిలోకి దిగుతామని ఆయన స్పష్టం చేయడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది.
కేసీఆర్ విస్పష్ట ప్రకటనలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం పొత్తుపై ఆశను చంపుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌తో సీట్ల సర్దుబాటు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా సంకేతాలు ఇస్తోంది. ఈ విషయమే టికెట్లు ఆశిస్తున్నవారికి ఆందోళన కలిగిస్తోంది. గడువు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటివరకు పొత్తులపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రచారంపై తేల్చుకోలేకపోతున్నారు. మరోవైపు బీజేపీ -టీడీపీల దాదాపు దోస్తీ ఖరారైందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, అధికారికంగా ప్రక టన చేయకపోవడంతో పాతమిత్రుల మధ్య మీమాంస నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతర్గతంగా సీట్ల అవగాహన చేసుకున్న పాతమిత్రులు.. సాధారణ ఎన్నికలపై స్పష్టత రాకపోవడంతో అధిష్టానం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.
కొండా-జైపాల్‌లలో ఎవరు?
కాంగ్రెస్- టీఆర్‌ఎస్‌ల మధ్య సయోధ్య కుదిరితే చేవెళ్ల ఎంపీ స్థానం ఇరుపార్టీలకు కీలకం కానుంది. ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో సిట్టింగ్ సీటును వదులుకునేందుకు ఆ పార్టీ అంగీకరించే అవకాశంలేదు. అదే సమయంలో టీఆర్‌ఎస్ ఇప్పటికే చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరును ప్రకటించింది. పొత్తులో ఈ సీటు కోసం పట్టుబట్టే అవకాశముంది. దీంతో ఇరు పార్టీలకు ఈ స్థానం ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఒకవేళ జైపాల్ మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి మారితే కొండాకు ఛాన్స్ లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ యువనేత కార్తీక్‌రెడ్డి ఈ సీటుపై గంపెడాశ పెట్టుకున్నారు. జైపాల్‌రెడ్డి పోటీకి దిగనిపక్షంలో తాను పోటీచే స్తానని ఇదివరకే స్పష్టం చేశారు.
ఆ ‘నాలుగింటి’పై ఇరు పార్టీల కన్ను!
గులాబీ నాయకత్వం జిల్లాపై ఈ సారి కన్నేసింది. పొత్తు లేకపోతే అన్ని స్థానాలకు పోటీచేయాలని భావిస్తోంది. ఒకవేళ ‘చే’యూత లభిస్తే తాండూరు, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, కుత్బుల్లాపూర్‌ను కోరాలని యోచిస్తోంది. ఇందులో ఇప్పటికే పరిగి, చేవెళ్ల, తాండూరుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీటిని కాంగ్రెస్‌కు విడిచిపెట్టవద్దని ఆ పార్టీ నాయకత్వం అనుకుంటోంది. అలాగే గతంలో ఓడిన వికారాబాద్‌పై కూడా పట్టుబట్టాలని భావిస్తోంది.
ఈ నాలుగు సీట్ల సర్దుబాటు ఇరుపార్టీలకు సవాల్‌గా మారనుంది. ఈ స్థానాల్లో పార్టీ బలీయంగా ఉండడం, ఆశావహుల సంఖ్య కూడా గణనీయంగా ఉండడంతో సహజంగానే కాంగ్రెస్ ఈ సీట్లపై పట్టుబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రస్థాయిలో ఒప్పందం జరిగినా, క్షేత్రస్థాయిలో ఇరుపార్టీల శ్రేణులు పరస్పరం సహకరించుకోవడం అనుమానమే. ఇన్నాళ్లు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ‘కారె’క్కినంత మాత్రాన గుడ్డిగా మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ కేడర్ స్పష్టం చేస్తోంది. పొత్తులపై ఒకవైపు మీమాంస కొనసాగుతుండగానే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది కూడా సంప్రదింపుల వేళ పేచీలకు దారితీసే అవకాశముంది.
మల్కాజిగిరిపై బీజేపీ గురి
బీజేపీతో బంధం బలపడితే తెలుగు తమ్ముళ్లు కొన్ని సీట్లను వదులుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో చెప్పుకోదగ్గస్థాయిలో ఓటింగ్ శాతం కలిగియున్న కమలం.. తెలంగాణ క్రెడిట్ మాదేననే మంచి ఊపులో ఉన్న ఆ పార్టీ.. జిల్లాపై గంపెడాశలు పెట్టుకుంది. ముఖ్యంగా శివార్లలోని ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, ఉప్పల్, మేడ్చల్, గ్రామీణ తాండూరు సీటుపై కన్నేసింది. బీజేపీ కోరేవాటిలో చాలావరకు తాము బలంగా ఉన్నవి కావడం టీడీపీకి ఇబ్బందిగా మారనుంది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉండడం, అసమ్మతి రాజకీయాలు తమకు కలిసివస్తాయని ‘దేశం’ అంఛనా వేస్తోంది.
అడిగిన వాటిలో కొన్నింటినైనా కేటాయించకపోతే మిత్రభేదం ఉంటుందనే ఆ పార్టీ భావిస్తోంది. తాండూరును బీజేపీకి కేటాయించేందుకు టీడీపీ కూడా సుముఖంగా ఉంది. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ గూటికి చేరిన నేపథ్యంలో.. ఈ స్థానాన్ని మిత్రపక్షానికి ఇవ్వడం శ్రేయస్కరమని అనుకుంటోంది. మరోవైపు రెండు ఎంపీ సీట్లలో మల్కాజిగిరిపై బీజేపీ గురి పెట్టింది. పట్టణ ఓటర్లు అధికంగా ఉండడం తమకు కలిసివస్తుందని కాషాయదళం భావిస్తోంది. సమీకరణల నేపథ్యంలో అది సాధ్యం కాకపోతే చేవెళ్లపై పట్టు పట్టే అవకాశంలేకపోలేదు.
ఎటూ తేలక...
Published Wed, Mar 12 2014 10:55 PM | Last Updated on Fri, Mar 29 2019 9:00 PM
Advertisement
Advertisement