అధ్యక్షుడు అమిత్ షా
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో బీజేపీ పాగా వేయడానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టి సారించారు. బుధవారం రాష్ట్ర పర్యటనకు రానున్న ఆయన జిల్లా పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. బేగంపేట నుంచి నేరుగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు క్షేత్రస్థాయి నాయకులతో భేటీ కావడంతో పాటు ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల శక్తికేంద్ర ఇన్‌చార్జులు, పదాధికారులతో సమావేశం అవుతారు. అలాగే చేవెళ్ల, మల్కాజిగిరి, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని బూత్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, శక్తికేంద్రం ఇన్‌చార్జీలు, పదాధికారులతో పార్టీ కార్యకలాపాలపై సమీక్షిస్తారు.
ప్రధానంగా బూత్ లెవల్ 23 అంశాల అమలు తీరుపై ఆరా తీయనుండడంతోపాటు పార్టీ పటిష్టతకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకోనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నగర శివార్ల పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆ పార్టీలో అమిత్ షా పర్యటన కొత్త ఉత్సాహాన్ని నింపనుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత తొలిసారి ఆయన నగరానికి వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment