అభ్యర్థుల ఖరారుపై కమలదళం కసరత్తు చేసోంది. అభ్యర్థుల ప్రకటన.. ప్రచారపర్వంలోనూ ప్రతిసారి ముందంజలో ఉండే బీజేపీ ఈసారి మాత్రం తడబాటుకు గురవుతోంది. గత ఎన్నికల్లో తక్కువ స్థానాలకు పరిమితమైన ఆ పార్టీ.. ఇప్పుడు అన్ని సెగ్మెంట్లలో పోటీకి సిద్ధమవుతోంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలో దిగుతామని అధిష్టానం ప్రకటించడంతో గెలుపు గుర్రాలను అన్వేషిస్తోంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో నాలుగు స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక చోట(ఉప్పల్) మాత్రమే గెలిచింది. వికారాబాద్, మల్కాజిగిరి, పరిగి నియోజకవర్గాల్లో ఓడిపోయింది. ఈసారి మాత్రం 14 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతోంది. అక్టోబర్ రెండో వారంలో టికెట్లను ఖరారు చేస్తామని బీజేపీ అధినాయకత్వం సంకేతాలిచ్చింది. దీంతో ఆ లోపు అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆశావహుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరిస్తోంది. ఈసారి ఒంటరిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో టికెట్ల కోసం తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఒక్కోసీటును నలుగురైదుగురు ఆశిస్తుండడంతో పోటీ నెలకొంది.
ఆచారికి ఓకే..!
2014 ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి బరిలోకి దిగి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆచారికి మరోసారి టికెట్టు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ సీటుకు ఇతరుల నుంచి కూడా పోటీ లేకపోవడంతో ప్రచారం మొదలు పెట్టాలని సూచించింది. అలాగే, షాద్‌నగర్ నియోజకవర్గం టికెట్టును శ్రీవర్దన్‌రెడ్డికి దాదాపుగా కేటాయించినట్లే. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసిన ఆయన.. ఈసారి కూడా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ రెండు మినహా మిగతా నియోజకవర్గాల్లో ఆశావహుల మధ్య రసవత్తర పోటీ సాగుతోంది.
చేవెళ్ల ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయాలని ప్రకాశ్ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, ఆ నియోజకవర్గంలోని ప్రత్యర్థి పార్టీల్లో జరుగుతున్న తాజా పరిణామాలను విశ్లేషించుకుంటున్న కమల నాయకత్వం.. ఆ పరిణామాలకు అనుగుణంగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లో టికెట్టురాని బలమైన నేతను ఆకర్షించి బరిలో నిలబెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయ కుడు శేరి నర్సింగరావు చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఆశీస్సులతో ఆయన టి కెట్టు దక్కించుకుంటారని ప్రచారం జరుగుతోంది.
రాజేంద్రనగర్ రేసులో బద్దం?
రాజేంద్రనగర్ రాజకీయం రసవత్తరంగా కనిపిస్తోంది. ఈ సెగ్మెంట్ నుంచి బరిలో దిగాలని మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి భావిస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. పట్టణ ఓటర్లు ఎక్కువ గా ఉండడం.. మజ్లిస్ ప్రాబల్యం కూడా అధికంగా ఉండడంతో ఆయనకు ప్లస్ కాగలదనే ప్రచారం జ రుగుతోంది. మాజీ అధ్యక్షుడు ప్రేమ్‌రాజ్ యాద వ్, అంజన్‌కుమార్, మణికొండ సర్పంచ్ నరేందర్ రెడ్డి కూడా ఈ స్థానంపై గంపెడాశలు పెట్టుకున్నారు.
పేరాలకు ఎల్‌బీనగర్
సంఘ్ వ్యవహారాల్లో కీలకంగా ఉంటున్న పేరాల చంద్రశేఖర్ ఎల్‌బీనగర్ నుంచి పోటీకి ఉత్సాహం చూపుతున్నారు. కొంతకాలంగా నియోజకవ ర్గంలో జరిగే పార్టీ కార్యకలాపాల్లో ఆయన చు రుగ్గా పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో కార్పొరేట ర్‌గా పోటీచేసి ఓడిపోయిన వంగ మధుసూదన్ రెడ్డి కూడా ఈ సీటుపై కన్నేశారు. సీనియర్ నాయకుడు స్వామిగౌడ్ కూడా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని అధిష్టానానికి విన్నవించుకున్నారు.
మహేశ్వరంలో పోటాపోటీ..
మహేశ్వరం టికెట్టు కోసం జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, అధికార ప్రతినిధి సుధాకర్‌శర్మ, పార్టీ నేతలు పాపయ్యగౌడ్, శంకర్‌రెడ్డి, జంగయ్యయాదవ్ పోటీపడుతున్నారు. శేరిలింగంపల్లిలో జ్ఞానేంద్రప్రసాద్, నరేశ్, భాస్కర్‌రెడ్డి, అశోక్, మహిళా కోటాలో నర్రా జయలక్ష్మి టికెట్టు అడుగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment