సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రాష్ట్ర విభజన అంశం చివరి అంకానికి చేరుకుంది. నాలుగు రోజుల్లో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ భవిష్యత్తు తేలనుంది. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు గతంలో చేసిన వ్యాఖ్యలు ఇరుపార్టీల నేతలను సంకటంలో పడేశాయి. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని కదన కుతుహలంతో ఉన్న ఆశావహులను ఢిల్లీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కలవరపరుస్తున్నాయి. లోక్‌సభలో ‘టీ’ బిల్లు ప్రవేశపెట్టడమే తరువాయి.. టీఆర్‌ఎస్ విలీనంపై రాజకీయవర్గాల్లో చర్చలు జోరుగా ఊపందుకున్నాయి.
‘టీ’ బిల్లు విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ప్రదర్శిస్తున్న దూకుడుతో ప్రత్యేక రాష్ట్రం ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ ఇస్తే పార్టీ విలీనానికి సై అని సంకేతాలివ్వడంతోనే కాంగ్రెస్ పార్టీ శరవేగంగా విభజన ప్రక్రియను పూర్తి చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. పక్షం రోజులుగా హస్తినలో మకాం వేసిన కే సీఆర్ ఇటీవల యూపీఏ ైచె ర్‌పర్సన్ సోనియాగాంధీతో మంతనాలు జరిపారు. ఈ సమావేశంలోనే వచ్చే ఎన్నికల్లో ఇరుపార్టీలు అనుసరించాల్సిన వ్యూహం కొలిక్కి వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ప్రక్రియ పూర్తయితే ‘చేయూత’నిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ విలీనం కుదరని పక్షంలో పొత్తు కుదరడం ఖాయమని తెలుస్తోంది. దీంతో మారనున్న రాజకీయ సమీకరణలు అటు కాంగ్రెస్ శిబిరాన్ని.. ఇటు గులాబీ దండును అంతర్మథనంలో పడేశాయి. పొత్తు పొడిచినా... విలీనమైనా తమ సీట్లకు ఎక్కడ ఎసరొస్తుందోననే బెంగ వారిని వెంటాడుతోంది. సాధారణ ఎన్నికలపై గంపెడాశతో పార్టీ శ్రేణులను కదిలించేందుకు డబ్బును మంచినీళ్లప్రాయంలా ఖర్చు చేసిన నేతలకు తాజా పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమ ఆశలపై నీళ్లుచల్లేలా ఇరుపార్టీల అధినాయకత్వం సంప్రదింపులు జరుపుతుండడంతో ఏమీ పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను వారు ఆసక్తి పరిశీలిస్తున్నారు.
కాంగ్రెస్‌తో దోస్తీ కుదిరినా.. విలీనమైనా టీఆర్‌ఎస్ అడిగే మొదటి సీటు పరిగి. సిట్టింగ్ శాసనసభ్యుడు హరీశ్వర్‌రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఈ స్థానంపై టీఆర్‌ఎస్ పట్టుబట్టే అవకాశంలేకపోలేదు. ఇది కాంగ్రెస్ ఆశావహులను కలవరపరుస్తోంది. గతంలో పోటీచేసిన మాజీ మంత్రి కమతం రాంరెడ్డి సహా 2009లో రెబల్ అభ్యర్థిగా బరిలో దిగి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన రామ్మోహన్‌రెడ్డిలు (టీఆర్‌ఆర్) వచ్చే ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్న టీఆర్‌ఆర్ బరిలో దిగి భవితవ్యాన్ని తేల్చుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్- కాంగ్రెస్ పార్టీల మధ్య చిగురిస్తున్న బంధం ఇరుపక్షాల నేతలను ఆత్మరక్షణలో పడేస్తోంది.
తెలుగుదేశం పార్టీతో పొసగని మలిపెద్ది సుధీర్‌రెడ్డి ఏడాది క్రితం టీఆర్‌ఎస్ గూటికి చేరారు. సీనియర్ నేతగా గుర్తింపు పొందిన ఆయనకు కేసీఆర్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దాదాపుగా తనకే టికెట్ ఖాయమనే సంకేతాలు ఇవ్వడంతో సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌ను బలీయమైన శక్తిగా మలిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో సర్పంచ్ స్థానాలు గెలిపించగలిగారు. కాగా తాజా పరిణామాలు ఈయన రాజకీయ భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎల్లార్ ఇక్కడి నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. ఉభయ పార్టీల మధ్య మైత్రి కుదిరితే... సిట్టింగ్‌కు ప్రాధ్యానమిచ్చే అవకాశాలెక్కువ. తాజా పరిణామాలు సుధీర్‌రెడ్డి శిబిరంలో కలకలం రేపుతున్నాయి.
మొదట్నుంచీ వికారాబాద్‌లో ‘కారు’జోరు ఎక్కువ. ఉద్యమ ప్రభావం కూడా గణనీయంగా కనిపించే ఈ నియోజకవర్గం నుంచి గతంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ప్రకటన అనంతరం ఆయన కాంగ్రెస్ పంచన చేరారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌కు మంత్రి ప్రసాద్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చంద్రశేఖర్ నిష్ర్కమణ అనంతరం స్థానిక వైద్యుడు ఆనంద్ టీఆర్‌ఎస్ గూటికి చేరారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. సిట్టింగ్ మంత్రిని కాదని టీఆర్‌ఎస్‌కు ఈ సీటు ఇవ్వడం గగనమే. అదే సమయంలో టీఆర్‌ఎస్ గట్టిగా అడుగుతున్న నియోజకవర్గాల్లో ఇదొకటి.
కాస్తో కూస్తో బలం ఉన్న చేవెళ్ల, తాండూరులపై టీఆర్‌ఎస్ కన్నేసింది. ఒంట రిగా ఇక్కడి నుంచి బరిలో దిగి సత్తా చాటాలని భావిస్తున్న ఆ పార్టీ విలీనమైనా.. పొత్తు కుదిరినా తమ పార్టీ నేతల అభ్యర్థిత్వాలకు ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేసే అవకాశంలేకపోలేదు.
చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీచేయాలని నిర్ణయించుకున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇప్పటికే కదనరంగంలోకి దూకారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను మచ్చిక చేసుకునే పనిలోపడ్డారు. టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో కలిసిపోతే ఎంపీ అభ్యర్థిగా తానే ఉండేలా వ్యూహ రచన చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో బలమైన లాబీయింగ్ కలిగి ఉన్న విశ్వేశ్వర్ అవసరమైతే తన పలుకుబడిని ఉపయోగించి ఉభయ పార్టీల అభ్యర్థిగా తానే బరిలో నిలిచేలా పావులు కదుపుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ ఆశావహులకు ఈ పరిణామం మింగుడు పడడంలేదు. హైకమాండ్‌ను ఒప్పించి బీ ఫారం దక్కించుకునే సత్తా కొండాకు ఉండడం కాంగ్రెస్ నేతల ను ఆందోళన కలిగిస్తోంది. పొత్తు కుదిరితే ఇక్కడ తమకు సీటు దొరకడం కష్టమేనని కాంగ్రెస్ ఆశావహులు భావిస్తున్నారు.
‘చేయి’ కలిపితే!
Published Sun, Feb 16 2014 1:16 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement