సాక్షి, రంగారెడ్డి: అధికార పార్టీలో నేతల మధ్య సయోధ్య కరువవుతోంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం, మీర్‌పేట, బడంగ్‌పేట్, తుక్కుగూడ మున్సిపాలిటీల్లో అధికార పార్టీ పాలక మండలి సభ్యులు రెండుగా చీలిపోయి పరస్పర ఫిర్యాదులు చేసుకుంటుండగా తాజాగా అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి.
ఇప్పటి వరకు మిన్నకుండిన ద్వితీయశ్రేణి నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచే దారులు సిద్ధం చేసుకుంటున్నారు. అధిష్టానం వద్ద తమకే గుర్తింపు ఉందని, వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకు వస్తుందంటే తమకేనంటూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం విశేషం. ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో కేడర్ అయోమయానికి గురవుతోంది.
చేవెళ్లలో కాలె వర్సెస్ రత్నం
చేవెళ్ల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని, అధిష్టానం ఆశీస్సులు తమకే ఉన్నాయంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఎవరికి వారు సొంతంగా కేడర్‌ను తయారు చేసుకుని అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ చర్చనీయాంశమవుతున్నారు.
మహేశ్వరంలో తీగల.. పటోళ్ల
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆయన కోడలు జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి సబిత, తీగల ఇద్దరూ పోటీకి సిద్ధమవుతున్నారు. ఇద్దరు నేతల మధ్య అంతర్గత విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి.
ఎల్బీనగర్‌లో దేవిరెడ్డి.. ముద్దగోని
ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి అధికారపార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ముద్దగోని రామ్మోహన్‌గౌడ్ మళ్లీ తన అస్థిత్వాన్ని నిలుపుకొనేందుకు యత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గెలుపొంది ఆ తర్వాత అధికారపారీ్టలో చేరిన ఎమ్మెల్యే దేవిరెడ్డి్కి దీటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తానూ ఎన్నికల బరిలో ఉన్నాననే సంకేతాలు అటు కేడర్, ఇటు అధిష్టానానికి పంపే ప్రయత్నం చేస్తున్నారు.
‘పట్నం’లో మంచిరెడ్డి వర్సెస్ క్యామ
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గత ఎన్నికల్లో స్వల్ప మెజార్జీతో గెలుపొందారు. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణ లపై తాజాగా ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. యాచారం ఫార్మాసిటీ, వెలిమనేడు ఇండ్రస్టియల్ పార్కు, ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ కార్యాలయాలకు భూసేకరణ విషయంలో ఆయనపై కొంత వ్యతిరేకత ప్రారంభమైంది. గత ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ను వీడి అధికార పారీ్టలో చేరిన క్యామ మల్లేశ్ దీన్ని అవకాశంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన సమయంలోనే సీఎం కేసీఆర్ తనకు హామీ ఇచ్చారని.. వచ్చే ఎన్నికల్లో తనకే బి ఫాం అంటూ నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు.
కల్వకుర్తిలో జైపాల్.. కసిరెడ్డి
కల్వకుర్తిలో పార్టీ రెండుగా చీలిపోయింది. ఒకరు నిర్వహించే కార్యక్రమంలో మరొకరు పాల్గొనని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మళ్లీ తనకే టికెట్ వస్తుందని, పోటీ చేసేది తానేనని ప్రచారం చేసుకుంటున్నారు. నిత్యం ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయతి్నస్తున్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం పోటీకి సిద్ధమవుతున్నారు. కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నిక విషయంలో ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా వెల్దండ ఎంపీపీ, మరో ఆరుగురు సర్పంచ్‌లు ఇటీవల తిరుగుబాటుబావుటా ఎగురవేయడం గమనార్హం. మరోవైపు తలకొండపల్లి జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్ సైతం పోటీకి సిద్ధమవుతున్నారు. టికెట్ తనకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
అసెంబ్లీపై చేవెళ్ల ఎంపీ గురి
చేవెళ్ల ఎంపీ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ లేకున్నా తనకున్న ఆర్థిక వనరులు, అధిష్టానం ఆశీస్సులతో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment