కొంగరకలాన్ సభలో మాట్లాడుతున్న కేసీఆర్ (ఫైల్)
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ముందస్తు’ ఎన్నికల నగారాకు మన జిల్లానే వేదికగా నిలిచింది. జైత్రయాత్రకు ఇక్కడే అంకురార్పణ చేసిన గులాబీ నాయకత్వం.. ఊహకందని విజయాలను సాధించి చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ జిల్లాలో బలీయశక్తిగా ఎదిగింది. గతంలో కేవలం షాద్‌నగర్ సీటుకే పరిమితమైన ఆ పార్టీ.. తాజాగా ఆరు సీట్లలో విజయం సాధించి ఆజేయశక్తిగా ఆవతరించింది.
డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఏఐసీసీ దూతలపైనే అవినీతి ఆరోపణాస్త్రాలు సంధించి పార్టీకి దూరమవగా.. ఎల్‌బీనగర్ సీటు అడిగితే ఇవ్వకుండా ఇబ్రహీంపట్నం కట్టబెట్టడంతో సామ రంగారెడ్డి ఏకంగా తెలంగాణ టీడీపీ పెద్దలపై విరుచుకుపడ్డారు. దాదాపు టికెట్ ఖాయమైందని భావించిన బీజేపీ సారథి బొక్క నర్సింహారెడ్డికి చివరి నిమిషంలో టీఆర్‌ఎస్ జైత్రయాత్రకు జిల్లాలోనే అంకురార్పణనిరాశే మిగలడం ఈ ఏడాది పొలిటికల్ రౌండప్‌లో కొసమెరుపు.
‘ముందస్తు’ కుదుపు
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతున్న తరుణంలో గులాబీ దళపతి మాత్రం ముందస్తు ఎన్నికలకు ముందడుగు వేసి రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఆగస్టులో మొదలైన ఈ ప్రచారంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సెప్టెంబర్ 2న కొంగరకలాన్‌లో ‘ప్రగతి నివేదన సభ’ దేశ రాజకీయాల్లో కీలక మార్పునకు నాంది పలికింది. లక్షలాది మంది తరలివచ్చిన ఈ బహిరంగసభలోనే ముందస్తుకు శంఖారావం పూరించిన గులాబీ బాస్ కేసీఆర్.. సెప్టెంబర్ ఆరో తేదీన శాసనసభను ఆర్థాంతరంగా రద్దు చేసి సమరానికి సై అన్నారు. అదే రోజు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి రికార్డు సృష్టించారు.
శాసనసభ రద్దుతో ఉలిక్కిపడ్డ కాంగ్రెస్, టీడీపీలు అప్రమత్తమైనా అభ్యర్థుల ఖరారులో ఎడతెగని జాప్యం పాటించాయి. ప్రజాకూటమిగా జతకట్టి ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నాయి. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం స్థానాలను టీడీపీకి సర్దుబాటు చేసిన ఒక్కచోట కూడా బోణీ కొట్టకుండానే బొక్కబోర్లా పడింది. ఇక కాంగ్రెస్ మాత్రం ఎల్‌బీనగర్, మహేశ్వరం సీట్లను గెలుచుకొని బతుకుజీవుడా అంటూ ఊపిరిపీల్చుకుంది. ఇక బీజేపీ ఖాతా తెరవకుండానే వెనుదిరగగా.. తొలిసారి బలమైన అభ్యర్థులో బరిలో దిగిన బీఎస్పీ మాత్రం షాద్‌నగర్, ఇబ్రహీంపట్నంలో గణనీయ ఓటు బ్యాంకు సాధించి ఔరా! అనిపించింది.
కొండా తిరుగుబాటు
ఈసారి జిల్లా రాజకీయాల్లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా హాట్ టాపిక్‌గా మారింది. అధిష్టానంపై ధిక్కారస్వరం వినిపించిన కొండా.. టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఆయన ఎన్నికల వేళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించాలని కసితో పనిచేసిన ఆయనకు అది సాధ్యపడలేదు కానీ, తాను విభేదించే మహేందర్‌రెడ్డి ఓడిపోవడం.. అదీ తన సన్నిహితుడు రోహిత్‌రెడ్డి చేతిలో మంత్రి చావుదెబ్బ తినడం సంతోష పరిచింది.
అదే సమయంలో టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం చేదు గుళికగా మారింది. ఇక కొండాను అనుసరించిన యాదవరెడ్డికి ఈ ఏడాదే ఖేదాన్నే మిగిల్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే గంపెడాశతో సొంతగూటికి చేరిన ఆయనకు నిరాశే మిగిలింది. దీనికితోడు ఫిరాయింపు చట్టం కింద ఆయనపై వేటు కత్తి వేలాడుతుండడం యాదవరెడ్డి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారింది. ఇక టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డిని అనుసరించిన జెడ్పీటీసీ సభ్యులకు కూడా ఈ సారి అంతగా కలిసిరాలేదు.
కాంగ్రెస్‌లో ముడుపుల కల్లోలం
అంతర్గత కలహాలు కాంగ్రెస్‌ను నట్టేట ముంచాయి. టికెట్లను అమ్ముకున్నారంటూ ఏకంగా డీసీసీ సారథి క్యామ మల్లేశ్ ఆడియో టేపులను విడుదల చేయడం కలకలం రేపింది. అంతేగాకుండా బీసీలకు అన్యాయం చేస్తున్నారని బహిరంగ విమర్శలకు దిగడంతో ఆయనపై వేటు పడింది. ఈ పరిణామంతో మల్లేశ్ కాస్తా కారెక్కగా.. ఇబ్రహీంపట్నం రాజకీయం మాత్రం ఆధ్యంతం రక్తి కట్టించింది. పొత్తులో ఈ సీటును టీడీపీకి కేటాయించడంతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగిన మల్‌రెడ్డి రంగారెడ్డి నామినేషన్ల రోజున కాంగ్రెస్ బీ–ఫారం ఇచ్చిందని ఆర్భాటం ప్రదర్శించి.. చివరకు బీఎస్పీ తరఫున నామినేషన్ వేయడం చర్చకు దారితీసింది. ప్రచారం చివరి రోజున మెట్టుదిగిన కాంగ్రెస్ అధిష్టానం మల్‌రెడ్డికి బహిరంగ మద్దతు ప్రకటించినా ఆయన మాత్రం గెలుపు వాకిట బొల్తా పడ్డారు. అగ్రనేతల రాకపోకలతో జిల్లాలో ప్రచారపర్వం తారాస్థాయికి చేరినా టీఆర్‌ఎస్ గెలుపును మాత్రం ఆపలేకపోయారు.
ఆరంభం నుంచే హడావుడి
ఈ ఏడాదంతా ఎన్నికల హడావుడే కొనసాగింది. తొలి త్రైమాసికంలోనే గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా ఏర్పాట్లను కూడా చేసింది. అయితే, బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆక్షింతలు వేయడంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో ఆగస్టు 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొలువుదీరింది. ఇక ఫిబ్రవరితో కాలపరిమితి ముగిసిన సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించని ప్రభుత్వం.. పాత కమిటీలను కొనసాగిస్తూ వస్తోంది. వివిధ కారణాలతో పంచాయతీ, సొసైటీ ఎన్నికలపై కేసీఆర్ సర్కారు వెనుకడుగు వేసింది.
Comments
Please login to add a commentAdd a comment