అందరివాడు | Seema Andhra People Voters Support to KCR in Telangana Elections | Sakshi
Sakshi News home page

అందరివాడు

Published Thu, Dec 13 2018 10:40 AM | Last Updated on Thu, Dec 13 2018 10:40 AM

Seema Andhra People Voters Support to KCR in Telangana Elections - Sakshi

సాక్షి, సిటీబ్యూరో:  సిటీలో కారు జోరుమీద పరుగులు పెట్టింది. ఇక్కడ నివసిస్తున్న విభిన్న వర్గాలు ప్రజలూ కేసీఆర్‌కే జైకొట్టారు. సీమాంధ్రుల నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన తమిళులు, మలయాళీలు, బెంగాలీలు, రాజస్థానీలు, మైనార్టీలు..ఇలా అన్ని ప్రాంతాలకు చెందిన ఓటర్లు టీఆర్‌ఎస్‌కు ఓట్లేసి తమ మద్దతు ప్రకటించారు. దీని ఫలితంగానే అభ్యర్థులు సైతం ఊహించని రీతిలో మెజార్టీలు దక్కించుకున్నారు. ప్రజా భద్రత, అభివృద్ధి, సంక్షేమం తదితర అంశాల్లో వీరిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మెప్పించగలిగింది. అందుకే వీరంతా ఈ ఎన్నికల్లో తమ అభిమానాన్ని చాటుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

2014 ఎన్నికల ఫలితాలు, సామాజిక కోణంలో విశ్లేషణలు చేసిన అనంతరం శివారు నియోజక వర్గాలన్నీ తమవైపు ఉంటాయని తెలుగుదేశం, కాంగ్రెస్‌పార్టీలు భావించాయి. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఓటర్లు తీర్పునిచ్చారు. వారు నమ్ముకు న్న ఒకటి రెండు సామాజిక వర్గాలు తప్పితే మిగతా వారంతా కేసీఆర్‌ వైపే మొగ్గుచూపినట్లు ఓటింగ్‌ సరళిని చూసిన పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీటీడీపీకి  పూర్తి ప్రాబల్యం ఉందని భావించి నందమూరి సుహాసినిని బరిలోకి దించితే...టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు ఏకంగా 41,049 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇందులో టీఆర్‌ఎస్‌ రెబల్‌గా బీఎస్పీ నుండి పోటీ చేసి హరీష్‌రెడ్డి సాధించిన 12,761 ఓట్లు కూడా కలిపితే మెజారిటీ భారీగా పెరిగిపోయింది. కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినికి సామాజిక వ ర్గం బలంగా ఉన్న ఒక్క డివిజన్‌లో తప్పితే..మిగిలిన ఏ డివిజన్‌లోనూ ఓట్లు రాకపోవటం విశేషం. కుత్బుల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూన వివేకానంద్‌కు సైతం 41,509 ఓట్ల మెజారిటీ వచ్చింది.

శేరిలింగంపల్లిలోనూ అదే తీరు...  
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనూ స్థానికులతో పాటు మెజారిటీ సీమాంధ్రులు, ఉత్తర, దక్షిణ భారతీయలు టీఆర్‌ఎస్‌కే జై కొట్టారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆరికెపూడి గాంధీకి 44,295 ఓట్ల మెజారిటీ సాధ్యమైంది. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన నియోకజవర్గాల్లో ఇది కూడా ఒకటి. టీడీపీ అభ్యర్థి ఆనంద్‌ ప్రసాద్‌కు చందానగర్‌ డివిజన్‌లోనే ఆధిక్యత రాగా, మియాపూర్‌ డివిజన్‌ ఓట్లకు సంబంధించిన ఒక్క రౌండ్‌లో స్వల్ప ఆధిక్యత వచ్చింది. మిగిలిన డివిజన్లలో మెజారిటీ ఓటర్లు టీఆర్‌ఎస్‌ వైపే నిలిచారు.

కారు వైపే ఇతర రాష్ట్రాల వాసులు
మల్కాజిగిరి నియోజకవర్గంలో స్థిరపడ్డ తమిళ, మలయాళీ ఓటర్లు సైతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మైనంపల్లి వెంట నడిచారు. ఈ నియోజకవర్గంలో మైనంపల్లి హన్మంతరావుకు 73,398 ఓట్ల మెజారిటీ వచ్చింది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీజేపీకి మద్దతిచ్చిన ఓటర్లు సైతం తాజాగా టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపారు. ఇక కోర్‌సిటీకి వస్తే అంబర్‌పేట నియోజకవర్గం అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడటం ద్వారా బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంక్‌కు గండిపడినట్లయింది. కాచిగూడ, గోల్నాక తదితర ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌కు భారీ ఓట్లు పోలయ్యాయి. ఇక ఉప్పల్‌ నియోజకవర్గంలోనూ కాప్రా సర్కిల్‌లో స్థిరపడ్డ సీమాంధ్రులు సైతం టీఆర్‌ఎస్‌కే మొగ్గుచూపినట్లు ఓటింగ్‌ సరళి తేల్చింది.

కుత్బుల్లాపూర్‌లో భిన్నమైన తీర్పు..
కుత్బుల్లాపూర్‌లో సీమాంధ్రులు అధికంగా ఉంటారని, మహాకూటమి తరపున టీడీపీ అధినేత చంద్రబాబు, సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేసినా భిన్నమైన రీతిలో ఇక్కడి ప్రజలు తీర్పునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బాచుపల్లి మండల పరిధిలోని నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లి గ్రామాల్లో 21,294 ఓట్లు కా>ంగ్రెస్‌కు పోల్‌ కాగా, టీఆర్‌ఎస్‌కు 20,223 ఓట్లు పడ్డాయి. దీంతో ఈ మండలంలో 1071 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్‌ సాధించినట్‌లైంది. అయితే ఇక్కడ అతిగా ఆశపెట్టుకున్న మహాకూటమి నేతలకు ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు. సరిసమానంగా నువ్వా.. నేనా..అన్నట్లుగా దూసుకు రావడంతో ఫలితంపై తీవ్ర ప్రభావం చూపింది. అలాగే కొంపల్లి గ్రామంలో మహాకూటమికి స్వల్ప మెజార్టీ వచ్చింది. ఈ నాలుగు ప్రాంతాల్లో సీమాంధ్రులు ఎక్కువగా ఉండడం 90 వేల పైచిలుకు ఓట్లల్లో అధికంగా కాంగ్రెస్‌ రాబట్టుకోవడంలో విఫలమైందనే చెప్పుకోవచ్చు. 8 డివిజన్లలో అన్ని వర్గాల వారు టీఆర్‌ఎస్‌ను ఆదరించడంతో ఏకంగా 1,13,238 ఓట్లు పోల్‌ కాగా, మహాకూటమికి 75,512 మాత్రమే ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వివేకానంద్‌ 41,500 ఓట్ల మెజార్టీతో విజయం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించారు.

బస్తీల్లో సత్తా చాటిన టీఆర్‌ఎస్‌
బంజారాహిల్స్‌: ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు 30 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ స్వల్పంగా పెరిగినా అది టీఆర్‌ఎస్‌కే లాభించింది. ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో గణనీయమైన ప్రభావాన్ని చూపా యని ఫలితాల సరళి స్పష్టం చేసింది. నియోజకవర్గంలోని బస్తీల్లో ప్రభుత్వం నుంచి లబ్ధి పొం దుతున్న లబ్ధిదారులు దాదాపు 50 నుంచి 60 వేలకుపైగా ఉండటంతో టీఆర్‌ఎస్‌కు లాభించింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల కు తోడుగా గతంలో మంత్రిగా పని చేసి, మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉండటంతో దానం నాగేందర్‌కు జనం పట్టంకట్టారు.   

పకడ్బందీ వ్యూహం..  
కాంగ్రెస్, టీడీపీ అగ్రనేతలు రాహుల్‌తో పాటు చంద్రబాబు, సీపీఐ నారాయణ, కోదండరాం, తదితరులు మహాకూటమి తరపున దాసోజు శ్రవణ్‌కు మద్దతుగా ప్రచారం చేసి టీఆర్‌ఎస్‌ను అడ్డుకోవాలని యత్నించారు. దీనికి ధీటుగా టీఆర్‌ఎస్‌ పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేసింది. నాగేందర్‌కు ప్రతి వీధిలోను పరిచయాలు ఉండటం, ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అడిగారు. సమయం చాలా తక్కువగా ఉన్నా అలుపు లేకుండా ప్రచారం నిర్వహించారు. పార్టీ తరపున కేటీఆర్‌ ఒక్కరే ప్రచారానికి రాగా ఆ ఒక్క ప్రచారమే నాగేందర్‌ను గట్టెక్కిందని చెప్పాలి.  

జరగని ఓట్ల బదిలీ..  
ఖైరతాబాద్‌లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలకు చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్, టీడీపీ కలిసి ఓట్లు ప్రభావితం చేస్తారని అంతా భయపడ్డారు. వీరికి తోడు సీపీఐ, టీజేఎస్‌ కూడా ఉండటం అవతల బీజేపీ మరింత బలంగా ఉండటంతో టీఆర్‌ఎస్‌కు గడ్డుకాలమేనని భావించారు. తీరా టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడంతో సహజంగానే టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ అవుతాయేమోనని ఆ పార్టీ వర్గాలు భావించాయి. ఎక్కడా ఈ ఓట్ల బదిలీ కాలేదని తాజాగా వెలువడిన ఫలితాలతో తేట తెల్లమైంది. బస్తీల్లో ప్రజాకూటమికి అనుకున్నన్ని ఓట్లు పడలేదని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement