సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఆర్‌అండ్‌బీ రోడ్ల విస్తరణ, రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ)ల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. ఇందులోభాగంగా మొత్తం రూ.722 కోట్లను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఇటీవల పరిపాలనా పరమైన అనుమతులు జారీ చేసింది. ఈ అనుమతుల మేరకు రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లో జిల్లాలో 48 బ్రిడ్జిలు, 24 డబుల్ లేన్ రోడ్లు (అంతర్‌మండల), మరో 14 డబుల్ లే న్ రోడ్ల (మండలకేంద్రాలను కలపడంతో పాటు కొన్ని మండల కేంద్రాలను జిల్లా కేంద్రానికి అనుసంధానం చేసేందుకు గాను) నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.
వంతెనల నిర్మాణంపై దృష్టి
రోడ్డు సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోనికి తెచ్చేందుకు గాను అవసరమైన చోట్ల వంతెనలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా కృష్ణా, గోదావరి నదులపై 389 బ్రిడ్జిలను నిర్మించాలని నిర్ణయించగా, అందులో జిల్లాకు చెందినవి 48 ఉన్నాయి. వీటి నిర్మాణానికి గాను మొత్తం 167.4 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. కృష్ణా, మూసీ నదులపై ఈ బ్రిడ్జిలు ఏర్పాటు చేయనున్నారు. మూసీనదిపై రూ. 26.5 కోట్ల వ్యయంతో రెండు బ్రిడ్జిలు నిర్మించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీబీనగర్ - పోచంపల్లి వద్ద, మనాయికుంట - గురజాల మధ్య ఈ వంతెనలు ఏర్పాటు కానున్నాయి. డిండిపై కూడా రెండు బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 1.5 కోట్లు కేటాయించారు. దేవరకొండ - కంబాలపల్లి, దేవరకొండ - బాపనకుంటల మధ్య వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వీటితో పాటు మరికొన్ని చిన్న చిన్న వంతెనలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
సింగిల్ టు డబుల్
అదే విధంగా జిల్లాలోని 24 సింగిల్ లేన్ రోడ్లను డబుల్‌లేన్లుగా మార్చనున్నారు. ఇందుకోసం 300.5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సూర్యాపేట - బీమారం - శెట్టిపాలెంల మధ్య 29 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.35 కోట్లు
తొర్రూరు - వలిగొండకు 20 కోట్లు (23 కిలోమీటర్లు)
బీబీనగర్ - పోచంపల్లికి రూ. 21 కోట్లు
చివ్వెంల - ముకుందాపురానికి రూ. 25 కోట్లు
కనగల్ - మాల్, నార్కట్‌పల్లి - మునుగోడులకు ఒక్కో దానికి రూ.15 కోట్ల చొప్పున కేటాయించారు. వీటితో పాటు మరికొన్ని రోడ్లు నిర్మాణం చేసేందుకు కూడా నిధులు మంజూరయ్యాయి.
17 మండలాలు..
14 పనులు.. రూ. 255 కోట్లు
ఇప్పటివరకు సింగిల్ లేన్‌గా ఉన్న రోడ్లను డబుల్ లేన్లుగా మారుస్తూనే వాటిని మండల కేంద్రాలకు, కొన్ని మండల కేంద్రాల రోడ్లను జిల్లా కేంద్రాలకు కలపనున్నారు.
మునుగోడు, సంస్థాన్‌నారాయణపూర్ మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి కలిపేందుకు గాను డబుల్ లేన్ రోడ్డు నిర్మాణం కోసం రూ. 42 కోట్లు కేటాయించారు.
కొండమడుగు మెట్టు నుంచి బొమ్మల రామారం వరకు రూ. 18 కోట్లు
శాలిగౌరారం మండల కేంద్రాన్ని కలుపుతూ నకిరేకల్ నుంచి గురజాల వరకు డబుల్ రోడ్డు కోసం రూ. 16.5 కోట్లుమర్రిగూడ నుంచి గుర్రంపోడు వరకు నాంపల్లి మండల కేంద్రాన్ని కలిపేందుకు రూ. 23.5 కోట్లు
కనగల్ నుంచి వ ూల్ (మర్రిగూడ, చండూరు మండల కేంద్రాలను కలిపేందుకు ) రూ. 29 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అయితే, ఆర్‌అండ్‌బీ రోడ్ల మంజూరులో ప్రభుత్వం కొంత పక్షపాత ధోరణితో వ్యవహరించిందనేది ఉత్తర్వులను పరిశీలిస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలున్న చోట ఆర్‌అండ్‌బీ బ్రిడ్జిలు, రోడ్ల విస్తరణకు పెద్ద పీట వేశారు. సూర్యాపేట, నకిరేకల్, ఆలేరు, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాలకు ఇందులో ఎక్కువ రోడ్లు మంజూరు చేయగా, మిగిలిన నియోజకవర్గాలకు అరకొర మంజూరయ్యాయి. దేవరకొండ నియోజకవర్గానికి కూడా రోడ్లు బాగానే మంజూరయ్యాయి.
ఆర్‌అండ్‌బీ రోడ్లకు మహర్దశ
Published Tue, Dec 2 2014 1:35 AM | Last Updated on Thu, Aug 30 2018 3:51 PM
Advertisement
Advertisement