సాక్షి, సిద్ధిపేట/దుబ్బాక: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అస్త్రం దుబ్బాక రెవెన్యూ డివిజనే. 2020 ఉపఎన్నికల సమయంలోనే డివిజన్‌గా ఏర్పాటవుతుందని ఆశించినా ప్రజలకు నిరాశే ఎదురైంది. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ అన్నివర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జిల్లాల పునర్విభజన సమయంలో సిద్దిపేట జిల్లాగా, దుబ్బాకను రెవెన్యూ డివిజన్‌గా చేస్తారని ఈ ప్రాంతం వారు ఎదురుచూశారు.
కానీ అలా జరగలేదు. పాత సమితి కేంద్రంగా, తాలుకాగా, నియోజకవర్గ కేంద్రంగా మున్సిపాలిటీగా ఉన్న దుబ్బాకకు రెవెన్యూ డివిజన్‌కు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. 2016లో రెవెన్యూ డివిజన్ చేయాలంటూ దుబ్బాక పట్టణంలో 45 రోజుల పాటు ఉద్యమం జరిగింది. అప్పటి నుంచి నిరంతరం ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రజల ఆకాంక్ష దుబ్బాక రెవెన్యూ డివిజన్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లా కేంద్రంగా ఉండడంతో పాటు నియోజకవర్గ కేంద్రాలైన గజ్వేల్, హుస్నాబాద్‌లను రెవెన్యూ డివిజన్లుగా చేసి నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకను డివిజన్ చేయకపోవడం శోచనీయం.
ఆరు మండలాలతో దుబ్బాక డివిజన్!
దుబ్బాక నియోజక వర్గంలో ప్రస్తుతం 8 మండలాలు ఉండగా చేగుంట, నార్సింగ్ మండలాలు తూప్రాన్ డివిజన్‌లో ఉన్నాయి. దుబ్బాక, మిరుదొడ్డి, తోగుట, దౌల్తాబాద్, రాయపోల్, భూంపల్లి–అక్భర్‌పేట మండలాలతో డివిజన్ చేస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది.
26న ప్రకటిస్తారని ప్రచారం..
దుబ్బాక రెవెన్యూ డివిజన్ డిమాండ్‌ను సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు దృష్టికి ఇప్పటికే ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తీసుకెళ్లాడని, ఈ నెల 26 న దుబ్బాకలో జరిగే బహిరంగ సభలో డివిజన్‌గా చేస్తున్నట్లు ప్రకటిస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. హరీశ్ సైతం కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపించండి దుబ్బాక డివిజన్ చేస్తామని రోడ్ షోల్లో హామీలు ఇస్తున్నారు.
రేవంత్ నోటా దుబ్బాక డివిజన్..
దుబ్బాకలో గురువారం జరిగిన బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించండి దుబ్బాక రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది దుబ్బాక డివిజన్‌ను చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
బీజేపీ సైతం దీనిపైనే ఫోకస్!
దుబ్బాకలో మళ్లీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును గెలిపిస్తే తప్పకుండా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతుందని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రఘునందన్‌రావు సైతం భూంపల్లి–అక్భర్‌పేట కొత్త మండలం ఏర్పాటు చేశానని, దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేస్తానంటూ ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: బడా నేతల ఆగమనం!
Comments
Please login to add a commentAdd a comment