- ఏటా పంట చేతికందే సమయంలో విపత్తులు
- తాజా పరిస్థితిపై తల్లడిల్లిపోతున్న అన్నదాతలు
- పంట బీమా కూడా లేదంటూ ఆవేదన
విపత్తుల పేరు వింటేనే రైతులు వణికిపోతున్నారు. అవి ఎక్కడ తమను నట్టేట ముంచుతాయోనని హడలిపోతున్నారు. ఏటా పంట చేతికందే సమయంలో ఈ ఖర్మ ఏంట్రా బాబు అని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆరుగాలం కష్టాన్ని అల్పపీడనాలు, తుపాన్లు తుడిచిపెడుతున్నాయి. ఈ ఏడాది సరాసరి వర్షం తక్కువైనప్పటికీ మధ్యలో రెండుమూడు సార్లు కుండపోత వర్షంతో పంటలను దెబ్బతీసింది. వాటిన్నింటినీ ఎదురొడ్డి సాగు చేసి పంట చేతికందే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందన్న వార్తతో రైతులు బెంబేలెత్తుతున్నారు.
గుడ్లవల్లేరు : ఈ ఏడాది ప్రకృతి విపత్తులను అధిగమించి రైతులు సాగు చేశారు. వర్షాభావం వెంటాడినప్పటికీ అడపాదడపా కురిసిన వర్షాలతోపాటు అందుబాటులో ఉన్న నీటి వనరులతో విత్తారు. పైర్లు ఏపుగా పెరిగాయి. మొక్కజొన్న కండెలు, వరి కేళిలతో పంటలు కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందన్న వార్తతో రైతులు గుండెలు చేత్తో పట్టుకుంటున్నారు.
నేటికీ అందని పంట నష్టపరిహారం
గతేడాది ఇదే సమయంలో వరుస తుపాన్లు చెలరేగి రైతులను బికారులను చేశాయి. పంటల్ని నామరూపాలు లేకుండా నాశనం చేశాయి. ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు. వాటి తాలూకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఈ ఏడాది వాటిని అధిగమిస్తామనుకుంటున్న తరుణంలో అల్పపీడనం భయపడుతోంది. దానికితోడు ఈసారి పంటల బీమా కూడా లేకపోవడంతో రైతుల పంటల పరిస్థితి గాలిలో పెట్టిన దీపంలా మారింది. ఇటీవల వచ్చిన హుదూద్ తుపాను బీభత్సాన్ని చూస్తుంటే కంటిపై కునుకు పట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో గురువారం కురిసిన చిరుజల్లులతో రైతన్న గుండెల్లో మళ్లీ గుబులు బయలుదేరింది.
జిల్లాలో సాగు ఇలా...
మిర్చి 19,612 ఎకరాలు
వరి 5,77,630 ఎకరాలు
పత్తి 1,37,575 ఎకరాలు
మొక్కజొన్న 12,777 ఎకరాలు