తప్పు రైతులదా..చంద్రబాబుదా..?
- బ్యాంకు అధికారులను నిలదీసిన అన్నదాతలు
- రుణాలు చెల్లించి అధిక వడ్డీల నుంచి బయట పడాలన్న బ్యాంకు అధికారులు
- ససేమిరా అంటూ తెగేసి చెప్పిన రైతులు
చీడికాడ: ‘సక్రమంగా రుణాలు చెల్లించుకుంటున్న మమ్మల్ని కట్టొద్దని, అధికారంలోకి వస్తే మాఫీ చెస్తామన్న చంద్రబాబుది తప్పా.. ఆ మాటలు నమ్మి మోసపోయిన మాది తప్పా... ’అంటూ ఆంధ్రా బ్యాంకు అధికారులును రైతులు నిలదీసిన సంఘటన మండలంలోని అర్జునగిరిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. బకాయిలు వసూళ్లకు ఉదయాన్నే చోడవరం ఆంధ్రా బ్యాంకు అధికారులు పంచాయతీ కార్యాలయం వద్ద రైతులతో సమావేశమయ్యారు.
మేనేజర్ శంకరరావు మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీలోగా రుణాలు చెల్లించి చక్రవడ్డీల భారం నుంచి బయట పడాలన్నారు. అప్పుడే పంటల బీమా వర్తిస్తుందని, లేకుంటే డిఫాల్టర్‌గా ప్రకటిస్తామని పేర్కొన్నారు. రుణాల చెల్లింపులో ఉత్తమ గ్రామంగా గుర్తింపు పొందిన ఇక్కడి రైతులు మొండి బకాయిదారులుగా ఎందుకు మారారని మేనేజర్ ప్రశ్నించారు.
దీనికి స్పందించిన రైతులు పరువాడ నాయుడు,చొక్కాకుల సూరిబాబు, నర్సింహామూర్తిలు మాట్లాడుతూ పంటలు పండక పోయినా అప్పులు చేసైనా ఏటా రుణాలు చెల్లించి, మళ్లీ తీసుకునేవారమన్నారు. మూడేళ్లుగా చంద్రబాబు నాయుడు,ఆ పార్టీ నాయకులు గ్రామాల్లో తిరిగి రుణాలు కట్టొద్దని, తాము అధికారంలోకి వస్తే రుణాలు మొత్తం మాఫీ చెస్తామనిచెప్పి నేడు మాటతప్పింది ఎవరంటూ రైతులు ఎదురు తిరిగారు.
దీనికి మేనేజర్ మాట్లాడుతూ తాము రాజకీయనాయకులం కాదని.. ముందు మీరు రుణాలు చెల్లించండి తరువాత రుణమాఫీ సొమ్మును మీకిచ్చేస్తామన్నారు. అయితే ఆ సొమ్మునే మీరు జమచేసుకొండంటూ రైతులు బదులిచ్చారు. ప్రస్తుతం రైతులు రుణాలు చెల్లించే స్థితిలేదన్నారు. మీకు నచ్చిన పని చేసుకోండంటూ రైతులు తెగేసి చెప్పడంతో అధికారులు చెసేదేమి లేక అక్కడ నుంచి నిష్ర్కమించారు.