అనంతపురం అగ్రికల్చర్ : ప్రతి ఏటా పంట నష్టంతో ఆర్థికంగా చితికిపోయిన ‘అనంత’ రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ మాయాజాలం వల్ల దిక్కుతోచక విలవిల్లాడుతున్నారు. రుణమాఫీ అమలు చేయడంలో జాప్యం చేయడం వల్ల బ్యాంకుల నుంచి కొత్తగా పంట రుణాలు, రెన్యువల్, రీషెడ్యూల్ ఏదీ జరగలేదు. దీంతో వాతావరణ బీమాకు ప్రీమియం కట్టలేక చేజేతులా నష్టం కొని తెచ్చుకునే దుస్థితి దాపురించింది.
రుణమాఫీ అదిగో ఇదిగో అంటూ జూన్ నుంచి ఊరించిన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌లో అరకొరగా అమలు చేయడంతో అప్పటికే పుణ్యకాలం ముగిసిపోవడంతో వాతావరణ బీమా పథకంలో చేరలేని పరిస్థితి నెలకొంది. రుణమాఫీ ఆలస్యమయ్యే పరిస్థితి ఉందని తెలిసిన ప్రభుత్వం కనీసం వాతావరణ బీమా ప్రీమియం చెల్లించడానికైనా రైతులకు వెసులుబాటు కల్పించివుంటే ఇవాళ కొంతలో కొంతైనా ఉపశమనం కలిగి ఉండేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్, రబీ పంటలన్నీ దాదాపు దెబ్బతిన్నాయి. అందులో ప్రధానంగా 5.06 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేసిన వేరుశనగ నుంచి కనీసం 20 శాతం కూడా పంట కూడా చేతికిదక్కలేదని అధికారిక నివేదికలే చెబుతున్నాయి.
రూ.2,200 కోట్లకు పైగా వేరుశనగ దిగుబడులు నష్టపోయినట్లు అంచనా. వర్షపాతం 50 శాతం తక్కువగా నమోదు కావడంతో పంటలన్నీ ఎండిపోయాయి. పంటలకు పురుగులు, తెగుళ్ల వ్యాప్తికి అనువైన అంతుచిక్కని వాతావరణం నెలకొనడం వల్ల కూడా అంతో ఇండో రావాల్సిన దిగుబడికి గండి పడింది. పంట నష్టం, వర్షాభావం, వాతావరణ పరిస్థితులు అంచనాలోకి తీసుకుంటే ఈ ఏడాది ఎంతలేదన్నా వాతావరణ బీమా కింద జిల్లాకు కాస్త అటుఇటుగా రూ.400 కోట్ల వరకు విడుదలయ్యే అవకాశం ఉండేది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా కేవలం 52 వేల మంది రైతులు మాత్రమే గడువులోగా ప్రీమియం చెల్లించి బీమా పథకంలోకి చేరారు.
ఏటా 5 నుంచి 5.50 లక్షల మంది రైతులు బీమా పరిధిలోకి వస్తుండగా ఈ ఏడాది రుణ మాఫీ తతంగం వల్ల బ్యాంకుల మెట్లు ఎక్కలేకపోయారు. ఫలితంగా వాతావరణ బీమా పరిహారం కోల్పోవాల్సివస్తోంది. మరోపక్క 2013కు సంబంధించి విడుదలైన రూ.227 కోట్ల పరిహారం ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. రుణమాఫీకి లింక్ పెట్టడంతో చాలా బ్యాంకుల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ కావడంలేదు. దీంతో ‘అనంత’ రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. గతంలో గ్రామం యూనిట్‌గా అమలవుతున్న పంటల బీమా పథకం ద్వారానే జిల్లా రైతులకు న్యాయం జరుగుతుందనే వాదన ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. వాతావరణ బీమా వల్ల రైతులకు ఒనగూరే ప్రయోజనం చాలా తక్కువ అని, మూడేళ్లలో జరిగిన పంట నష్టం, కట్టిన ప్రీమియం, విడుదలైన పరిహారం చూస్తే అర్థమవుతోంది.
ఎంత పనైంది..!
Published Fri, Feb 13 2015 2:22 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM
Advertisement
Advertisement