రైతున్నపై ప్రకృతి పగబట్టింది. వరుణుడు కరుణించలేదు. పంటలు భూముల్లోనే ఎండిపోయాయి. సాగుకోసం చేసిన అప్పులు మిగిలాయి. బ్యాంకులో నగలు కుదవ పెట్టిన బంగారు నగలు విడిపించుకోలేకపోయాడు. బ్యాంకుల్లో రుణానికి వడ్డీ తోడు కావడంతో అప్పుల కుప్పలు మిగిలాయి. ఆడబిడ్డకు పెళ్లి చేయాలని, కొడుకును పెద్ద చదువులు చదివించాలనేఆశలు తీరలేదు. పదుగురికి పట్టెడన్నం పెట్టే రైతన్న పరువు కాపాడుకునేందుకు పరితపించాడు. ఇదే సమయంలో ఎన్నికలొచ్చాయి. అధికారం కోసం చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చారు. పదవి చేపట్టగానే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్నారు. బ్యాంకులకు అప్పులు కట్టవద్దన్నాడు. గుడ్డిగా నమ్మిన జనం రుణాల చెల్లింపులో జాప్యం చేశారు. మాఫీ ప్రకటనకు రకరకాల నిబంధనలు పెట్టారు. మొదటి రెండు విడతల్లో ప్రభుత్వం జమ చేసిన మొత్తం వడ్డీకి కూడా చాలలేదు. ఈ క్రమంలో రెండేళ్లు గడిచాయి.
ఇక ఆగడం తమ వల్ల కాదని బ్యాంకులు కొరడా ఝుళిపించాయి. అప్పు చెల్లించకుంటే నగలు వేలం వేస్తామని నోటీసులు జారీ చేశాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు రైతుల బంగారాన్ని వేలం వేసేశాయి. కాగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు బుధవారం శాసనసభలో చేసిన ప్రకటనతో రైతులు ఆగ్రహోదగ్రులయ్యారు.
‘బ్యాంకుల్లో రైతులు బంగారం తాకట్టు రుణాలకు సంబంధించిన బంగారు నగలు వేలం వేస్తున్నట్లు మాకు సమాచారంలేదు.’ ఇదీ అసెంబ్లీలో వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రకటన.
‘రుణమాఫీలో పేరుందో? లేదో? మాకు సంబంధం లేదు. ముందు అసలు, వడ్డీతో అప్పు తీర్చాల్సిందే.’ ఇదీ బ్యాంకర్ల నైజం. రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలతో రైతులు రుణాల చెల్లింపులో కాస్త ఉదాసీనంగా వ్యవహరించారు. దీంతో వడ్డీలకు వడ్డీలు పడి, రుణ భారం పెరిగింది. ప్రస్తుతం ఆ రుణాలు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. అయితే బ్యాంకర్లు బంగారు రుణాలకు సంబంధించి వేలం నోటీసులు జారీ చేస్తుండడంతో రుణమాయలో పడి దారుణంగా మోసపోయామని బాధపడుతున్నారు
తిరుపతి: బాబు మాటలు నమ్మి అన్నదాతలు నట్టేట మునిగారు.. ఎవరూ రుణాలు చెల్లించవద్దు.. బంగారు రుణాలు విడిపించే పూచి నాది చెల్లెమ్మలు అంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అందరూ నమ్మారు. రుణాలపై వడ్డీ చెల్లించలేదు. అసలుతో కలిసి అప్పు మొత్తం కొండలా పెరిగిపోయింది. ఇప్పుడు ఏకంగా అప్పుతీర్చమని నోటీసులు, వేలం వేస్తామంటూ పత్రికల్లో ప్రకటనలు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కళ్ల ముందే బంగారం వేలం వేయడాన్ని అన్నదాతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అన్నదాత గుండెకు గాయాన్ని చేశాయి. పంట రుణాలు తీసుకున్న రైతుల బంగారు నగలను బ్యాంకులు వేలం వేస్తున్న సమాచారం లేదని చెప్పడం చూసి రైతన్నలు నివ్వెర పోతున్నారు. తమకు వచ్చిన నోటీసులు చేత బట్టుకుని ఇవేంటని ప్రశ్నిస్తున్నారు.
బంగారు రుణాలు ఇలా...
2013-14వరకు బంగారు రుణాలు తీసుకున్న రైతులు: 2,01,751 రుణం మొత్తం: రూ.1682 కోట్లు
అన్నదాతకు కష్టాలు
జిల్లాలో 2013 డిసెంబరు వరకు 8,70,321 మంది రైతులు రూ.11,180 కోట్ల రుణం తీసుకున్నారు. ఇందులో 5.63 లక్షల మంది రైతుల రుణాలను బ్యాంకర్లు అనుసంధానం చేశారు. తొలి విడతలో 3,06,544 మంది, రెండో విడతలో 1,42,229 మొత్తం 4,53,773 మంది రైతులు రుణమాఫీ పొందారు. వీరంతా కేవలం రూ.600 కోట్ల మాత్రమే రుణమాఫీ పొందడం గమనార్హం.
పెరిగిన బంగారు రుణాలు
వ్యవసాయ రుణాలకు సంబంధించి రెన్యూవల్స్ చేయకపోవడంతో అమాంతం వడ్డీ భారం పెరిగింది. దీంతో చేసేదీమి లేక పంటల సాగు కోసం ఉన్న అరకొర బంగారు నగలను సైతం అన్నదాతలు బ్యాంకులో కుదవ పెట్టారు. 2014-15లో 2.05,012 మంది రైతులు రూ.1553.15 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఈ ఏడాది ఏకంగా బంగారు రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య మరింత పెరిగింది. 2015-16లో 3,41,283 మంది రైతులు రూ 2504.32 కోట్ల రుణాన్ని తీసుకోవడం గమనార్హం.
నోటీసు ఇవ్వకుండా వేలం వేశారు
వాల్మీకిపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 47 గ్రాముల బంగారం తాకట్టు పెట్టి రూ.70 వేలు అగ్రికల్చరల్ గోల్డ్‌లోన్ తీసుకున్నాను. రూ.19,202.94 మాఫీ అయినట్లు రుణ విముక్తి పత్రం కూడా అందింది. బ్యాంక్‌కు వెళ్లి మిగతా సొమ్ము చెల్లించి బంగారాన్ని తీసుకుందామంటే వేలం వేసేశామని చెబుతున్నారు. నోటీసులు కూడా పంపకుండా వేలం ఎలా వేస్తారని అడిగితే పేపర్ ద్వార సమాచారం ఇచ్చామని బుకాయిస్తున్నారు. -సి.రమణ, సరిమడుగు, గుర్రంకొండ (మం)
చెప్పకుండానే వేలం వేసేశారు
రెండేళ్ల క్రితం అంగళ్లు ఎస్‌బీఐలో 125 గ్రాముల బంగారం తాకట్టుపెట్టి రూ.1.25 లక్షలు పంట రుణం తీసుకున్నా. అసలు వడ్డీ కలిపి రూ.1.85 లక్షలు అయ్యింది. రుణమాఫీ అవుతుందని ఆశపడ్డాను. కానీ మాఫీ కాలేదు. పెరిగిన వడ్డీతో కట్టలేకపోయా. రూ.3 లక్షలకు పైగా విలువచేసే నగలను నాకు తెలియకుండానే వేలం వేసేశారు. -ఎం.నాగిరెడ్డి, అంగళ్లు, కురబలకోట (మం)
దారుణ మాయ
Published Thu, Mar 10 2016 2:10 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement