డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేస్తారా...
వడ్డీల భారం మాపై మోపి మూలధనంతో సరిపెడతారా...
బకాయిలు పేరుకుపోయి డిఫాల్టర్లుగా మారిన డ్వాక్రాసభ్యులు
ప్రశాంతంగా సాగుతున్న సంఘ కార్యకలాపాల్లో దేశం చిచ్చు
రుణభారంతో నిర్వీర్యమవుతున్న సంఘాలు
వారంతా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు... గుట్టుగా కాపురం చేసుకుంటూ పైసాపైసా పొదుపు చేసి అందులోనే కొంత మొత్తాన్ని కుటుంబ అవసరాలకు రుణం తీసుకుంటున్నారు... బ్యాంకర్లు వారి నిజాయితీకి ముచ్చటపడి రుణాలివ్వడం మొదలుపెట్టారు... సంఘటితంగా ఉంటూ రుణాలు పొందడం, నిర్ణీత వ్యవధిలో వాటిని చెల్లించడం... ఇలా సాఫీగా సాగిపోతున్న తమ పొదుపు వ్యవహారానికి చంద్రబాబు రాక అపశ్రుతిగా మారింది. ఆయన ఎన్నికల ముందు చేసిన మోసపూరిత హామీ నమ్మిన వారంతా బ్యాంకులకు బకాయిలు చెల్లించడం మానేశారు. వడ్డీలు పెరిగాయి... కొత్త రుణాలు రాలేదు... పైగా బ్యాంకుల్లో వారు డిఫాల్టర్లుగా ముద్రపడ్డారు. వారి గౌరవం కాస్తా మంటగలిసింది. ఇదీ డ్వాక్రా రుణమాఫీ హామీ విని
మోసపోయిన మహిళల కథ.
శ్రీకాకుళం పాతబస్టాండ్ :ఎన్నికలపుడు అక్కచెల్లెళ్ల అప్పులు తీర్చేసి వారి వారిని రుణవిముక్తులను చేస్తామంటూ విపరీతమైన హామీలు గుప్పించిన తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలయ్యాక ఏరుదాటిన చందాన వ్యవహరిస్తోంది. ఎన్నికల ప్రచార సభల్లో డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని హమీలు గుప్పించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆధికారంలోకి వచ్చాక మాట మార్చారు. నాడు కొండంత ఆశతో అందలం ఎక్కిస్తే... ఇప్పుడు తమకు తగిన శాస్తి జరిగిందంటూ మహిళలంతా పశ్చాత్తాప పడుతున్నారు. ఏ మహిళను కదిపినా బాబు మోసాలపై దుమ్మెత్తిపోస్తోంది. మళ్లీ ఎన్నికలంటూ వస్తే కక్షతీర్చుకుంటామని శపథం చేస్తోంది.
జిల్లాలో 44,255 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి జిల్లాలో 33,900 గ్రూపులకు సంబంధించి రూ. 629 కోట్లు రుణాలు ఉన్నాయి. ఎన్నికల్లో చంద్రబాబు చేసిన హామీలు నమ్మిన మహిళాసంఘాలు సుమారు ఆరునెలల పాటు నెలవారీ రుణ బకాయిలు చెల్లించలేదు. ఫలితంగా వాటిపై వడ్డీ కాస్తా రూ. 69కోట్లు పెరిగింది. ఇప్పుడు వారికి పేరుకుపోయిన అప్పులతోపాటు...
వడ్డీలు గుదిబండలా మారాయి.
తెలుగుదేశం ఆదికారంలోకి వచ్చాక షరామామూలుగా సీఎం మాట మార్చారు. వడ్డీ మాపీ ఉండదని, సంఘంలో సభ్యులకు పదివేలు ప్రోత్సాహకంగా అందజేస్తామని చెప్పారు. కానీ దానినీ చెల్లించకపోగా ఆ మొత్తాన్ని మూడు వాయిదాల్లో చెల్లించాలంటూ నిర్ణయించింది. తొలి విడదతో సంఘంలో ఒక్కో సభ్యురాలికి రూ. మూడు వేలు వంతున వారి సంఘం బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటూ ప్రకటించారు. దీనికీ వడబోత లెక్కలేనన్ని నిబంధనలు పెట్టి వడపోత చేపట్టారు. దీనివల్ల జిల్లాలో 4.99.724 మంది సభ్యులకు 20,004 మందిని అనర్హులుగా ప్రకటించారు. వీరికి ఆధార్, రేషన్‌కార్డు, మైగ్రేషన్ ఇతర కారణాలతో కుదించారు. కేవలం 4.79.715 మందికి మాత్రమే ఈ మూడు వేలు ప్రోత్సాహం ఆందజేసేందుకు చర్యలు తీసుకుంటుంన్నారు.
ఏ ‘మూల’కు...?
సర్కారు అట్టహాసంగా హామీలు అమలు చేసేశామంటూ చెబుతూ మూలధన పేరిట ఇస్తున్న రూ. మూడువేలు కనీసం వడ్డీకి కూడా రావడంలేదని సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. బాబును నమ్మి నిండా మునిగామనీ, ఇప్పుడు సభ్యులుగా ఉండి డిఫాల్టర్లమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద సర్కారు పుణ్యమాని డ్వాక్రా సంఘాలు నిర్వీర్యమవుతున్నాయి. అంతేనా... హామీ మూడువేలకే పరిమితమవుతుందా.. మిగిలిన మొత్తాన్ని వాయిదాల రూపంలోనైనా చెల్లిస్తారా.. అన్నది సందేహంగా మారుతోంది.
వడ్డీలేని రుణాలన్నారు.. మోసం చేశారు
వడ్డీ లేని రుణాలని చెప్పి మమ్మల్ని మోసగించారు. సక్రమంగా ప్రతి నెలా వాయిదాలు చెల్లించినప్పటికీ నా దగ్గర నుంచి రూ.1650 వడ్డీ వసూలు చేశారు. ఇప్పుడేమో పెట్టుబడి నిధి కింద రూ.10 వేలు ఇస్తామని చెప్పి కేవలం రూ.3 వేలు మాత్రం ఇస్తామంటున్నారు. ఆ డబ్బులూ ఇంకా జమ కాలేదు.
- రౌతు తవిటమ్మ, జోజప్ప గ్రూప్, వీరఘట్టం
కొత్తగా ఖాతాలు తెరవడం కష్టంగా ఉంది
మా ఊళ్లో రాజరాజేశ్వరి స్వయం శక్తి సంఘంలో సభ్యురాలిగా ఉంటూ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఏడాది క్రితం 40 వేల రూపాయల రుణం తీసుకున్నాను. టీడీపీ అధికారంలోకి వస్తే రుణమాఫీ జరుగుతుందని ఆశించాను. మాఫీ పేరుతో ఇప్పుడు 3 వేల రూపాయలు అందజేస్తామని చెప్తున్నారు. దానికోసం కొత్త ఖాతాలు తెరవాలంటున్నారు. అది తెరవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నాం.
- డి.శ్రీనమ్మ, విక్రంపురం, టెక్కలి మండలం.
రుణ మాఫీకై ఇచ్చింది వడ్డీకే సరిపోదు
సంఘంలో 10 నుంచి 20 మంది సభ్యులం ఉన్నాం. సుమారు రెండు లక్షల వరకూ డబ్బులు అప్పు చేశాం. రుణ మాఫీ మొత్తం అంటే వాడినది వడ్డీ అంతా కలిపి 2.30 లక్షలు మాఫీ అవుతుందనుకున్నాం. ఇప్పుడు ఇచ్చిన మూడు వేలు భవ్యిష్యనిదికి జమ అంటే వడ్డీకే సరిపోదు.
- అల్లు అప్పమ్మ, బలగ అప్పమ్మ, తర్రచిన్నమ్మడు,
మాకియవలస, నరసన్నపేట మండలం
మోసపోయాం.. వడ్డీలు కడుతున్నాం
హరిపురం గ్రామీణ వికాస బ్యాంకులో అప్పు తీసుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ అని హామీ ఇవ్వడంతో తీసుకున్న అప్పు కట్టలేదు. ముఖ్యమంత్రి అయి ఏడాది గడుస్తున్నా.. ఇంత వరకు రుణమాఫీ చేయలేదు. తీసుకున్న బకాయి తీర్చేద్దామంటే వడ్డీ మీద వడ్డీలు వేస్తున్నారు. రుణమాఫీ కాలేదు కాని వడ్డీలు భారం పడింది.
- బల్ల లీలాకుమారి, డ్వాక్రా సంఘం సభ్యురాలు, హరిపురం. మందస మండలం
ఆడవారంటే అలుసా..?
Published Sun, May 31 2015 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM
Advertisement
Advertisement