బాబు ఎన్నికల హామీలన్నీ నెరవేర్చాలి
సంగం: అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబునాయుడు ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా నెరవేర్చాలని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని వెంగారెడ్డిపాళెం,అనసూయనగర్, సిద్దీపురం, తరుణవాయి గ్రామాల్లో వారు శుక్రవారం పర్యటించారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని అక్కడికక్కడే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభల్లో వారు మాట్లాడుతూ రూ.87 కోట్ల మేర రైతు రుణాలను, రూ.14 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని అప్పట్లో బాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ రుణాలన్నింటినీ మాఫీ చేసి అందరినీ ఆదుకోవాలన్నారు. రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇస్తే అధికారంలోకి వస్తావని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి ఎందరో సూచించారని, అయినప్పటికీ అది సాధ్యకాని ప్రక్రియ అనే ఉద్దేశంతో ఆయన నిరాకరించారన్నారు. అయితే చంద్రబాబు ఆపద మొక్కులు మొక్కినట్లు కుప్పలుతెప్పలుగా వాగ్దానాలు కురిపించారన్నారు.
వితంతువులకు, వృద్ధులకు రూ.200 నుంచి రూ.1,000 పింఛన్ పెంచారని, వికలాంగులకు రూ.1,500 పెంచారని, ఈ పరిణామంతో పేదలకు మేలు జరుగుతుంది కాబట్టి తాము అభినందిస్తున్నామన్నారు. అదే సందర్భంలో 10.12 లక్షల మంది పింఛన్లు రద్దయ్యాయని వాటిని కూడా పునఃపరిశీలించి అర్హులైన వారందరికీ అందజేయాలన్నారు. అధికారాన్ని చేపట్టి ఐదు నెలలు గడిచినా ఇంతవరకు గృహాలు మంజూరు చేయకపోవడంతో పేదలు ఎందరో గూడు కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఇదే తరహాలో అర్హులైన వారందరికి రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, భూములు పంపిణీ చేసేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ప్రధానమంత్రి మోదీ గ్రామాలను దత్తత తీసుకొనే విధానాన్ని ప్రారంభించారని, దీని మూలంగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు ఇప్పటివరకు కొన్ని పూర్తయ్యాయని రాబోయే రోజుల్లో పలు గ్రామాల్లో ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు.
కమిటీలపై త్వరలోనే న్యాయం
కేవలం పింఛన్ల కోసమేనంటూ ఏర్పాటైన కమిటీలు, ప్రస్తుతం రుణమాఫీలో సైతం కీలక భూమిక పోషిస్తున్నాయని, ఆ కమిటీలు నియామకం అప్రజాస్వామికమని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. గ్రామసభల్లో ఆయన మాట్లాడుతూ ఈ కమిటీలు నియమించిన విధానంపై హైకోర్టులో వాజ్యం వేసి ఉన్నారని, దీని ద్వారా త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులకు లేని ప్రాధాన్యం కమిటీలకు ఇచ్చారని ఇది సమంజసం కాదన్నారు. సమస్యలు తెలుసుకునేందుకే గ్రామాల్లో పర్యటిస్తున్నామని, అర్హులైన వారికి పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు అధికారులతో మాట్లాడతామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మల్లు సుధాకర్‌రెడ్డి, జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు భాస్కర్ గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు దేవసహాయం, ఎంపీపీ దగ్గుమాటి కామాక్షమ్మ పాల్గొన్నారు.