బాబు కొత్త ఎత్తు
- రుణమాఫీకి షరతుల మెలిక
- జిల్లాలో మొత్తం రుణాలు రూ.1893 కోట్లు
- 31 అంశాల ఆధారంగా అర్హుల జాబితా
- అమలెప్పుడన్నది విస్పష్టం
అన్నదాతల ఆగ్రహావేశాల నుంచి తప్పించుకోడానికి చంద్రబాబు కొత్త ఎత్తు వేశారు. మహిళల కోపాగ్ని నుంచి బయటపడేందుకు మరో పన్నాగం పన్నారు. రుణ మాఫీపై రైతులు, డ్వాక్రా మహిళలు ఎక్కడికక్కడ నిలదీస్తుండడంతో తాత్కాలిక ఉపశమనానికి ప్రభుత్వం జీవో 174ను జారీ చేసింది. రైతు కుటుంబానికి గరిష్టంగా రూ.1.5 లక్షలవంతున పంట రుణం మాఫీ చేస్తామని ప్రకటించింది. డ్వాక్రా సంఘాల రుణాలను పూర్తిగా రద్దు చేయకుండా.. ఒక్కోదానికి రూ.లక్ష వంతున మూలధనంగా ఇస్తామనడం తాజా ఉత్తర్వుల సారాంశం. ఇది ఎప్పటిలోగా అమలు చేస్తామన్నది మాత్రం అందులో పేర్కొనకపోవడం ప్రభుత్వ కుటిల నీతికి నిదర్శనం. ఈ ఉత్తర్వులను బ్యాంకర్లు కొట్టిపారేస్తున్నారు. జీవోలు ఇస్తే రుణమాఫీ జరిగిపోదని, డబ్బులు బ్యాంకుల్లో జమయినప్పుడే రద్దవుతాయని పేర్కొంటున్నారు.
విశాఖ రూరల్: రుణమాఫీపై స్పష్టత కొరవడడంతో జిల్లాలోని రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు అయోమయానికి గురవుతున్నారు. షరతులతో కూడిన జీవోలతో మరోసారి మో సం చేస్తున్నారన్న వాదన వ్యక్తమవుతోంది. ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.5 లక్షల వంతున రుణ మాఫీ చేస్తానని జూన్ 10న ఉత్తర్వులు(జీవో నెంబర్ 31) జారీ చేశా రు. డ్వాక్రా రుణాల మాఫీ చేయలేమని తెల్చిచెబుతూ ఈ నెల 2న ఉత్తర్వులు(జీవో నెంబర్ 164) వచ్చాయి.
ఒక్కో సంఘానికి రూ.లక్ష వంతున మూల ధనంగా ఇస్తామని అదే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజాగా ఆ రెండు ఉత్తర్వుల్లో పేర్కొ న్న అంశాలనే పునరుద్ఘాటిస్తూ కేవలం రైతులు, మహిళలు ఆగ్రహాన్ని, నిరసనల నుంచి తప్పించుకోడానికి కొత్తగా జీవో 174ను జారీ చేసింది. కానీ, రుణమాఫీ ఎప్పటిలోగా చేస్తామన్నది.. డ్వాక్రా సంఘాలకు ఎప్పుడు మూలధనం అందిస్తామన్న విషయాన్ని మా త్రం స్పష్టంగా పేర్కొనలేదు. పంట రుణాలు రూ.1040 కోట్లు. 56,134 డ్వాక్రా సంఘాలు రూ.853 కోట్లు బ్యాంకులకు చెల్లించాలి.
మొత్తంగా రూ.1893 కోట్లు జిల్లాలో రుణ మాఫీ చేయాల్సి ఉంది. ఇందుకు లబ్ధిదారుల గుర్తింపునకు 31 అంశాల ప్రొఫార్మా రూపొందించారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్లను కూడా అందులో చేర్చారు. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా రుణమాఫీ వర్తించదు. 2013 డిసెంబర్ 31వరకు తీసుకున్న పంట రుణాలు, 2014 మార్చి 31 నాటికి పేరుకుపోయిన బకాయిలకు రుణమాఫీ వర్తింప చేస్తామని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
14 రోజుల్లో జాబితా
కలెక్టర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కలిసి మాఫీకి అర్హులను ఎంపిక చేయాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. నోటిఫికేషన్ జారీ చేసిన 14 రోజుల్లోగా జాబితాను రూపొందించాలని నిర్దేశించింది. ప్రతీ రైతు పట్టాదారు పాసుపుస్తకంలోనూ తీసుకున్న పంటరుణం.. మాఫీ చేసే మొత్తాన్ని విధిగా నమోదు చేయాలి. రుణ మాఫీ చేసే మొత్తాన్ని ఆయా రైతుల సర్వే నెంబర్ల వారీగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని చెప్పింది. ఆ తర్వాత 31 అంశాల ఆధారంగా రూపొందించిన ప్రొఫార్మాలో నమోదు చేయాలని, భర్త, భార్య, ఆధారపడిన పిల్లలను ఒక కుటుంబంగా ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షలకు మించకుండా రుణమాఫీ వర్తింపచేస్తామని చెప్పింది.
మహిళల ఆగ్రహం
డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా ఒకో సంఘానికి రూ.లక్షకు మించకుండా మూలధనంగా ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్నమొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని ఓట్లేయించుకుని.. ఇప్పుడు నట్టేట ముంచారని మండిపడుతున్నారు. రూ.లక్ష వంతున మూలధనం అందించడం వల్ల కేవలం 15 శాతం సంఘాల్లో మహిళలకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. ఆ మూలధనం కూడా ఎప్పటిలోగా అందిస్తామన్నది ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనలేదు. ఈ ఉత్తర్వుల వల్ల ఎలాంటి ప్రయోజకం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు.