కౌలు రైతులకు భరోసానిస్తున్నా బాధేనా రామోజీ?  | Enrollment in this crop is standard welfare | Sakshi
Sakshi News home page

కౌలు రైతులకు భరోసానిస్తున్నా బాధేనా రామోజీ? 

Published Thu, Nov 16 2023 4:26 AM | Last Updated on Thu, Nov 16 2023 10:07 AM

Enrollment in this crop is standard welfare - Sakshi

సాక్షి, అమరావతి:  గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలురైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే రామోజీరావు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వారికి మేలు జరుగుతుంటే విషపురాతలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. గత ప్రభుత్వాలు ఆలోచన కూడా చేయని పంట సాగు హక్కుదారుల చట్టం–2019 తీసుకురావడమే కాదు.. సీసీఆర్సీల ఆధారంగా వైఎస్సార్‌ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీతో పాటు వివిధ కారణాలతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 7 లక్షల పరిహారం అందిస్తున్నారు.

అంతేకాదు కౌలురైతులకు ఈక్రాప్‌ నమోదు ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ), ఉచిత పంటల బీమా వంటి పథకాలు అందిస్తున్నారు. ఈ క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా అమ్ముకోగలుగుతున్నారు. చంద్రబాబు హయాంలో కౌలు రైతులకు మేలు చేసే ఊసేలేదు. వాస్తవాలకు ముసుగేసి తప్పుడు కథనాలతో రామోజీరావు నిత్యం బురదజల్లడమే పనిగాపెట్టుకున్నారు. వ్యవసాయాన్ని పండుగలామార్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ ‘కౌలురైతు నోట్లో మట్టి’ అంటూ ఈనాడు పత్రికలో రోతరాతలు రాశారు.  

ఆరోపణ: కౌలు రైతులను ఆదుకోవడంలో 100 శాతం విఫలం 
వాస్తవం: భూయజమాని హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, వారి హక్కుల రక్షణకల్పిస్తూనే వాస్తవ సాగుదారులకు పంట సాగుదారు హక్కు పత్రాల(సీసీఆర్సీ)ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తోంది. ఇందుకోసం ఏటా ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందు రెవెన్యూ శాఖతో కలిసి ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 25.82 లక్షల మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు మంజూరు చేశారు. 

ఆరోపణ: కౌలురైతులకు పంట రుణాలేవి 
వాస్తవం: వాస్తవ సాగు దారులందరికి పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్‌లను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు. సీసీఆర్సీ కార్డులున్న వారికి రుణాలు అందిస్తున్నారు. సీసీఆర్సీ లేని కౌలు రైతులతో జాయింట్‌ లయబిలిటీ గ్రూపు (జేఎల్‌జీ)లను ఏర్పాటు చేసి ఈ గ్రూపుల ద్వారా వారికి రుణాలు అందేలా చేస్తున్నారు. ఇలా 2019 నుంచి ఇప్పటివరకు 13.49 లక్షల మంది కౌలుదారులకు రూ. 7,959.49 కోట్ల రుణాలు అందించారు. 

ఆరోపణ: రైతు భరోసాకు మొండిచేయి 
వాస్తవం: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు అటవీ, దేవదాయ భూమి సాగుదారులకు కూడా రూ. 13,500 చొప్పున మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అందిస్తోంది. కౌలుదారుల్లో 6 శాతం మందికి మాత్రమే రైతు భరోసా అందుతుందనడంలో వాస్తవంలేదు.

మెజార్టీ కౌలు దారులు సొంత భూమి కూడా కలిగి ఉన్నారు. వీరందరికీ భూ యజమానిగా వైఎస్సార్‌ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందుతోంది. సీసీఆర్‌సీ కార్డుల ఆధారంగా వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఈ 50 నెలల్లోనే దాదాపు 5.38 లక్షల మంది కౌలు రైతులకు రూ. 697.32 కోట్లు, 3.99 లక్షల అటవీ భూములు (ఆర్‌వోఎఫ్‌ఆర్‌) సాగు చేసే గిరిజనులకు రూ. 522.36 కోట్లు కలిపి మొత్తం 9.38 లక్షల మందికి రూ. 1,219.68 కోట్లు  పెట్టుబడి సహాయంగా అందించారు. 

ఆరోపణ: కౌలురైతులకు అందని సంక్షేమ ఫలాలు 
వాస్తవం: కౌలుదారులకు సంక్షేమ ఫలాలు అందడం లేదనడంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. వైఎస్సార్‌ రైతు భరోసాతో సహా భూయజమానులకు వర్తింçప చేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులకు కూడా వర్తింప చేస్తున్నారు. సీసీఆర్సీ కార్డు ఉన్నా లేకున్నా కూడా అందిస్తున్నారు. ఈ క్రాప్‌ ఆధారంగా లక్ష లోపు పంటరుణాలు పొందిన కౌలుదారులకు వైఎస్సార్‌ సున్నావడ్డీ రాయితీ కూడా అందేలా చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 30 వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని అందించారు. అలాగే 3.55లక్షల మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 2.41లక్షల మందికి 253.56 కోట్ల పంట నష్ట పరిహారం  

బాబు హయాంలో కౌలురైతులను ఆదుకున్నదేది?  
చంద్రబాబు హయాంలో కౌలు రైతులకు కనీసంగా అంటే కనీసంగా కూడా ఆదుకున్న దాఖలాలు లేవు. ఏటా అరకొరగా తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఎల్‌ఈసీ కార్డులు జారీ చేయడం తప్ప ప్రభుత్వ పరంగా ఏ ఒక్క సంక్షేమ ఫలాలు అందించిన  జాడే లేదు. కౌలుదారుల్లో 80 శాతం మందికి పైగా భూయజమానులతో ఎలాంటి లిఖిత పూర్వక ఒప్పందం లేకుండా భూమిని కౌలుకు తీసుకుంటారు. అధీకృత ఒప్పందాల్లేక పోవడం వలన ప్రభుత్వ పథకాలు, ప్రోత్సహాకాలు, రాయితీలే కాదు కనీసం పంట రుణాలు కూడా దక్కేవి కావు.

టీడీపీ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు రూ. 5 లక్షల పరిహారం ఇచ్చేవారు. కానీ దీన్లో రూ.1.5 లక్షల్ని అప్పులకు జమ చేసుకుని, మిగిలిన 3.5 లక్షలు కూడా విత్‌డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్‌ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునే పరిస్థితి కల్పించేవారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిహారాన్ని రూ.5 లక్షలనుంచి రూ.7 లక్షలకు పెంచడమే కాదు. ఆ మొత్తాన్ని నేరుగా ఆత్మహత్యలకు పాల్పడే రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేస్తోంది. కౌలు రైతు అయినా వ్యవసాయ కారణాలతో చనిపోతే దేశంలో రూ.7 లక్షల పరిహారం ఇస్తున్నది ఒక్క మన రాష్ట్రంలోనే.   

కౌలుదారుల కుటుంబాలకునేరుగా పరిహారం 
వ్యవసాయాధారిత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న కౌలుదారులకు సీసీఆర్సీ కార్డు ఉంటే రూ. 7 లక్షలు, లేకుంటే వైఎస్సార్‌ బీమా కింద రూ.లక్ష పరిహారం నేరుగా బాధిత కౌలురైతు కుటుంబ సభ్యుల ఖాతాకు జమ చేస్తున్నారు. ఇలా 2019 నుంచి ఇప్పటి వరకు 1,270 కేసులకు సంబంధించి రూ.88.90 కోట్ల పరిహారం చెల్లించారు. ఇందులో 485 మంది కౌలురైతులుండగా, ఆ కుటుంబాలకు రూ. 33.95 కోట్ల ఆర్థిక సాయం అందించారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యలపై పునర్విచారణ జరిపి 474 మందికి రూ. 23.70 కోట్ల పరిహారం చెల్లించగా, వీరిలో కూడా 212 మంది కౌలురైతులున్నారు. వీరికి రూ. 10.60 కోట్ల పరిహారం చెల్లించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement