పల్లె పొమ్మంటోంది
కడప గడపలో కరువు దరువేస్తోంది. ఆకాశ గంగ దిగిరానంటోంది. పాతాళ గంగ పైకి రానంటోంది. వెరసి పంటపొలాలు బీళ్లుగా మారాయి. రైతు బతుకు దుర్భరంగా మారింది. పూట గడవడం కష్టమైంది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు వలసబాట పడుతున్నారు. కన్న ఊరిపై మమకారం చంపుకోలేక.. ఇక్కడే ఉండి క ష్టాల కాపురం చేయలేక.. గుండెలోతు బాధతో గూడు విడిచి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఆ పల్లెల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఇది కరువు మిగిల్చిన పల్లెల కన్నీటి క(వ్య)థ.
- అన్నదాతను కుదిపేస్తున్న కరువు రక్కసి
- పంటలు పండక.. పనులు దొరక్క..
- వలసబాట పడుతున్న గ్రామీణులు
- నిర్మానుష్యంగా మారుతున్న పల్లెసీమలు
రాయచోటి: అవి రాయచోటి పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో చుట్టూ కొండల మధ్య ఉండే మారుమూల పల్లెలు. ఏ పల్లెలో అడుగిడినా కరువు ఛాయలే కనిపిస్తాయి. ఏ ఇంట్లోకి తొంగి చూసినా కరువు రక్కసి చేస్తున్న వికటాట్ట హాసమే వినిపిస్తుంది. ఏరోజుకారోజు తిండిగింజలు సంపాదించుకుంటే కడుపుకు కాసింత తిండి దొరుకుతుంది. లేదంటే పొయ్యి వెలగదు. పొగచూరిన పేదరికం. బతుకంతా అంధకారం. ఇదీ అక్కడి రైతుల దయనీయ స్థితి. రాయచోటి నియోజకవర్గంలో గత పదేళ్లుగా కరువు రక్కసి కరళానృత్యం చేస్తోంది. యేటా పంటలు దెబ్బతినడంతో మధ్య తరగతి రైతులు కూడా కూలీలుగా మారిపోతున్నారు. పంటల సాగు కోసం పెట్టిన పెట్టు బడులు కూడా చేతికి రాక అవస్థలు పడుతున్నారు.
చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక, కుటుంబ పోషణ భారమై అల్లాడిపోతున్నారు. అప్పులు తీర్చేందుకు భూమిని అమ్ముదామన్నా కొనేవారు కూడా కరువయ్యారు. ఆకలి బాధలు భరించలేక క్రమక్రమంగా ఒక్కో రైతు వలసబాట పట్టాడు. కరువు కాలంలో వ్యవసాయ పనులు లేవు. పనికి రమ్మని పిలిచే రైతులు కరువయ్యారు. వర్షాభావంతో పొలాలు బీళ్లుగా మారి భూస్వాములు సైతం ఎలా బతకాలని దిగులుపడుతున్నారు. కూలి పనులకు వెళ్లిన విషయం అందరికీ తెలిస్తే చిన్నతనంగా భావించి రాత్రికి రాత్రే ఇళ్లకు తాళాలు వేసి పెద్ద రైతులుసైతం వలస బాట పడుతున్నారు. రాయచోటి మండలం మాధవరం గ్రామ పంచాయతీలోని మూలవాండ్లపల్లె, మల్లెంవాండ్లపల్లె, కాల్వపల్లెలు ఇందుకు సజీవ సాక్ష్యాలు. కాల్వపల్లెలో మొత్తం 20 కుటుంబాల వారు నివసిస్తున్నారు. ప్రతి కుటుంబానికి రెండు నుంచి 3 ఎకరాల వరకు పొలం ఉంది. చిన్న, సన్నకారు రైతులయిన వీరు వర్షంపై ఆధారపడి పంటలు సాగు చేసుకొనేవారు.
గత ఏడాది కరువు పరిస్ధితులు తట్టుకోలేక ఆపల్లె వాసులు నేటికి 8 ఇళ్లకు తాళం వేసి వలస వెళ్లారు. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మిగిలిన కుటుంబాలు కూడా వలస పోయే పరిస్థితి ఉంది. ఈ పల్లెలోని వెంకటమల్లప్ప, జయమ్మ, సూర్యనారాయణ, సరస్వతమ్మ, మునెప్ప, పార్వతమ్మ, రవణప్ప, నారాయణమ్మ, చంద్రమోహన్, సుజాత, మల్లికార్జున, రాజేశ్వరి అనే రైతులు తమ పొలంలో పంటలు పండక పోవడంతో పాటు ఈ పంటల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కు తోచక బెంగళూరులోని గురుడాచర పాళెంకు కూలి పనులకోసం వలస వెళ్లారని ఆ గ్రామస్తులు తెలిపారు.
అలాగే మల్లెంవాండ్లపల్లెకు చెందిన పురుషోత్తం అనే రైతు తన ఇంటికి తాళం వేసి చిత్తూరు సమీపంలో మామిడితోటల్లో కాపలాదారుడిగా వె ళ్లాడని ఆ గ్రామస్తులు కొందరు తెలిపారు. కరువు ఇలాగే వెంటాడితే తాము కూడా వలస బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వారు ఆవేదనతో చెప్పారు. కన్న ఊరిని.. నేల తల్లిని నమ్ముకొని తాము ఇంత వరకు ఉన్నామని, తమకు తాగేందుకు నీరు కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని పలువురు మహిళలు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు ఈ పల్లెలపై దృష్టి సారించి పల్లె ప్రజలకు కరువు పనులు కల్పించి వలసలు నివారించాల్సిన అవసరం ఉంది.
వలస వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా
నాపేరు కదిరప్ప. మాది మాధవరం గ్రామపంచాయతీలోని కాల్వపల్లె. మా పల్లెలో 20 ఇళ్లు ఉంటే నేటికీ 8 మంది ఇళ్లకు తాళం వేసి బెంగళూరులోని గురుడా చరపాళెంకు వలస వెళ్లారు. మరో నాలుగు ఇళ్లకు చెందిన వారు కూడా వలస వెళ్లారు. ఇంకొన్ని రోజుల్లో వర్షం పడకపోతే నేను కూడా వలస వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను.
ఉపాధి పనులు కల్పించాలి - ఆదెప్ప - కాల్వపల్లె
నా పేరు అద్దెప్ప. మాది మాధవరం గ్రామ పంచాయతీలోని కాల్వపల్లె. నేను ఇలాంటి కరువును ఎప్పుడూ చూడలేదు. నాకు ఉన్న మూడుఎకరాల పొలంలో సాగు చేసేందుకు దుక్కులు చేసి వాన కోసం ఎదురు చూస్తున్నా. వాన రాకపోతే నేను కూడా ఇంటికి తాళం వేసి వలస వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వం ఉపాధి పనులు కల్పిస్తే ఆ పనులు చేసుకొని నేను కుటుంబాన్ని పోషించుకుంటా. లేకపోతే వలస వెళ్లి పోతా.