బలిపీఠంపై అన్నదాత | Anndata the altar of drought in the state | Sakshi
Sakshi News home page

బలిపీఠంపై అన్నదాత

Published Mon, May 4 2015 2:29 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

బలిపీఠంపై అన్నదాత - Sakshi

బలిపీఠంపై అన్నదాత

  రాష్ర్టంలో కరువుకాటుతో
     రైతన్నల బలిదానం
  రూ. 15 వేల కోట్ల ప్రైవేటు అప్పు
  అందని పంట నష్టపరిహారం
  ఖరీఫ్ ముంచుకొస్తున్నా
    రెండోవిడత రుణమాఫీపై అస్పష్టత
  774 మంది ఆత్మహత్యలు
    చేసుకున్నారంటున్న రైతు సంఘాలు

 
హైదరాబాద్: రాష్ట్రంలో కరువు కరాళనృత్యం చేస్తోంది. మొదట వర్షాభావంతో.. పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాల వల్ల అన్నదాతలు నిండా మునిగారు. వాతావరణం లో అనూహ్య మార్పులతో రైతు కష్టం పూర్తిగా తుడిచిపెట్టుకొనిపోయింది. వారు శక్తిమేర సా గు చేసిన కొద్దిపాటి పంటలపైనా ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు ప్రైవేటు అప్పులు పేరుకుపోయి అన్నదాతలు అయోమయంలో పడ్డా రు.


వడ్డీ వ్యాపారుల వేధింపులు వారిని అంతకంతకూ కుంగదీస్తున్నాయి. ప్రభుత్వం ఘనం గా చెప్పుకొన్న రుణమాఫీ అమలులో విపరీత జాప్యం కూడా ఇందుకు తోడైంది. రైతన్నకు భరోసా కల్పించాల్సిన సర్కారు కనీస సాయానికి కూడా ముందుకు రావడం లేదు. కరువు మండలాలను గుర్తించే పని కూడా చేయడం లేదు. రైతుల ఆత్మహత్యలకు పరి హారమిస్తే మరిన్ని చావులు సంభవిస్తాయని కొందరు మంత్రులే వింత వాదన వినిపిస్తున్నారు.


చెత్తబుట్టలో కలెక్టర్ల నివేదిక
రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వానికి ఆ ఛాయలు కనిపించడం లేదు. వాస్తవ పరిస్థితిని కలెక్టర్లు విన్నవించినా రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం వాటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా 401 కరువు మండలాలున్నట్లు కలెక్టర్లు ఎప్పుడో నిర్ధారించారు. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి.


కానీ ఆ నివేదికను పక్కనబెట్టి..  88 మండలాలనే కరువు మండలాలుగా ఉన్నతస్థాయి కమిటీ నిర్ధారించడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలుంటే 40 మండలాల్లో కరువున్నట్లు అక్కడి కలెక్టర్ పేర్కొన్నారు. కానీ రాష్ట్రస్థాయి కమిటీ మాత్రం ఆ జిల్లాలో ఏ మండలంలోనూ కరువు లేదని చెప్పింది. అలాగే ఖమ్మంలోనూ 46 మండలాలకు 32 మండలాల్లో కరువు ఉందని అక్కడి కలెక్టర్ చెప్పగా.. జిల్లాలో అసలు  కరువే లేదని కమిటీ నిర్ధారించింది. వరంగల్ జిల్లాలో 40 మండలాల్లో కరువుందని కలెక్టర్ ప్రతిపాదిస్తే.. కేవలం ఒక్క మండలాన్ని మాత్రమే గుర్తించారు.


ఆత్మహత్యలపై తప్పుడు లెక్కలు
వర్షాభావం.. పంట నష్టం.. అప్పుల భారంతో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత వ్యవసాయ సీజన్‌లో రైతులు చేసిన ప్రైవేటు అప్పులు రూ. 15 వేల కోట్ల మేరకు ఉంటాయని అధికారవర్గాల అంచనా. బ్యాంకులు సకాలంలో రుణాలు ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.


మరోవైపు కౌలుదార్లకు రుణ అర్హత కార్డులు లేకపోవడం, పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లేకపోవడం, వ్యాపారుల దోపిడీ కూడా కారణాలే. అయితే రాష్ర్ట ప్రభుత్వం రైతు ఆత్మహత్యల సంఖ్యను తక్కువ చేసి చూపుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ర్టం ఏర్పాటైనప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 96 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీనిపై రైతు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 774 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అవి ఆధారాలు చూపుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం చాలా ఆత్మహత్యలను ‘ఇతర కారణాల వల్లే’ జరిగినట్లు పేర్కొం టోంది. నష్ట పరిహారం ఇవ్వాల్సి వస్తుందని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగకరమని భావించే సర్కారు పెద్దలు ఇలా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
 
రెండో విడత రుణమాఫీ ఎప్పుడు?
మరో నెల రోజుల్లో వ్యవసాయ సీజన్ మొదలుకానుంది. కొద్దిపాటి వర్షాలు కురిసినా రైతులు పత్తి విత్తనం వేస్తారు. ఈలోపే చాలామంది రైతులు బ్యాంకు రుణాలు తీసుకుంటారు. గతేడాది తొలి విడత రుణమాఫీ కింద రూ. 4,250 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది రెండో విడత సొమ్మును విడుదల చేయాల్సి ఉంది. కానీ బ్యాంకుల నుంచి ఇప్పటికీ గత రుణమాఫీకి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీ) రాలేదు. యూసీలు రాకుంటే రెండో విడత రుణమాఫీని విడుదల చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు రెండో విడత రుణమాఫీ సొమ్ము విడుదల చేయకపోతే బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడానికి కొర్రీలు పెడతాయని రైతులు ఆందోళన  చెందుతున్నారు. వారు మళ్లీ ప్రైవేటు అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురిస్తుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement