బడ్జెట్ కేటాయింపులపై రైతుల పెదవి విరుపు | The budget allocation for farmers pout | Sakshi
Sakshi News home page

బడ్జెట్ కేటాయింపులపై రైతుల పెదవి విరుపు

Published Fri, Aug 22 2014 2:06 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

బడ్జెట్ కేటాయింపులపై రైతుల పెదవి విరుపు - Sakshi

బడ్జెట్ కేటాయింపులపై రైతుల పెదవి విరుపు

  • బడ్జెట్ కేటాయింపులపై రైతుల పెదవి విరుపు
  •   సర్కార్ వైఖరిపై వెల్లువెత్తుతున్న నిరసన
  •   బ్యాంకర్ల వైఖరితో అన్నదాతలో అయోమయం
  • సాక్షి, విజయవాడ : జిల్లాలో రుణమాఫీ కింద రద్దు కావాల్సిన రైతుల బకాయిలు రూ.9,137 కోట్లు ఉంటే... బుధవారం  అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌లో కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే ఇందుకోసం  కేటాయించడంతో రైతులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.  రాష్ట్రం మొత్తానికి కేటాయించిన  ఆ నిధులతో జిల్లాలోని రైతులకు ఎంతమేరకు రుణమాఫీ జరుగుతుందనే విషయం గందరగోళంగా మారింది.   

    రైతు రుణాలన్నీ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీని పూర్తిగా విస్మరించి రైతులను అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బ్యాంకర్లు  ప్రస్తుత అవసరాలకు రుణాలు ఇవ్వకుండా పాత బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేస్తూ  తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఇంకోవైపు సీజన్ సగంలోకి వచ్చేసినా కొన్ని ప్రాంతాల్లో నాట్లు పడని పరిస్థితి. దీంతో రైతు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు.
     
    తగ్గిన సాగు విస్తీర్ణం...


    జిల్లాలో 6.34 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఖరీఫ్  సాగు చేస్తారు.  సీజన్ మొదలై దాదాపు మూడు నెలలు గడిచింది. బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. గతేడాది ఇదే సమయానికి సుమారు 4 లక్షల ఎకరాలు సాగులోకి రాగా ప్రస్తు తం కేవలం1.10 లక్షల ఎకరాలు మాత్రమే సాగయింది. జూన్ నెల నుంచి నవంబర్ వరకు ఖరీఫ్ సీజన్ ఉంటుంది.  దీనికి అనుగుణంగా బ్యాంకర్లు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఖరీఫ్ సీజన్‌గా నిర్ణయించుకుని రుణాలు మంజూరు చేస్తుంటారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండాపోయింది.
     
    తగ్గిపోయిన రుణాలు ...
     
    గతేడాది ఖరీఫ్ సీజన్తో పోలిస్తే ప్రస్తుత సీజన్లో ఇచ్చిన రుణాలు నామమాత్రంగా ఉన్నాయి. అది కూడా  పాత రుణాలు పూర్తిగా చెల్లించిన వారికి, సగభాగం చెల్లించిన వారికి మాత్రమే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రుణాలు మంజూరు చేశారు.  గతేడాది జిల్లాలో 3,94,912 మంది రైతులకు రూ. 2,402 కోట్ల రుణాలను బ్యాంకర్లు మంజూరు చేశారు.  వీటిలో రూ.2,046 కోట్లు పంట, బంగారు నగలపై తీసుకున్న రుణాలు కాగా రూ.366 కోట్లు వ్యవసాయ రుణాలు.  

    ఈ ఏడాది జూలై వరకు 99 వేల మంది  రైతులకు  మాత్రమే రుణాలు మంజూరు చేశారు. వీరిలో పాత రుణాలు చెల్లించిన వారు 70 శాతం మందికిపైగా ఉన్నారు. పాత అప్పు చెల్లిస్తేనే కొత్త అప్పులిస్తామని చెబుతూ బ్యాంకర్లు దాదాపు నెలరోజులుగా  రుణాలు మంజూరు చేయడం లేదు. ఇప్పటి వరకు పంట రుణాలు, బంగారు నగల తాకట్టుపై కేవలం రూ.605 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. అలాగే వ్యవసాయ రుణాలు రూ.206 కోట్లు మాత్రమే ఇచ్చారు.  

    జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ నరసింహారావు సాక్షితో మాట్లాడుతూ పాత రుణాలు తీర్చితేనే కొత్త రుణాలు ఇవ్వాలని తమకు ఆర్‌బీఐ నుంచి మార్గదర్శకాలు ఉన్నాయని, వాటికనుగుణంగానే తాము రుణాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఖరీప్ సీజన్ సాగు ప్రశార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో   అన్నదాతలు రుణమాఫీ కోసం ఉద్యమబాట పట్టనున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
     
    రుణమాఫీపై నమ్మకం పోయింది
    రైతుల రుణమాఫీ కోసం రూ.45వేల కోట్లు అవసరమని చెబుతున్నారు. తీరా బడ్జెట్‌లో ఇందుకోసం కేవలం రూ.5వేలు కోట్లు మాత్రమే కేటాయించి చంద్రబాబు చేతులు దులుపుకున్నారు. ఈ చర్యల వల్ల రుణమాఫీపై నమ్మకం పోతుంది.
     - విశ్వనాథుని సత్యనారాయణ, రైతు, కృష్ణాపురం, కోడూరు మండలం
     
    రుణమాఫీ చేసే వరకూ నమ్మకం లేదు
    ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని చెప్పడంతో అందరూ చంద్రబాబు నాయుడిని గెలిపించారు. రుణమాఫీపై  రోజుకో రకంగా మాట్లాడుతున్నారు.  ఎప్పటిలోపు రుణమాఫీ చేస్తారో ఇంత వరకు తేల్చలేదు. రుణమాఫీ చేసే వరకూ నమ్మకం లేదు.
     - పోలాబత్తిన వెంకటేశ్వరరావు, పిట్టల్లంక, కోడూరు మండలం  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement