భరోసాలేని బడ్జెట్ | Mango research location neglect | Sakshi
Sakshi News home page

భరోసాలేని బడ్జెట్

Published Sat, Aug 23 2014 12:40 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

భరోసాలేని బడ్జెట్ - Sakshi

భరోసాలేని బడ్జెట్

  •       మామిడి పరిశోధనా స్థానాన్ని విస్మరించారు
  •       పెట్టుబడి లేక తగ్గిన సాగు విస్తీర్ణం
  •       ధరల స్థిరీకరణ నిధిపై లేని ప్రకటన
  •       ఆర్థిక బడ్జెట్ అంకెలను మార్చిన వ్యవసాయ శాఖ
  • రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూసిన రైతులకు దిమ్మదిరిగేలా ఆర్థిక బడ్జెట్ ఉన్నా... వ్యవసాయ శాఖ బడ్జెట్‌లోనైనా మేలు జరుగుతుందనుకుంటే అదీ నిరాశే మిగిలింది.  మరోవైపు జిల్లాకు  ఒక్క నూతన కేటాయింపు కానీ, కొత్త పథకాల అమలు ఊసు కానీ లేకపోవడంతో బడ్జెట్‌పై అన్నదాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
     
    సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం చర్యల వల్ల జిల్లాలో సాగు విస్తీర్ణం  తగ్గిపోయింది. నిత్యం పంటలతో కళకళలాడే డెల్టా ప్రాంతంలో నేడు ఖాళీ పొలాలు దర్శనమిస్తున్నాయి. జిల్లాలో ఖరీప్ సీజన్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరిని సాగుచేస్తుంటారు. అలాగే 40 వేల ఎకరాల్లో చెరకు, 1.40 లక్షల ఎకరాల్లో పత్తి, 80 వేల ఎకరాల్లో కూరగాయలు, ఇతర ఉద్యానవన పంటలు సాగు చేస్తుంటారు. కానీ జిల్లాలో ఈ ఏడాది పరిస్థితి అందుకు పూర్తీ భిన్నంగా ఉంది.

    ఎన్నికల ముందు రైతులెవరూ రుణాలు చెల్లించొద్దని చంద్రబాబునాయుడుతోసహా టీడీపీ నాయకులు హామీలమీద హామీలిచ్చి ఎన్నికల్లో గెలిచారు. వాళ్ల మాట నమ్మిన రైతులు రుణాలు చెల్లించలేదు. ఇప్పుడు రుణమాఫీ అమలు కాకపోగా పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలిస్తామని బ్యాంకర్లు స్పష్టం చేయడంతో పంటల పెట్టుబడులకు డబ్బు దొరకని పరిస్థితి పల్లెల్లో నెలకొంది.        

    మరోవైపు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే ఖరీప్ సీజన్ కింద రుణాలు మంజూరవుతాయి. జిల్లాలో ఏటా సగటున రూ.2,500 కోట్ల రుణాలు మంజూరు చేసే బ్యాంకులు ఈ ఏడాది రుణాలు మంజూరు చేయకుండా కఠిన నిబంధనలతో అన్నదాతల్ని ఇబ్బంది పెడుతున్నారు.  రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం.. బ్యాంకర్లు తమ మాట వినడం లేదని చెప్పి తప్పించుకుంటోంది. దీంతో ఈ ఏడాది  ఏప్రిల్ నుంచి జూలై వరకు కేవలం రూ.810 కోట్లు మాత్రమే రుణాలు మంజూరు చేశారు.

    అవి కూడా 70 శాతం పాత రుణాలు చెల్లించిన రైతులకు మాత్రమే కొత్త రుణాలు మంజూరు చేశారు. దీంతో జిల్లాలో సాగు పూర్తిగా తగ్గిపోయింది.   జిల్లాలో ఇప్పటివరకు కేవలం లక్ష ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పడాయి. ఖరీఫ్ సీజన్  మొదలై మూడు నెలలు గడచినా 20 శాతం విస్తీర్ణం మాత్రమే సాగులోకి వచ్చింది. దీంతో ఈ సీజన్లో దిగుబడి తగ్గితే ఆహారధాన్యాల కొరత ఏర్పడే అవకాశం ఉంది.

    మరోవైపు జిల్లా రైతాంగం ధరల స్థిరీకరణ నిధిపై  ఆశలు పెట్టుకున్నారు. దానిపై కూడ బడ్జెట్‌లో ప్రస్తావన లేదు.  ఇదిలా ఉంటే జిల్లాలో ఖరీప్ సీజన్‌కు అవసరమైన ఎరువులు, యూరియా అన్ని అందుబాటులో ఉన్నాయి. సాగు తక్కువ కావడంతో నిల్వల కొరత ఏర్పడలేదు.ప్రసుత్తం 1.11 లక్షల టన్నుల యూరియా, 38,185 టన్నుల డీఏపీ, 1,19 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు,21,990 టన్నుల పొటాషియం నిల్వలు మంజూరయ్యాయి.
     
    మామిడి పరిశోధనా స్థానంపై చిన్నచూపు..
     
    రాష్ట్రంలోనే అత్యధిక మామిడి సాగు విస్తీర్ణం ఉన్న  జిల్లాలో మామిడి పరిశోధనా స్థానాన్ని అభివృద్ధి చెయ్యాలనే డిమాండ్ సుదీర్ఘకాలంగా ఉంది. అయితే బడ్జెట్‌లో దీని ప్రస్తావన కానీ నిధుల మంజూరు కానీ చేయలేదు. కనీసం మామిడి ఎగుమతులు ప్రోత్సహించే దిశగా కూడా బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోవడం గమనార్హం. జిల్లాలోని నూజివీడు ప్రాంతంలో 1.55 లక్షల ఎకరాల్లో మామిడి పంట సాగవుతోంది.  ఇప్పటికే మామిడి పరిశోధనా స్థానం ఉన్నప్పటికీ అది దాదాపుగా నిరుపయోగంగా మారిపోయింది.   

    గతంలో ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో మామిడి పరిశోధనా స్థానానికి పరిశోధనల నిమిత్తం భూమిని  కేటాయించాలని కలెక్టర్ ప్రభుత్వాని కోరారు. కానీ బడ్జెట్‌లో దాని  ఊసే లేదు. అలాగే సాగుకు ప్రోత్సాహంగా ఉండేలా స్థానికంగా మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్  ఉంది. కేవలం లక్ష ఎకరాల సాగు ఉన్న చిత్తూరు జిల్లాలో 55 మామిడి ప్రాసెసింగ్ యూనిట్లున్నాయి.
     
    జిల్లాలో ఒక్క యూనిట్ కూడా  లేకపోవడంతో స్థానికంగా మామిడి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది.మొత్తం మీద వ్యవసాయ బడ్జెట్ కేవలం అంకెల గారడీగా మిగిలింది తప్పరైతులకు ప్రయోజనం చేకూర్చేలా లేదనే వాదన సర్వత్రా వ్యక్తమవుతుంది.
     
    అంకెల గారడీతో మోసం
    ఆర్థిక బడ్జెట్‌లో చూపిన అంకెలనే వ్యవసాయ బడ్జెట్లో శాఖవారీగా కేటాయించడం తప్ప గొప్పదనం ఏమీ లేదు. రైతు రుణమాఫీ అమల్లోకి రాకపోవడంతో పంట విస్తీర్ణం తగ్గింది. రుణమాఫీ ప్రభావం ఖరీఫ్ సీజన్‌పై పడింది.  ఎన్నికల ముందు ధరలస్థిరీకరణకు రూ.5వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబుఅధికారంలోకి రాగానే అంకెల గారడీతో బురిడీ కొట్టించారు.  
     - జె.ప్రభాకర్, రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement