ప'రేషన్'
సర్వర్ డౌన్‌తో సక్రమంగా పనిచేయని ఈ పాస్ యంత్రాలు
ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు
ధర్మవరం : ధర్మవరం పట్టణంలోని చౌక దుకాణం నంబర్ 33లో ఉదయం 8 గంటల నుంచి 15 మంది కార్డుదారులకు రేషన్ పంపిణీ చేశారు. ఈ-పాస్ యంత్రాలు సరిగా పని చేయక రోజుకు 20 మందికి కూడా రేషన్ ఇవ్వలేని పరిస్థితి. బత్తలపల్లి మండల కేంద్రంలో ఉదయమే రేషన్ షాపును తెరిచారు. సర్వర్ సక్రమంగా పని చేయక పంపిణీ ఆలస్యమైంది. దీంతో లబ్ధిదారులు సాయంత్రం దాకా పడిగాపులు కాయాల్సి వచ్చింది. రేషన్ షాపుల్లో నిత్యావసరాలు తీసుకోవడానికి లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈపాస్ మిషన్లు సరిగా పని చేయకపోవడమే ఇందుకు కారణం.
వారం రోజులుగా లబ్ధిదారులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.ఈపాస్ యంత్రాలకు సర్వర్ పనిచేయక ఇటు డీలర్లు, అటు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరి కొన్ని చోట్ల వేలిముద్రలు పడక కార్డుదారులకు సమస్యలు తప్పడం లేదు. జిల్లాలో మొత్తం 63 మండలాలకు కలిపి 2,983 చౌక దుకాణాలు , 12,37,571 కార్డులు ఉన్నాయి. గతంలో నిత్యావసరాలు నేరుగా ఇచ్చేవారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇచ్చిన ఈపాస్ మెషీన్లు తరచూ మొరాయిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు.
దినసరి కూలీల సమస్యలు వర్ణణాతీతం :
ఒక్కో రేషన్ షాపు పరిధిలో 200 నుంచి 500 మధ్య రేషన్ కార్డులు ఉన్నాయి. కార్డు దారులంతా నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు కావడంతో సరుకుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఎప్పుడు సర్వర్ పని చేస్తుందా.. అని ఉదయం నుంచి సాయంత్రం దాకా చౌక దుకాణం వద్ద వేచి ఉంటున్నారు. దినసరి కూలీలు తమ రోజు కూలిని పోగొట్టుకోవాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
డీలర్లకూ తప్పని తిప్పలు
ఈపాస్ విధానం వల్ల రేషన్ డీలర్లకూ తిప్పలు తప్పడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపులో ఉంటే 10 నుంచి 20 మందికి మాత్రమే రేషన్ పంపిణీ చేయగల్గుతున్నారు. రేషన్ సకాలంలో అందకపోవడంతో డీలర్లతో లబ్ధిదారులు గొడవలకు దిగుతున్నారు.