విజయవాడలో రేషన్ తీసుకుంటున్న వృద్ధురాలు
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ సరుకులను గత నాలుగు రోజుల్లో 69.78 లక్షల కుటుంబాలు తీసుకున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ రేషన్ కార్డులు ఉన్న పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా పేదలను ఆకలి బాధల నుంచి తప్పించేందుకు నెలలోగా మూడుసార్లు ఉచిత సరుకులు పంపిణీ చేస్తారు. దీని వల్ల నెల రోజుల్లోనే రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి వ్యక్తికి 15 కిలోల బియ్యం, ప్రతి కార్డుకు 3 కిలోల కందిపప్పు అందుతాయి. ఇందులో భాగంగా మొదటి విడత కింద మార్చి 29 నుంచి ఏప్రిల్ 14 వరకు, రెండో విడత కింద ఏప్రిల్ 15 నుంచి 28 వరకు, మూడో విడత కింద ఏప్రిల్ 29 నుంచి ఉచిత సరుకులు పంపిణీ చేస్తారు. మరో మూడు నాలుగు రోజుల్లో లబ్ధిదారులందరికీ సరుకుల పంపిణీ పూర్తయ్యే అవకాశం ఉంది.
– ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం అదనంగా ఉచిత రేషన్ ఇస్తున్నట్లు ప్రకటించినప్పటికీ 90.28 లక్షల కార్డుదారులకు మాత్రమే దీన్ని పరిమితం చేసింది.
– దీంతో మిగిలిన 56.95 లక్షల కుటుంబాలకు (1.52 కోట్ల కుటుంబ సభ్యులకు) పంపిణీ చేస్తున్న సరుకులకు అయ్యే భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
– కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రేషన్ షాపుల వద్ద ప్రతి ఒక్కరూ కనీసం ఒకటి రెండు మీటర్ల భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
–అవసరం ఉన్న రేషన్ షాపుల వద్ద బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండి షాపుల్లోకి ఒక్కొక్కరినే అనుమతించారు.
Comments
Please login to add a commentAdd a comment