సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలకు గడిచిన మూడు నెలలుగా పంపిణీ చేస్తున్న మాదిరే పన్నెండు కిలోల ఉచిత బియ్యం పంపిణీ పథకం కొనసాగింపుపై ఇంకా సందిగ్ధత నెలకొంది. మరో ఐదు నెలల పాటు అంటే నవంబర్ వరకు ఉచితంగా ఐదు కిలోల బియ్యం పంపిణీ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించినప్పటికీ, రాష్ట్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై నిర్ణయం తెలపాలని ఇప్పటికే పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి ఫైల్ పంపింది. సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పేద, మద్య తరగతి రేషన్ దారులకు ఊరటనిచ్చేలా కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్ నుంచి 3 నెలల పాటు ఉచితంగా 5 కిలోల బియ్యంతో పాటు, కిలో కందిపప్పును పంపిణీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తంగా 2.80కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉండగా, ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గుర్తించిన వారు 1.91కోట్ల మంది ఉన్నారు. కేంద్ర పరిధిలోని లబ్ధిదారులకు 5కిలోల బియ్యం వంతున కేంద్రం ప్రతీ నెలా సుమారు 95వేల మెట్రిక్ టన్నుల మేర సరఫరా చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న 5 కిలోల ఉచిత బియ్యానికి అదనంగా మరో 7 కిలోలు కలిపి మొత్తంగా 12 కిలోలు అందరు లబ్ధిదారులకు అందించింది. దీంతో ప్రభుత్వంపై ప్రతీ నెలా రూ.1100 కోట్ల మేర భారం పడినా భరించింది. కేంద్రం ఇటీవలే ఉచిత 5 కిలోల బియ్యం పథకాన్ని నవంబర్ వరకు పొడిగించింది.కేంద్రం ఇస్తున్న దానికి కలిపి గతంలో మాదిరి 12 కిలోలు పంపిణీపై రాష్ట్రం నిర్ణయం చేయాల్సి ఉంది.
సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేంత వరకూ...
ప్రధాని ప్రకటన అనంతరం ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై సీఎం స్థాయిలో జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం చేయాల్సి ఉంది. ఐదు నెలల పాటు గతంలో మాదిరి బియ్యం పంపిణీ చేయాలంటే కనీసంగా రూ.5వేల కోట్ల మేర భరించాల్సి ఉంటుంది.
దీంతో సీఎం ప్రకటన వచ్చేంత వరకు వేచిచూసే ధోరణిలో ఉన్న పౌర సరఫరాల శాఖ ప్రస్తుతం ఈ నెల ఒకటి నుంచి ఆరంభించాల్సిన రేషన్ పంపిణీని ఇంకా మొదలు పెట్టలేదు. సీఎం నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని రేషన్ డీలర్లకు సమా చారం ఇవ్వడంతో వారెక్కడా పంపిణీ మొదలు పెట్టలేదు. ఒకట్రెండు రోజుల్లో నిర్ణ యం వస్తుందని ఎదురుచూస్తున్నామని, నిర్ణ యం రాగానే పంపిణీ మొదలు పెడతామని పౌర సరఫరాల శాఖ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment