రెండోవిడత ఉచిత రేషన్ పంపిణీకి సర్వం సిద్దం | All Set To Distribute Second Phase Free Ration In Andhra Pradesh From 16th April | Sakshi
Sakshi News home page

రెండోవిడత ఉచిత రేషన్ పంపిణీకి సర్వం సిద్దం

Published Wed, Apr 15 2020 1:22 PM | Last Updated on Wed, Apr 15 2020 3:16 PM

All Set To Distribute Second Phase Free Ration In Andhra Pradesh From 16th April - Sakshi

సాక్షి, అమరావతి : కరోనా విపత్తు సమయంలో పేదలు ఉపాధి లేక ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు గురువారం నుంచి రాష్ట్రంలో రెండో విడత ఉచిత రేషన్‌ పంపిణీలో భాగంగా బియ్యం, కేజీ శనగలను అందించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 13 జిల్లాల్లోని 29,783 చౌక దుకాణాల ద్వారా మొత్తం 1,47,24,017 కుటుంబాలకు బియ్యం, శనగలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే అన్ని చౌక దుకాణాలకు బియ్యం, శనగలను రవాణా చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరంను పాటించాలన్న నిబంధనల మేరకు రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు గుంపులుగా ఏర్పరకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలను తీసుకుంది. మొదటివిడత పంపిణీ సందర్బంగా కొన్నిచోట్ల రేషన్ కోసం కార్డుదారులు తొందరపడి ఒకేసారి దుకాణాల వద్దకు వచ్చిన పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది. 

రేషన్‌ ఏ సమయంలో తీసుకోవాలో తెలిపేలా కూపన్లు..
ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కూపన్లను ముద్రించింది. వాలంటీర్ల ద్వారా ఈ కూపన్లను బియ్యం కార్డుదారులకు అందిస్తున్నారు. ఈ కూపన్లపై వారికి కేటాయించిన రేషన్ షాప్‌లో, ఏ తేదీలో, ఏ సమయానికి వారు వెళ్ళి రేషన్ తీసుకోవచ్చో నిర్ధేశిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో వేర్వేరుగా నిర్ణయించిన సమయాలకు అనుగుణంగా కార్డుదారులు రేషన్ షాప్‌లకు వెళ్ళి బియ్యం, శనగలను తీసుకోవాలని సూచిస్తున్నారు. దానివల్ల ఎక్కడా కూడా ఒకేసారి జనం గుమిగూడకుండా నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు. వేలిముద్ర వేయకుండానే, వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారానే రేషన్ అందించనున్నారు.  

కార్డులు ఎక్కువ ఉన్నచోట్ల అదనపు కౌంటర్‌లు
రాష్ట్రంలోని 14,315 రేషన్ దుకాణాల్లో ఎక్కువ కార్డులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. వాటిలో అధికశాతం అర్బన్ ఏరియాల్లో ఉన్నందున్న రేషన్‌ కూపన్లను అందించినా కూడా రోజుల తరబడి రేషన్ పంపిణీ చేయాల్సి వస్తోంది. దీంతో ఎక్కువ కార్డులు నమోదైన షాప్‌లకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో 8 వేల దుకాణలకు సింగిల్ కౌంటర్, 3800 దుకాణాలకు రెండు కౌంటర్లు, 2,500 షాప్ లకు అదనంగా 3 కౌంటర్లు సిద్ధం చేశారు. ఈ అదనపు కౌంటర్లలో తూకం యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు బియ్యం  కార్డులు వున్నాయి. కానీ కేంద్రం మాత్రం 92 లక్షల కార్డులకే ఉచిత బియ్యంను అందిస్తోంది. మిగిలిన 55 లక్షల మందికి రాష్ట్రప్రభుత్వమే ఉచితంగా బియ్యం, కేజీ శనగలను అందిస్తోంది. దీనితోపాటు బియ్యంకార్డులు పొందేందుకు అన్ని అర్హతలు వుండి, దరఖాస్తు చేసుకున్న పేదలకు కూడా ఉచిత బియ్యం, శనగలను అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పేదలు రెవెన్యూ అధికారులకు ఉచిత బియ్యం కోసం దరఖాస్తు చేసుకుంటే, అర్హతలను పరిశీలించి వెంటనే మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకునే వారిని కూడా ముందుగానే వాలంటీర్లు గుర్తించి సివిల్ సప్లయిస్ అధికారులకు సమాచారం అందచేశారు. లక్షల సంఖ్యలో పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకుంటున్న కార్డుదారులకు కూడా వారు నివాసం వుంటున్న ప్రాంతంలోని రేషన్ దుకాణం నుంచి సరుకులు తీసుకునేందుకు వీలుగా వాలెంటీర్లు కూపన్లను అందిస్తున్నారు. 

నెలాఖరులో మూడో విడత..
గత నెలలో ప్రారంభమైన లాక్‌డౌన్ వల్ల రాష్ట్రంలో రోజువారీ కూలీపనులు చేసుకునే పేదలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని గతనెల 29వ తేదీన తొలివిడతగా ఉచితంగా రేషన్‌కారుడలో పేరు ఉన్న ఒక్కో సభ్యుడికి అయిదు కిలోల బియ్యం, కార్డుకు కేజీ కందిపప్పును ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. తొలివిడతలోనే దాదాపు 1.35 కోట్ల మంది పేదలు ఈ మేరకు లబ్ధిపొందారు. రెండో విడతలో భాగంగా రేపటి నుంచి ఉచిత బియ్యం, కేజీ శనగలను పంపిణీ చేస్తున్నారు. తిరిగి నెలాఖరులో మూడోవిడత కూడా ఇదే తరహాలో బియ్యం, కందిపప్పు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం రేషన్ సరుకులను డోర్ డెలివరీ ద్వారా అందిస్తోంది. మిగిలిన కరోనా ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ జోన్ గా ప్రకటించిన ఏరియాల్లో బియ్యంకార్డు దారులు సురక్షితమైన జోన్‌లో సరుకులు తీసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ లకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రేషన్ అందక, ఇతరత్రా ఇబ్బందులు వుంటే 1902 కి కాల్ చేస్తే వెంటనే అధికారయంత్రాంగం చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

జిల్లాల వారిగా రేషన్‌ వివరాలు..

జిల్లా చౌక దుకాణాలు     మొత్తం కార్డులు
పశ్చిమగోదావరి        2,211 12,59,925
చిత్తూరు                 2,901  11,33,535
నెల్లూరు           1,895 9,04,220
తూర్పు గోదావరి       2,622 16,50,254
కృష్ణా           2,330 12,92,937
ప్రకాశం           2,151 9,91,822
గుంటూరు           2,802 14,89,439
వైఎస్సార్‌ కడప       1,737 8,02,039
విశాఖపట్నం             2,179 12,4,5266
విజయనగరం             1,404 7,10,528
శ్రీకాకుళం             2,013 8,29,024
కర్నూలు             2,363 11,91,344
అనంతపురం             3,012 12,23,684

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement