ఏలూరు చాణక్యపురి కాలనీలో రేషన్ వాహనాల్లో ఇంటింటికీ రేషన్ అందిస్తున్న వలంటీర్
సాక్షి, అమరావతి: పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ రేషన్ పంపిణీ’ పథకం పట్టణాల్లో సోమవారం ప్రారంభమైంది. మొన్నటి వరకు సరుకుల కోసం పేదలు రేషన్ షాపుల వద్ద వేచి ఉండే పరిస్థితి. ఒక్కోసారి పేదలు కూలి పనులు మానుకుని రేషన్ సరుకుల కోసం వెళ్లాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారి ఇబ్బందులను గుర్తించి లబ్ధిదారుల ఇంటికే వెళ్లి సరుకుల పంపిణీ చేసేందుకు వీలుగా 9,260 వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు వాటిని వెంటనే వినియోగంలోకి తెచ్చారు.
రాష్ట్రమంతటా సోమవారం నుంచి లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి రేషన్ సరుకులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ సరఫరాను నిలిపివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో నాణ్యమైన బియ్యం పంపిణీ మొదటి రోజున కేవలం పట్టణాల్లో మాత్రమే ప్రారంభించారు. మొబైల్ వాహనదారులకు ఈ–పాస్ వినియోగం, తూకం వేయడం, ఇళ్ల దగ్గరకు వెళ్లి సరుకులు పంపిణీ కొత్త కావడంతో అక్కడక్కడా కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి రోజు 83,387 మంది కుటుంబాలకు 12.86 లక్షల కిలోల నాణ్యమైన బియ్యం పంపిణీ చేసినట్టు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు.
గ్రామాల్లో పంపిణీకి అనుమతివ్వండి
హైకోర్టు ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికీ సరుకుల పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పథకాన్ని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రమంతటా అమలు చేయాలని ఎన్నికలకు ముందే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment