సాక్షి, నగరి : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పేద ప్రజలు తిండికి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ ఉచితంగా అందిస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. మూడు నెలలకు సరిపోయే రేషన్‌ను మూడు విడతల్లో అందిస్తామని చెప్పారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ రోజు మొదటి విడత రేషన్‌ను అందించామన్నారు. ఏప్రిల్ 15న రెండో విడత, ఏప్రిల్ 29న మూడో విడత రేషన్‌ను అందిస్తామన్నారు. ప్రతి వ్యక్తికి ఐదు కిలోల బియ్యం, ప్రతి కార్డుకు కేజీ కందిపప్పు చొప్పున ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. అలాగే 58 లక్షల మంది పెన్షన్ దారులకు ఏప్రిల్ 1వ తేదిన పెన్షన్ అందిస్తామన్నారు.
(చదవండి : రేషన్ పంపిణీతో ఏపీ ప్రజలకు ఊరట)
సీఎం జగన్ ఆదేశాలతో ప్రతి పేద కుటుంబానికి ఏప్రిల్ నాలుగో తేదిన రూ.1000 ఇవ్వబోతున్నామని తెలిపారు. సీఎం జగన్‌కు ప్రజలపై ఉన్న ప్రేమాభిమానాలు, చిత్తశుద్దిని ఈ నిర్ణయాలు తెలియజేస్తాయన్నారు. ఇంట్లో ఉండండి అని చెప్పడమే కాదు ఇంట్లో ఉన్నవారికి అన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కరోనావైరస్ ప్రబలే అవకాశం ఉన్న దృష్ట్యా వాలంటీర్ల ద్వారా పది మందికి రేషన్ అందించి ఆతర్వాత మరో పదిమందికి ఇస్తున్నామని చెప్పారు. కరోనా వ్యాప్తి చెందకుండా చేయడమే కాకుండా పేదలకు నిత్యవసర వస్తువులను అందించడం గొప్ప విషయం అన్నారు. దీంట్లో పోలీసులు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని ప్రశంసించారు. రాత్రింబవళ్లు పని చేస్తున్న పోలీసులకు అందరూ అండగా నిలవాలని కోరారు. పోలీసులు విసిగిపోతే కరోనా అందరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. కరోనా కట్టడికి సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు కాబట్టే దేశంలోనే ఏపీలో తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనాను పారదోలడంతో అందరు ఐకమత్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ నియమాలను పాటిస్తూ ఎవరూ బయట తిరగొద్దని ఎమ్మెల్యే రోజా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment