రేషన్ డిపోలో బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్ (ఫైల్)
సాక్షి, మచిలీపట్నం: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులను ఈ నెల 29 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రతి కార్డుదారుడికి కేటాయించిన బియ్యంతో పాటు కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తారు. పంచదార పొందడానికి గతంలో మాదిరిగానే నగదు చెల్లించాల్సి ఉంటుంది. 35.98 లక్షల మంది లబ్ధిదారులు జిల్లాలో అన్నపూర్ణ కార్డులు 465, అంత్యోదయ కార్డులు 65,411, తెల్లకార్డులు 12,27,060 ఉన్నాయి. వీటి పరిధిలో 35,98,408 మంది లబ్ధిదారులు (యూనిట్స్) ఉన్నారు. నవశకం సర్వేలో అనర్హులను తొలగించి ఈ కార్డుల స్థానంలో 11.54 లక్షల రైస్‌కార్డులు పంపిణీ చేశారు. ఏప్రిల్ నుంచి రైస్ కార్డులకే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని తొలుత భావించారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా మచిలీపట్నంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి వలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించారు. (లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన వారికి ప్రభుత్వ సాయం)
కానీ ప్రస్తుతం తలెత్తిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో డోర్ డెలివరీ నిర్ణయాన్ని వాయిదా వేశారు. పాత పద్ధతిలోనే రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి సరుకులు ఇవ్వాలని నిర్ణయించారు. రేషన్ డిపోల వద్ద సామాజిక దూరం పాటిస్తూ సరుకులు పంపిణీ చేస్తారు. బియ్యం కార్డుదారులు ఈ–పోస్ యంత్రంపై వేలిముద్రలు వేయనవసరం లేదు. వారి స్థానంలో ప్రతి కార్డుకు గ్రామ, రెవెన్యూ కార్యదర్శి, గ్రామ, వార్డు సహాయకుల వేలిముద్రలతో సరుకులు అందజేస్తారు. మాన్యువల్ రిజిస్టర్ కూడా ఏర్పాటు చేసి దాంట్లో కార్డుదారుల సంతకాలు తీసుకుంటారు. సంతకాలు చేయడం రాకపోతే వేలిముద్రలు తీసుకొని వారి ఫొటోలు కూడా తీసుకుంటారు. ప్రతి డీలర్ వద్ద కార్డుదారుల జాబితా ఉంచుతారు. (జిల్లాల్లో హెల్త్‌కేర్ క్యాంపులు)
ప్రతి సచివాలయంలో వలంటీర్లు వారి క్లస్టర్ పరిధిలోని కార్డుదారుల పేర్లు, ఏ రేషన్ డిపోలో ఉన్నది అనే విషయాలను కార్డుదారులకు తెలియజేస్తారు. ఎవరికైనా రేషన్ కార్డు ఉండి సంబంధిత రేషన్ డిపోలో జాబితాలో పేరు లేకుంటే అటువంటి వారికి పోర్టబులిటి విధానంలో నిత్యావసర వస్తువులను అందజేస్తారు. రేషన్ డిపో వద్ద బకెట్ నిండా నీళ్లు, సబ్బు ఏర్పాటు చేస్తారు. సరుకులు తీసుకునే ముందు.. ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కునే ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment