సాక్షి, అమరావతి: పేదలకు మూడవ విడత ఉచిత సరుకులు ఈ నెల 29 నుంచి మే నెల 10వ తేదీ వరకు పంపిణీ చేయనున్నారు. కరోనా విపత్తు సమయంలో ఉపాధిలేని పేదలకు ఆకలి బాధ ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పటికే రెండు విడతలుగా ఉచిత సరుకులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. మూడో విడత పంపిణీ సందర్భంగా రెవిన్యూ అధికారులకు, డీలర్లకు ప్రత్యేక జాగ్రత్తలు సూచిస్తూ పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు.
► కరోనా నేపథ్యంలో ఒక్కో దుకాణం పరిధిలో రోజుకు 30 మంది లబ్ధిదారులకు టైం స్లాట్ టోకన్లు ఇచ్చి పంపిణీ చేయాలి.
► మొదటి, రెండో విడతల్లో వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారానే రేషన్ అందించగా ఈసారి మాత్రం లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలి.
► అన్ని రేషన్ షాపుల వద్ద శానిటైజర్, మాస్కులు ఉంచాలి.
► ప్రతి లబ్ధిదారుడు బయోమెట్రిక్ ఉపయోగించే ముందు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా డీలర్లు జాగ్రత్త వహించాలి.
ఏడాదికి సరిపడా ఆహార నిల్వలు
సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏడాదికి సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కరోనా వేళ ఆహార ధాన్యాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వద్ద 16.89 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుత రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేస్తున్నందున సెప్టెంబర్ నాటికి మరో 12 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చే అవకాశం ఉందన్నారు. లాక్‌డౌన్ ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్చి 29 నుంచి ఏప్రిల్ 29వ వరకు 1.47 కోట్ల తెల్ల రేషన్ కార్డుదారులకు మూడు విడతలుగా ఉచితంగా బియ్యంతో పాటు కిలో కందిపప్పు లేదా శనగలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడంతో ఈనెల అదనంగా మరో 70 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
ఎఫ్‌సీఐ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం
► రాష్ట్రంలో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) గొడౌన్ల నుంచి ఇటీవల కర్ణాటక, కేరళ, తమిళనాడుకు 1,93,330 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపారు. యానాంకు 189 మెట్రిక్ టన్నులు, అండమాన్ నికోబార్ దీవులకు 304.310 మెట్రిక్ టన్నులు పంపారు.
► వలస కార్మికుల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థల విజ్ఞప్తి మేరకు విశాఖపట్నానికి 10 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సబ్సిడీపై కేటాయించింది.
► ఎఫ్‌సీఐ వద్ద 7.35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 11,082 మెట్రిక్ టన్నుల గోధుమలు అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment