సాక్షి, అమరావతి: ఫిబ్రవరి నెలలో వివిధ కారణాల వల్ల రేషన్ సరుకులు తీసుకోని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. గత నెలలో సరుకులు తీసుకోని 35.18 లక్షల కుటుంబాలకు ప్రభుత్వ తాజా నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది. నాణ్యమైన బియ్యంతోపాటు ఇతర సబ్సిడీ సరుకులను లబ్ధిదారులందరికీ అందించాలనే లక్ష్యంతో గత నెలలో తీసుకోని వారికి రెండు నెలల కోటాను ఒకేసారి అందించే వెసులుబాటు కల్పించింది.
ఈ నెల 10వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుంది. గత నెల నుంచి 9,260 మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 1,45,98,041 బియ్యం కార్డులుండగా.. 1,10,79,333 కార్డుదారులు మాత్రమే ఫిబ్రవరి నెల సరుకులు తీసుకున్నారు. వివిధ కారణాలతో 35,18,708 కార్డుదారులు సరుకులు తీసుకోలేకపోయారు. వలంటీర్లకు మ్యాపింగ్ కాని కార్డుదారులు, వలస కూలీల వంటివారు సరుకులు ఎక్కడ తీసుకోవాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రభుత్వం గుర్తించింది.
వాహనం వద్దనైనా తీసుకోవచ్చు
రేషన్ కార్డుదారులు ఏ మొబైల్ వాహనం వద్దనైనా సరుకులు పొందేవిధంగా ప్రభుత్వం పోర్టబిలిటీ అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ వలంటీర్ పరిధిలోని క్లస్టర్‌కు మ్యాప్ కాని కార్డులు 4,45,388 ఉన్నట్టు గుర్తించారు. ఈ కార్డుదారులు కూడా ఎక్కడైనా సరుకులు తీసుకోవచ్చు. ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటును పేదలు సద్వినియోగం చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment