రాష్ట్రంలో టమాటా మార్కెట్‌కు ఆ ప్రాంతం పెట్టింది పేరు.. కొద్ది రోజులుగా ధర కూడా బాగానే ఉంది.. రోజూ లాగే పెద్ద ఎత్తున రైతులు పంటను మార్కెట్‌కు తీసుకొచ్చారు.. పంట ఎక్కువగా రావడం చూసిన దళారులకు కన్ను కుట్టింది.. వారి కనుసైగలతో నిమిషాల వ్యవధిలో ధర భారీగా పడిపోయింది.. అందరి నోటా ఒకే మాట.. వారు చెప్పిన ధరకే సరుకు అమ్ముకుని పోవాలని హుకుం.. నిశ్చేషు్టలవ్వడం రైతుల వంతైంది.. ఏం చేయాలో పాలుపోక తర్జనభర్జన పడ్డారు.. అంతలో విషయం సీఎం దాకా వెళ్లింది.
ధరల స్థిరీకరణ నిధి ఉపయోగించి సరుకు కొనుగోలు చేయాలంటూ మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి.. ఆ వెంటనే వారు రంగంలోకి దిగారు.. కిలోకు రూ.4 అధికంగా ఇచ్చి కొనుగోళ్లు మొదలు పెట్టారు.. దళారుల దిమ్మ తిరిగిపోయింది.. ఇలాగైతే తమకు సరుకు దక్కదని వారూ ఆదే రేటుకు కొన్నారు. దళారులను అరికడతామని, ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న హామీని సీఎం వైఎస్ జగన్ శనివారం కర్నూలు జిల్లాలో అక్షరాలా అమలు చేసి చూపారు.
సాక్షి, అమరావతి : దళారులు ధరలతో దగా చేయాలనుకున్న తీరు తిరగబడింది. మార్కెట్‌లో టమాటా కొనుగోళ్లు నిలిపేసి రైతులకు ఇబ్బందులు సృష్టించాలనుకున్న వ్యూహం బెడిసి కొట్టింది. ముఖ్యమంత్రి దెబ్బకు దిగొచ్చిన దళారులు గత్యంతంర లేక ధర పెంచి కొనుగోలు చేశారు. మార్కెట్ ఫీజు లేకుండా, ఏజెంట్లకు కమీషన్ ఇవ్వకుండా రైతులకు వంద శాతం న్యాయం జరిగేలా పండ్లు, కూరగాయల అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై నుంచి డీ రెగ్యులేట్ చేసింది. దీంతో తమకు లాభంలేదని భావించిన కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డులోని దళారులు సమస్యలు సృష్టించారు.
మార్కెట్ యార్డులో కొనుగోళ్లు చేస్తే తమకు ఉపయోగం ఉండడం లేదని, లోపల అమ్మకాలు నిలిపివేసి రైతులే బయటకు వచ్చి సరుకు విక్రయించాలని, లేకపోతే కొనుగోళ్లు చేయబోమని బెదిరింపులకు దిగారు. కానీ, రైతులు తాము లోపలే విక్రయాలు చేస్తామని చెప్పడంతో ఇబ్బంది ఏర్పడింది. ఈ సమస్య సీఎం వైఎస్ జగన్ దృష్టికి వెళ్లడంతో వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిపించాలని మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ధరల పతనం కాకుండా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బంది ఉండకూడదని.. ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. వెంటనే మార్కెటింగ్ శాఖ నుంచి కొనుగోళ్లు మొదలు పెట్టాలని ఆదేశించారు.
దీంతో రంగంలోకి దిగిన మార్కెటింగ్ శాఖ.. శనివారం టమాటా కొనుగోళ్లను ప్రారంభించింది. కిలోకు అదనంగా రూ.4 ఇచ్చి కొనుగోళ్లు మొదలెట్టింది. ఇలా 50 టన్నుల టమాటా కొనుగోలు చేసింది. నేరుగా తాము కొనుగోళ్లు జరపడం వల్ల రూ.14, రూ.15 ఉన్న కిలో టమాటా ధర రూ.18, రూ.19కి పెరిగి రైతులకు లాభం చేకూరింది. దీంతో అవాక్కయిన దళారులు తాము నష్టపోతామని భావించి వెంటనే మార్కెట్‌లోనే కొనుగోళ్లు చేయడం మొదలు పెట్టారు. దీంతో వారు కూడా శనివారం 100 మెట్రిక్ టన్నుల టమాటాను కోనుగోలు చేశారు. నాలుగు నెలల్లోనే గిట్టుబాటు ధర విషయమై సీఎం మాట నిలుపుకున్నారని రైతులు ప్రశంసించారు.
దళారులపై ఫిర్యాదు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి వల్ల వెంటనే కొనుగోళ్లు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయగలిగామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఏజెంట్లపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారన్నారు. ఈ ఏడాది జూలై నుంచి మార్కెట్ డి రెగ్యులేషన్‌ను ప్రారంభించామని, దీనివల్ల రైతులకు పూర్తిగా న్యాయం జరుగుతుందని కమిషనర్ చెప్పారు.
ప్రభుత్వం మా పక్షాన నిలిచింది
పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాటా అమ్మకాలు సవ్యంగా జరిగితే రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు సౌకర్యాలు ఉంటాయి. కానీ రైతులకు లాభాలు రాకుండా దళారులు అడ్డుపడుతుంటారు. టమాటా రైతుల కష్టాలను తెలుసుకుని సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించి ఆదేశాలు ఇవ్వడం వల్లనే అధికారులు కదిలి వచ్చి సమస్యను పరిష్కరించారు. – రామచంద్ర,
రైతు, దూదేకొండ, పత్తికొండ మండలం
రైతులకు ఇబ్బంది లేకుండా చేశారు
టమాటా రైతుల ఇబ్బందులపై సీఎం వైఎస్ జగన్ స్పందించడం హర్షణీయం. రైతులకు ఇబ్బంది లేకుండా పత్తికొండ మార్కెట్ యార్డులోనే అమ్మకాలు జరిగేలా చూశారు. గిట్టుబాటు ధర కల్పిస్తామని, దళారుల బెడద లేకుండా చేస్తామని ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాట నిలుపుకున్నారు. గ్రేట్ సీఎంకు ధన్యవాదాలు.
– రాజశేఖర్, రైతు, చక్రాళ్ల, పత్తికొండ మండలం
Comments
Please login to add a commentAdd a comment